Delhi Budget: ‘తొలిసారి ఇలా’: కేజ్రీవాల్ - కేంద్రం మధ్య కొత్తగా ‘బడ్జెట్’ రగడ
21 March 2023, 8:28 IST
Delhi Budget: నేడు అసెంబ్లీ ముందుకు రావాల్సిన ఢిల్లీ బడ్జెట్ నిలిచిపోయింది. ఈ విషయంపై ఆమ్ఆద్మీ, బీజేపీ మధ్య కొత్త గొడవ మొదలైంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
Delhi Budget: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP)కి, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ బడ్జెట్ అంశంలోనూ ఇదే కొనసాగింది. ఢిల్లీ బడ్జెట్‍ను నేడు (మార్చి 21) అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. కేంద్రం నుంచి ఇంకా ఆమోదం లభించలేదని ఆమ్‍ఆద్మీ ప్రకటించింది. చరిత్రలో తొలిసారి ఢిల్లీ బడ్జెట్‍ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చెప్పారు. అయితే బడ్జెట్‍పై ఉన్న అభ్యంతరాలను సరైన సమయానికే ఢిల్లీ ప్రభుత్వానికి చెప్పామని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తెలిపారు. వివరాలివే..
Delhi Budget: ఢిల్లీ బడ్జెట్‍ను ఆమ్ఆద్మీ ప్రభుత్వం అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ప్రకటనల కోసం బడ్జెట్‍లో ఎక్కువ కేటాయింపులు ఉన్నాయన్న కారణంతో కేంద్ర హోంశాఖ ఈ బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదించలేదు. అయితే ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ తమకు ఆలస్యంగా తెలిపారని ఢిల్లీ ఆర్థిక మంత్రి కైలాశ్ గహ్లోత్ అంటున్నారు. మొత్తానికైతే మంగళవారం ఢిల్లీ బడ్జెట్.. అసెంబ్లీ ముందుకు రాదని తేలిపోయింది.
'దౌర్జన్యమే ఇది'
Delhi Budget: ఢిల్లీ బడ్జెట్‍ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం దౌర్జన్యంగా ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఉండదని సోమవారం ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. “భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. ఢిల్లీ బడ్జెట్ రేపు (మంగళవారం) ప్రవేశపెట్టాల్సింది. కానీ మా బడ్జెట్‍ను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. రేపు ఉదయం ఢిల్లీ బడ్జెట్ రాదు. నేటి నుంచే ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, టీచర్లు జీతం పొందలేరు. ఇది ముమ్మాటికీ దౌర్జన్యమే” అని సోమవారం ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ చెప్పారు.
Delhi Budget: అయితే, మార్చి 9వ తేదీనే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్‍మెంట్‍కు ఆమోదం తెలిపి, సీఎంకు ఫైల్ పంపినట్టు లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్ వెల్లడించింది. ఆ తర్వాత బడ్జెట్ ఆమోదం కోసం రాష్ట్రపతిని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. కేంద్ర హోం శాఖకు బడ్జెట్‍ను పంపింది. అయితే ఈ బడ్జెట్‍పై మార్చి 17న కేంద్ర హోం శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రకటనలకు ఢిల్లీ ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందని, మార్పులను ప్రతిపాదించింది హోం శాఖ.
Delhi Budget: అయితే, హోం శాఖ అభ్యంతరాలను తమకు తెలుపకుండా మూడు రోజుల పాటు చీఫ్ సెక్రటరీ కాలయాపన చేశారని ఢిల్లీ ఆర్థిక మంత్రి కైలాశ్ గహ్లోత్ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఈ విషయం తనకు తెలిసిందని అన్నారు. దీనిపై విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. ఆ తర్వాత సవరణలతో బడ్జెట్‍ను మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి పంపారు. లిక్కర్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యాక ఆర్థిక శాఖ బాధ్యతలను గహ్లోత్ తీసుకున్నారు.
Delhi Budget: తాము బడ్జెట్‍లో మౌలిక సదుపాయాల కోసం రూ.22,000 కోట్ల కేటాయిస్తే.. ప్రకటనల కోసం కేవలం రూ.550 కోట్ల మాత్రమే కేటాయించామని ఢిల్లీ ఆర్థిక మంత్రి అన్నారు. ప్రకటనలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నామన్న ఆరోపణ సరైనది కాదని చెప్పారు.
ఆమ్ఆద్మీనే కారణం
Delhi Budget: అయితే, ఆమ్ఆద్మీ ప్రభుత్వం కావాలనే బడ్జెట్‍ను ఆలస్యం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. అభ్యంతరాలను తెలిపినా సరైన సమయంలో ఢిల్లీ ప్రభుత్వం స్పందించలేదని బీజేపీ అధికార ప్రతినిధి హరిశ్ ఖురానా అన్నారు. ఢిల్లీ బడ్జెట్ ఆగిపోయింది ఆమ్ఆద్మీ వల్లేనని, హోంశాఖ వల్ల కాదని చెప్పారు.