World Sleep Day । భారతీయులకు ప్రతి రాత్రి జాగారమే, రోజూ అదే పని.. కాస్తైనా నిద్రపోవాలి!
17 March 2023, 16:51 IST
- World Sleep Day: మనలో చాలా మంది రాత్రిళ్లు మెలకువగానే ఉంటున్నారు. నిద్ర అనేది తగ్గిపోతుంది, అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి. భారతీయులలో నిద్రలేమి సమస్యలు ఎక్కువ. కారణాలు, పరిష్కార మార్గాలు చూడండి.
World Sleep Day
World Sleep Day: జపాన్ తర్వాత అత్యధికంగా నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. కనీసం ఏడు గంటల రాత్రి నిద్ర కలిగి ఉండాలని ఆరోగ్య నిపుణుల సిఫార్సులు ఉన్నాయి, అయినప్పటికీ మన దేశంలో చాలా మంది 5 గంటలు కూడా నిద్రపోవడం లేదని అధ్యయనాల ప్రకారం తెలుస్తుంది. ఈరోజున నిద్ర దినోత్సవం! దీనిని ఎందుకు నిర్వహిస్తారు? నిద్రలేమికి గల కారణాలు, వేళకు నిద్ర రావడానికి చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతీ ఏడాది మార్చి 17వ తేదీన 'ప్రపంచ నిద్ర దినోత్సవం' గా పాటిస్తారు. ఇది ఆరోగ్యం విషయంలో నిద్ర ప్రాముఖ్యతను, ఇది నిద్రకు సంబంధించిన సమస్యల గురించి అవగాహనను కల్పిస్తుంది. 'ఆరోగ్యానికి నిద్ర అవసరం' అనేది ఈ సంవత్సరం, ప్రపంచ నిద్ర దినోత్సవం థీమ్.
Insomnia Reasons- నిద్రలేమికి కారణాలు
నేషనల్ స్లీప్ సర్వే ప్రకారం, నిద్రలేమి సమస్య ఉన్నవారిలో దాదాపు 54% మంది రాత్రిళ్లు డిజిటల్, సోషల్ మీడియాలో సమయం గడిపే అలవాట్లను కలిగి ఉన్నారు. ఇలాంటి వారిలో నిద్ర రొటీన్ సరిగా ఉండదు.
ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం భారతదేశంలో దాదాపు 87% మంది పడుకునే ముందు తమ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు, దీనివల్లే ఎక్కువ మంది భారతీయులు అసలు నిద్రపోవడం లేదని వెల్లడైంది. రాత్రి సరైన నిద్రలేక చాలా మంది పనివేళల్లో నిద్రపోతున్నట్లు సర్వే తెలిపింది. ఇందులో 56% మంది పురుషులు ఉండగా, 67% మంది మహిళలు ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నిద్రలేమి సమస్యలు ఉన్నవారు 21% పెరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందడం, నిరంతరం అలసిపోవడం లేదా ఏకాగ్రత కోల్పోవడం వంటివి నిద్ర లేమికి సంకేతాలు కావచ్చు.
Tips To Fall Asleep Quickly- వేళకు నిద్రపోవడానికి ఈ టిప్స్ పాటించండి
- నిద్ర కోసం ప్రత్యేకమైన షెడ్యూల్‌ని పెట్టుకోండి, ప్రతిరోజూ దానికి కట్టుబడి ఉండండి. ఈ రెగ్యులర్ రొటీన్‌తో నిద్రవేళ సమీపిస్తున్న కొద్దీ మీరు నిద్రపోవాలని భావిస్తారు, తద్వారా నిద్రలేమి సమస్యను నివారించవచ్చు.
- మధ్యాహ్నం 2:00 గంటలలో తర్వాత కాఫీలు, ఇతర కెఫీన్ కలిగిన పానీయాలు తీసుకోకండి.
- నిద్రపోయే 3 గంటల ముందు మద్యం సేవించకండి. నిద్రవేళకు మూడు గంటల ముందు రాత్రి భోజనం పూర్తి చేసేయాలి, ఆ లోపే అలవాటు ఉన్నవారు ఒకటి లేదా రెండు గ్లాసుల వైన్ సేవించవచ్చు.
- ప్రతిరోజూ వ్యాయామం చేయండి, కానీ మీ నిద్రవేళకు చాలా దగ్గరగా వ్యాయామం చేయకుండా జాగ్రత్త వహించండి. దీనివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది.
- ప్రతి ఉదయం 8 గంటల లోపు 15 నిమిషాల సూర్యకాంతి పొందండి, ఇది మీ సర్కాడియన్ గడియారాన్ని రీసెట్ చేయడంలో సహాయపడుతుంది, నాణ్యమైన నిద్రను అందిస్తుంది.
- రాత్రిపూట డిజిటల్ పరికరాల నుంచి పూర్తిగా దూరంగా ఉండండి. దీనివల్ల మెలటోనిన్ స్థాయిలు పెరిగి వేగంగా నిద్రరావడంలో సహాయపడుతుంది, మరుసటి రోజు మగత అనేది ఉండదు.
- పుదీనా ఆకులు, అజ్వైన్ డికాక్షన్ వాటర్‌తో ఆవిరి పీల్చడం వల్ల వాయుమార్గాలు తెరుచుకుంటాయి, ముఖ్యంగా స్లీప్ అప్నియా సందర్భాలలో ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. ఇదే కాకుండా రాత్రికి ప్రశాంత భావాలను కలిగించే పానీయాలు ఉన్నాయి, వాటిని సేవించవచ్చు.
నిద్రవేళలో మీ కళ్లనే కాదు మీ మనసును మీ ఆలోచనలను అన్నింటిని షట్ డౌన్ చేసేయండి, హాయిగా నిద్రపోండి. హ్యాపీ స్లీప్ డే, స్వీట్ డ్రీమ్స్.. గుడ్ నైట్!