Sleeping: నిద్ర పట్టడం లేదా.. అయితే ఈ చిట్కాలు పాటించి హాయిగా నిద్రపోండి!
ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం ఎనిమిది గంటల నిద్ర పోవాలి. మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతుంటారు.
చాలా మందికి రాత్రి సమయాల్లో ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. నిద్ర లేమి కారణంగా నీరసం, చిరాకు, మానసిక ఇబ్బందులు ఏర్పడుతాయి. ఇది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సాధరణంగా ఒత్తిడి నిద్రను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలం నిద్ర లేమి కొనసాగడం వల్ల హృదయ సంబంధ రుగ్మతలు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. అయితే కొన్ని సాధరణ చిట్కాలు పాటించడం ద్వారా సులువుగా నిద్ర లేమి నుండి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు.
రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల నిద్రను మెరుగుపరచుకోవచ్చు. తగినంత వ్యాయామం, శారీరక శ్రమ వల్ల శరీరం రాత్రిపూట అలసిపోతుంది దీంతో తొందరగా నిద్ర పడుతుంది. చాలా మంది పగటిపూట ఎక్కువసేపు నిద్ర పోతుంటారు. అయితే పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల రాత్రిళ్లు నిద్ర పట్టదు. పగలు అలసటగా ఉంటే చిన్న కునుకు తీయండి అంతేకానీ గంటలు.. గంటలు నిద్రపోకండి.
ప్రతి రోజూ రాత్రి నిర్ణీత సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే నిర్ణీత సమయానికి కూడా లేవడం అలవాటు చేసుకోవడం వల్ల సరైన టైంకు నిద్ర పడుతుంది. పడకగదిలో నిద్రపోయే వాతావరణం ఉండాలి. భోజనం చేసిన వెంటనే పడుకోకండి. పడుకునే ముందు కనీసం మూడు గంటల వరకు ఏమీ తినకూడదు. టీ లేదా కాఫీ వంటివి తాగవద్దు. నిద్రపోయే ముందు శరీరంపై ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఇష్టమైన పుస్తక పఠనం, దీర్ఘ శ్వాసలు, ధ్యానం అందుకు ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో, వేడి నీటి స్నానం గాఢ నిద్రకు సహాయపడతుంది. పడుకునే ముందు తేలికపాటి వ్యాయామం చేయండి. దీంతో శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. కండరాల సడలింపు వల్ల గాఢ నిద్ర పోవచ్చు.
సంబంధిత కథనం