తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Student Stabbed In Sydney: సిడ్నీలో భారతీయ విద్యార్థికి కత్తిపోట్లు

Indian student stabbed in Sydney: సిడ్నీలో భారతీయ విద్యార్థికి కత్తిపోట్లు

HT Telugu Desk HT Telugu

14 October 2022, 9:54 IST

  • సిడ్నీలో పీహెచ్‌డీ చదువుతున్న భారతీయ విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడు.

భారతీయ విద్యార్థిపై సిడ్నీలో కత్తిపోట్లు (ప్రతీకాత్మక చిత్రం)
భారతీయ విద్యార్థిపై సిడ్నీలో కత్తిపోట్లు (ప్రతీకాత్మక చిత్రం)

భారతీయ విద్యార్థిపై సిడ్నీలో కత్తిపోట్లు (ప్రతీకాత్మక చిత్రం)

సిడ్నీలోని సౌత్ వేల్స్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చదువుతున్న భారతీయ విద్యార్థి శుభం గార్గ్‌ను గుర్తు తెలియని దుండగుడు 11 సార్లు కత్తితో పొడిచాడు. ఈ సంఘటన అక్టోబర్ మొదటి వారంలో జరిగింది. అతని కుటుంబం సోషల్ మీడియాలో ప్రభుత్వం నుండి సహాయం కోరడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ల‌ను ట్యాగ్ చేస్తూ బాధితుడి సోదరుడు కావ్య గార్గ్ ఒక ట్వీట్ చేశారు.

శుభమ్ బాగోగులు చూసేందుకు వీలుగా కుటుంబ సభ్యులు సిడ్నీకి వెళ్లడానికి అత్యవసర వీసాను మంజూరు చేయాలని కోరారు. ‘నా సోదరుడికి అనేక శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోందని డాక్టర్ చెప్పారు. ఈ విషయంలో తక్షణ సహాయం కోసం ప్రధాన మంత్రిని అభ్యర్థిస్తున్నాను..’ అని కావ్య గార్గ్ గురువారం ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి కూడా సహాయం కోసం జైశంకర్‌ను కోరారు. భారతీయ సంతతికి చెందిన ప్రసిద్ధ ఆస్ట్రేలియన్ వైద్యుడు యాదు సింగ్ శుభమ్ గార్గ్ కుటుంబానికి సహాయం అందించారు. భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్‌ను సంప్రదించారు.

ఆస్ట్రేలియన్ మీడియా నివేదిక ప్రకారం.. దాడి ఘటనకు సంబంధించి 27 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం కింద అభియోగాలు మోపారు. శుభమ్ గార్గ్ ముఖం, ఛాతీ, పొత్తికడుపుపై ​​అనేక కత్తిపోట్లు పడ్డాయి. ‘ఈ సంఘటనకు ముందు బాధితుడు నిందితుడు ఒకరికొకరు తెలుసని భావించడం లేదు..’ అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

దాడి చేసిన వ్యక్తి శుభమ్ గార్గ్ నుండి నగదు డిమాండ్ చేశాడు. నిరాకరించడంతో సంఘటన స్థలం నుండి పారిపోయే ముందు అతడిని చాలాసార్లు కత్తితో పొడిచాడు. ఇది జాతి వివక్షతో కూడిన దాడిగా అనుమానిస్తున్నారు.