Ashwagandha Benefits | ఆడవారు అశ్వగంధ తీసుకుంటే జరిగేది ఇదే!
ఆడవారికి సంబంధించిన అనేక సమస్యలకు ఆయుర్వేదంలో పరిష్కారాలు ఉన్నాయి. స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి అశ్వగంధ ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో ఎలాంటి అనారోగ్య సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మన చుట్టూ ప్రకృతి సిద్ధంగా లభించే మొక్కలనే ఔషధాలుగా ఉపయోగిస్తారు. ఇందులో అశ్వగంధ కూడా ఒకటి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పురాతన ఔషధ మొక్క. అశ్వగంధ అనేక ప్రాణాంతక వ్యాధులను నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచే, స్త్రీ-పురుషులలో సంతాన సామర్థ్యాన్ని పెంచే గుణాలు సైతం ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. కరోనా కాలంలో వ్యాధి సంక్రమణను నివారించడానికి అశ్వగంధ వాడకం పెరిగింది.
స్త్రీలకు సంబంధించిన వ్యాధులలో అశ్వగంధ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అశ్వగంధ మూలికలతో ప్రత్యేకంగా స్త్రీలకు ఎలాంటి మేలు కలుగుతుందో ఇక్కడ తెలుసుకోండి.
అధిక బరువు నియంత్రణకు
అధ్యయనాల ప్రకారం, అశ్వగంధ బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అశ్వగంధలో జీవక్రియను వేగవంతం చేసే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అధిక బరువు ఉన్న స్త్రీలు కొవ్వును కరిగించటానికి వారికి సిఫారసు చేసిన మోతాదులో అశ్వగంధను తీసుకోవచ్చు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ , ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
థైరాయిడ్ సమస్యకు
థైరాయిడ్ సమస్య పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్న స్త్రీలలో హర్మోన్ల అసతుల్యత కలుగుతుంది. గర్భధారణలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి థైరాయిడ్ సమస్య కలిగిన స్త్రీలకు అశ్వగంధ వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి.
నెలసరి క్రమబద్దీకరణ కోసం
పీరియడ్స్ ఆలస్యంగా రావడం, ఋతుక్రమం సరిగా రాకపోవడం, పీరియడ్స్ నొప్పులు, సంతానోత్పత్తి సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వలన కలిగే శారీరక మార్పులు, ముఖంలో వెంట్రుకలు పెరగడం వంటి సమస్యలు ఉన్న మహిళలు అశ్వగంధను తీసుకుంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది. రుతుచక్రం సక్రమంగా జరుగుతుంది.
స్త్రీ పునరుత్పత్తి సమస్యలు
ఒత్తిడి, ఆందోళనలు, హార్మోన్ల అసమతుల్యత కారణంగా స్త్రీలకు తమ పునరుత్పత్తి వ్యవస్థలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఇది వారిని మానసికంగా కూడా కుంగదీసి మరింత మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది. ఇలాంటి సందర్భంలో అశ్వగంధ వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. అశ్వగంధను తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది.
ఇక్కడ ముఖ్య గమనిక ఏమిటంటే, ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యకైనా ముందుగా డాక్టర్లను సంప్రదించి ఆ మేరకు నడుచుకోవటమే అత్యుత్తమం. ఇక్కడ అందించే సలహాలు కేవలం మీలో ఆరోగ్య స్పృహను కలిగించి, మీకు ఒక మార్గం చూపడం కోసం మాత్రమే అని గ్రహించాలి.
సంబంధిత కథనం