తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleep Promoting Herbs । ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహించే సహజమైన మూలికలు ఇవే!

Sleep Promoting Herbs । ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహించే సహజమైన మూలికలు ఇవే!

HT Telugu Desk HT Telugu

08 January 2024, 20:31 IST

google News
    • Sleep Promoting Herbs:  మీరు రాత్రివేళలో సరిగ్గా నిద్రపోవడం లేదా? మీకు వెంటనే నిద్ర కలిగించే సహజమైన మూలికలు కొన్ని ఉన్నాయి, అవి ఇక్కడ చూడండి.
Sleep Promoting Herbs
Sleep Promoting Herbs (Unsplash)

Sleep Promoting Herbs

మనిషికి ప్రతిరోజూ గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. సరైన నిద్రలేకపోతే శరీరం అలసిపోతుంది, ఏ పని చేయలేదు. వరుసగా మూడు రోజులు నిద్ర లేకపోతే అది చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీసి ప్రాణాంతకం కూడా కావొచ్చునని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక సాధారణ వ్యక్తికి ప్రతిరోజు 7 నుండి 9 గంటల నాణ్యమైన రాత్రి నిద్ర అవసరం. కానీ కొన్నిసార్లు కంటినిండా నిద్రను పొందడం కష్టంగా ఉంటుంది. ఇటీవల కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిద్రలేమి తరచుగా అవిశ్రాంత జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి,ఆందోళనల కారణంగా ఉంటుంది.

అయితే కొన్ని మూలికలు నిద్రలేమి సమస్యకు సహజంగా పరిష్కారం చూపుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ మూలికలు ఉత్తేజితమైన నరాలను శాంతపరుస్తాయి, ఇంద్రియాలను శాంతింపజేస్తాయి, తద్వారా రాత్రికి ప్రశాంతమైన నిద్రను అందిస్తాయని అంటున్నారు.

Sleep Promoting Herbs- నిద్రను ప్రోత్సహించే మూలికలు

ఒత్తిడి వలన న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ హార్మోన్ ప్రభావితం అవుతుంది, ఇది నిద్రలేమికి కారణం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని సహజ మూలికలు తీసుకోవడం వలన సెరటోనిన్ హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ఈ రకంగా ప్రశాంతమైన భావన కలిగి మంచి నిద్రను పొందవచ్చు. నిద్రను ప్రోత్సహించే ఆ మూలికలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

లావెండర్- Lavender

లావెండర్‌లోని యాంటీ-డిప్రెసివ్, సెడేటివ్, శాంతపరిచే గుణాలు మీకు మంచి నిద్ర కలగడానికి సహాయపడతాయి. లావెండర్ మూలికలు మీ నరాలను సడలించడం, ఆందోళన స్థాయిలను తగ్గించడం, మానసిక రుగ్మతలను స్థిరీకరించగలవని అధ్యయనాలు చూపిస్తున్నాయి. తగ్గిన ఒత్తిడి, ఆందోళన మరియు సానుకూల మానసిక స్థితి పగటిపూట మేల్కొలుపు మరియు రాత్రి మరింత స్థిరమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. పడకగదిలో లావెండర్ సువాసనలు వెదజల్లడం చేయడం ద్వారా హాయిగా నిద్రపోవచ్చు.

క్యామొమైల్- Chamomile

క్యామొమైల్ లేదా గడ్డి చామంతి పువ్వు అనేది దాని విశ్రాంతి ప్రభావాలకు ప్రసిద్ధి చెందిన పురాతన ఔషధ మూలిక. ఇది ఆందోళనను తగ్గిస్తుంది, మీ నరాలను ఉపశమనం ఇస్తుంది, నిద్రలేమిని తగ్గిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, ప్రసవించిన బాలింతలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా మూడ్ స్వింగ్స్ అధికంగా ఉంటాయి, నిద్రలేమితో ఇబ్బంది పడతారు. అలాంటి వారికి రెండు వారాల పాటు రాత్రి క్యామొమైల్ టీ తాగించడంద్వారా వారు సరిగ్గా నిద్రపోవడంతో పాటు, వారిలో డిప్రెషన్ స్థాయిలు తగ్గాయి. క్యామొమైల్ టీ లేదా గడ్డిచామంతి పువ్వులతో తయారు చేసే టీలో నరాలను సడలించే ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. అందువల్ల ఇది ఒక ప్రసిద్ధ ట్రాంక్విలైజింగ్ డ్రింక్‌గా మారింది. క్యామొమైల్ వాసనను పీల్చడం ద్వారా కూడా మీరు దాని ఓదార్పు ప్రభావాన్ని అనుభవించవచ్చు.

పాషన్ ఫ్లవర్- Passion Flower

జుముకి పువ్వు లేదా పాషన్‌ఫ్లవర్‌లో నరాలను సడలించే ఫ్లేవనాయిడ్‌లు ఉన్నాయి, ఇవి ఒత్తిడిని తగ్గించి, బాగా నిద్రపోవడానికి మీకు సహాయపడతాయి. ఈ ఉష్ణమండల పుష్పం మంచి రుచిని కలిగి ఉంటుంది. సాధారణంగా దీనిని ఒక ఔషధ మూలికగా పరిగణిస్తారు. ఓవర్-ది-కౌంటర్ మత్తుమందుల తయారీలో ఉపయోగిస్తారు.

అశ్వగంధ- Ashwagandha

అశ్వగంధ అనేది నిద్రలేమిని ఎదుర్కోవడానికి సాధారణంగా ఉపయోగించే ఆయుర్వేద ఔషధ మూలిక. ఇది పడుకునే వెంటనే నిద్రపోవడానికి, విశ్రాంతి నాణ్యతను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు చూపించాయి. అశ్వగంధలోని ఇవి ఆకులలో నిద్రను ప్రోత్సహించే సమ్మేళనాలు ఎక్కువగా కనిపిస్తాయి.ఇవి ఒత్తిడి లేదా ఆందోళన భావాలను తొలగించడానికి, ప్రశాంతతను, సులభంగా నిద్రపోవడాన్ని ప్రేరేపిస్తాయి. అశ్వగంధ అంతిమంగా మత్తుమందులా పనిచేస్తుంది, కాబట్టి ఫార్మసీలో లభించే స్లీపింగ్ టాబ్లెట్లకు ఇది సహజ ప్రత్యామ్నాయం. అయితే వైద్యుల సలహా మేరకే దీనిని తీసుకోవడం ఉత్తమం.

వలేరియన్- Valerian

వలేరియన్ హెర్బ్ వేర్లను తరచుగా నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం, ఆందోళనకు చికిత్స చేయడానికి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. వలేరియన్ వేరులోని వాలెరినిక్ యాసిడ్.. న్యూరోట్రాన్స్మిటర్ GABA విచ్ఛిన్నతను నిరోధిస్తుంది. ఇది మెరుగైన నాణ్యమైన నిద్రను ప్రేరేపిస్తుంది. వలేరియన్ యాంటి యాంగ్జైటీ ఔషధాల సూత్రాలపై పనిచేస్తుంది. ఇది గాఢ నిద్రను ప్రోత్సహిస్తుంది. వలేరియన్ అనేక ఫార్మసీ దుకాణాలలో లభిస్తుంది, సాధారణంగా మాత్రల రూపంలో వస్తుంది.

ఈ మూలికలను టీ రూపంలో తాగవచ్చు. మీ వైద్యులు సూచించిన మోతాదు మేరకు మూలికలను ఉపయోగించాలి. సాధారణంగా ఒక కప్పు వేడినీటికి 1 స్పూన్ మూలికలను జోడించడం ద్వారా హెర్బల్ టీని తయారు చేస్తారు. దీన్ని 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై వడకట్టి త్రాగాలి. ఒక రోజులో రెండు నుండి మూడు కప్పుల హెర్బల్ టీని త్రాగవచ్చు.

తదుపరి వ్యాసం