Sleeplessness | వరుసగా మూడు రోజుల పాటు నిద్రలేకపోతే కలిగే దుష్ప్రభావాలు ఇవే!-what happens to the body if you someone experience sleeplessness for days ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeplessness | వరుసగా మూడు రోజుల పాటు నిద్రలేకపోతే కలిగే దుష్ప్రభావాలు ఇవే!

Sleeplessness | వరుసగా మూడు రోజుల పాటు నిద్రలేకపోతే కలిగే దుష్ప్రభావాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Aug 25, 2022 10:22 PM IST

నిద్రలేమి (Sleeplessness)తో వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు. వరుసగా మూడు రోజుల పాటు నిద్రలేకపోతే ఏమవుతుంది? దీర్ఘకాలికంగా నిద్రలేమితో కలిగే దుష్ప్రభావాలు.. ఇందుకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి.

Sleeplessness
Sleeplessness (Unsplash)

సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మాత్రమే కాదు సరిపడా నిద్రపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెదడు సరైన రీతిలో పనిచేయాలన్నా, శరీరం ఎల్లప్పుడు చురుకుగా ఉండాలన్నా, వ్యాధుల నుంచి రక్షణ కోసం రోగనిరోధక శక్తి కలిగి ఉండాలన్నా ఇవన్నీ మంచి నిద్రతోనే ముడిపడి ఉంటాయి. కడుపు నిండా తిండి ఉండగానే చాలదు, కంటినిండా నిద్ర కూడా కచ్చితంగా ఉండాలి. ఈ నిద్ర లేకపోతే వ్యక్తుల మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. ఎల్లప్పుడూ ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతూ ఇతరులను కూడా ఒత్తిడికి గురిచేస్తారు.

ఒక సాధారణ వ్యక్తి ప్రతిరోజు రాత్రి కనీసం 6-8 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేని నిద్ర కలిగి ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి నిద్రించే సమయం ఇంతకంటే తక్కువ ఉంటే వారు ఆ మరుసటి రోజు అలసట, నీరసం, ఇతరులతో కోపంగా వ్యవహరించటం వంటివి చేస్తారని నిపుణులు అంటున్నారు. అదేవిధంగా ఈ నిద్రలేమి (Sleeplessness) సమస్య రెండు-మూడు రోజులు కొనసాగితే, అది అనేక ఇతర శారీరక, మానసిక దుష్ప్రభావాలను కలిగిస్తుంది. రెండు-మూడు రోజులు తగినంత నిద్ర పొందలేకపోతే దాని కొన్ని ప్రభావాలు ఎలా ఉంటాయో ఇక్కడ పరిశీలించండి.

నిద్రలేమితో స్వల్పకాలిక సమస్యలు

రెండు-మూడు రోజులుగా మీ నిద్ర చెదిరిపోతే, అది కొన్ని స్వల్పకాలిక దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. ఇందులో భాగంగా మీలో చురుకుదనం లోపించినట్లు అనిపిస్తుంది. పగటిపూట నిద్రపోవడం పెరుగుతుంది. తద్వారా మీలో బద్ధకం కూడా పెరుగుతుంది. అలసట సమస్య కూడా ఉండవచ్చు. కొన్ని విషయాలు మరిచిపోవచ్చు. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. చిన్న విషయాలకు కూడా ఒత్తిడి, ఆందోళనలను అనుభవిస్తూనే ఉండవచ్చు.

నిద్రలేమితో దీర్ఘకాలిక దుష్ప్రభావాలు

మీరు దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యను అనుభవిస్తుంటే అది దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఊబకాయం, డిప్రెషన్, రోగనిరోధక వ్యవస్థ సమస్యలు, సెక్స్ డ్రైవ్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదమూ ఉంది.

నిపుణుల సలహా ఏమిటి?

సరిపడా నిద్రపోవడం ప్రతి ఒక్కరికీ అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు నిద్రలేని సమస్యను తరచుగా ఎదుర్కొంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి. చికిత్స ద్వారా నిద్రలేమికి పరిష్కారం చూపవచ్చు.

ఇదే కాకుండా నిద్రలేమి సమస్యను దూరం చేసుకునేందుకు మీ వంతు ప్రయత్నం చేయాలి. రాత్రి పడుకునే ముందు ఆలోచనలు మానేయాలి. నెగెటివ్ ఆలోచనలు అసలు రానీయకూడదు. మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ వాడకూడదు. స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. మధ్యాహ్నం ఎక్కువగా నిద్రపోకూడదు, రాత్రిపూట పడకగదిని నిశ్శబ్దంగా, చీకటిగా ఉంచాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి మంచి సంగీతాన్ని వినాలి. మాంసాహారం మితంగా తినాలి. సిగరెట్లు, మద్యపానం వదిలేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. యోగా, ధ్యానం లాంటివి చేయాలి.

WhatsApp channel

సంబంధిత కథనం