Chinese ex President Jiang Zemin dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మృతి
30 November 2022, 16:11 IST
Chinese ex President Jiang Zemin dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 96 ఏళ్లు. చైనాలో ఆర్థిక సంస్కరణలకు ఆయన గట్టి మద్దతుదారు.
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (ఫైల్ ఫొటో)
Chinese ex President Jiang Zemin dies: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. బ్లడ్ కేన్సర్ తో బాధపడుతూ, కొన్నాళ్లుగా షాంఘైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జెమిన్.. బహుళ అవయవ వైఫల్యంతో బుధవారం చనిపోయారు.
Supporter of economic reforms: ఆర్థిక వృద్ధికి ఆద్యుడు
జియాంగ్ జెమిన్ 1993 నుంచి 2003 వరకు చైనా అధ్యక్షుడిగా పని చేశారు. అలాగే, 1989 నుంచి 2002 వరకు శక్తిమంతమైన చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనే సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అనే పదాన్ని మొదట ఉపయోగించారు. జియాంగ్ జెమిన్ చైనాలో చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టారు. మార్కెట్ అనుకూల సంస్కరణలకు మళ్లీ తెర తీశారు. జెమిన్ హయాంలో చైనా ఆర్థిక వృద్ధి రికార్డు స్థాయిలో పరుగులు తీసింది. ఆయన హయాంలోనే, 1997లో హాంకాంగ్ ను బ్రిటిష్ పాలన నుంచి చైనా ఆధీనంలోకి తీసుకువచ్చారు. అలాగే, జెమిన్ దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే. 2001లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(World Trade Organization)లో చైనా చేరింది. అలాగే, చైనా కమ్యూనిస్ట్ పార్టీలో చేరే అవకాశం పెట్టుబడిదారులకు కల్పించారు.
Jiang Zemin dies: హక్కుల కార్యకర్తలపై ఉక్కుపాదం
జియాంగ్ జెమిన్ హయాంలో మానవ హక్కుల కార్యకర్తలపై ఉక్కుపాదం మోపారు. వందలాదిగా ప్రజాస్వామ్య వాదులను జైలుపాలు చేశారు. ఫలున్ గాంగ్ స్పిరిచ్యువల్ మూవ్ మెంట్ ను నిషేధించారు. 2003లో అధ్యక్ష పీఠం నుంచి వైదొలగినప్పిటికీ.. అధికార కమ్యూనిస్ట్ కార్యకలాపాల్లో జెమిన్ క్రియాశీల పాత్ర పోషించారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు జిన్ పింగ్ కూడా జియాంగ్ జెమిన్ అనుసరించిన ఆర్థిక విధానాలు, కఠిన రాజకీయ ఆంక్షల విధానాన్నే అనుసరిస్తున్నారు.
Jiang Zemin dies: అంత్యక్రియలు ఎప్పుడు?
జియాంగ్ జెమిన్ మృతికి సంతాపంగా దేశవ్యాప్తంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేస్తారని చైనా అధికార మీడియా తెలిపింది. అంత్యక్రియలు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేస్తారనే విషయం త్వరలో ప్రకటిస్తారని వెల్లడించింది.
టాపిక్