Sleep Peacefully । ప్రశాంతంగా నిద్రపోండి.. ఆ ఒక్క చిట్కాతో ఆలోచనలు దూరం!
24 January 2023, 21:09 IST
- Tips To Sleep Peacefully: ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి చూడండి, ముఖ్యంగా 5వ, 6వ చిట్కాలు మీకు బాగా ప్రయోజనం చేకూరుస్తుంది.
Tips To Sleep Peacefully
మీరు ఉదయం నిద్రలేవగానే తాజాగా, హుషారుగా అనిపించాలి, అప్పుడు మీరు రాత్రి నాణ్యమైన నిద్రపోయినట్లు అర్థం. కానీ నిద్రలేచిన తర్వాత ఇంకా నిద్రపోవాలి అనిపించడం, కళ్లు మండుతున్నట్లుగా మూసుకుపోతున్నట్లయితే మీకు నిద్ర చాలలేదు. ఇలాంటి పరిస్థితే కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్నారంటే మీరు నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అర్థం.
ప్రతీ వ్యక్తికి రాత్రి పూట కనీసం 7-8 గంటలు నిరాటంకమైన నిద్ర అవసరం. ఇది తగ్గినట్లయితే మీలో ఏకాగ్రత లోపిస్తుంది, దినమంతా చాలా నీరసంగా, అలసిపోయినట్లుగా ఉంటారు. ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, అధిక రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్, ఊబకాయం, డిప్రెషన్ మొదలైన తీవ్రమైన అనారోగ్య సమస్యలన్నీ నిద్రలేమితో ముడిపడి ఉంటాయని గుర్తుంచుకోండి.
Tips To Sleep Peacefully- ప్రశాంతంగా నిద్రపోయేందుకు చిట్కాలు
మీరు ప్రశాంతంగా నిద్రపోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, ఇవి పాటించి చూడండి.
1. రిలాక్స్ అవ్వండి
రోజంతా పని చేసిన తర్వాత, రాత్రి వేళలో వీలైనంత త్వరగా హాయిగా భోజనం చేసి, విశ్రాంతంగా ఉండండి. ఇక ఏ పని లేదు, నిద్రపోవడం ఒకటే పని అన్నట్లుగా మీ ఆలోచనలు ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన సంభాషణలు చేయండి. పడకను సర్దుబాటు చేసుకోవడం, వదులైన దుస్తులు ధరించడం మొదలైనవి అన్నీ మీరు నిద్రపోవడానికి సిద్ధం అవుతున్నారని మీ మెదడుకు సంకేతాలు పంపుతాయి.
2. మ్యూజిక్ థెరపీని ప్రయత్నించండి
మీరు రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత భోజనం చేసేటపుడు గానీ, భోజనం తర్వాత గానీ వార్తలు చూడటం, సీరియల్స్ చూడటం వంటివి చేయకండి. అలాగే ఎలాంటి ఫిర్యాదులు వినకండి. బదులుగా మీరు ఆనందించే సంగీతాన్ని ఉంచండి. శాస్త్రీయ సంగీతం వినడం వల్ల రక్తపోటు, ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ మీకు నచ్చిన మెలడీ పాటలు, పాత పాటలు వినడం వల్ల మంచి అనుభూతిని పొందవచ్చు.
3. ఈ అలవాట్లు మానేయండి
సాయంత్రం వేళల్లో కాఫీ, కెఫీన్ వంటి పానీయాలు తీసుకోవద్దు, ధూమపానం చేయవద్దు. ఇవి మిమ్మల్ని రాత్రి వేళలో కూడా చురుకుగా ఉండేలా చేస్తాయి. మద్యపానం కూడా చేయవద్దు. మద్యం మీకు తాత్కాలిక మత్తును ఇస్తుంది కానీ నిద్ర పుచ్చదు. మీకు ఎక్కువ ఆలోచనలు రేకెత్తేలా చేస్తుంది. నిద్రవేళ సమీపిస్తున్నపుడు అజీర్తిని కలిగించే ఆహారాలు తీసుకోవద్దు.
4. గదిని చీకటి చేయండి
మీరు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మీ గదిని చీకటి చేయడం వలన నిద్రపోవాలనే ఆలోచన కలుగుతుంది. మీకు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి డిమ్మర్ స్విచ్‌లు లేదా కొవ్వొత్తులను కూడా ఉపయోగించవచ్చు, తేలికపాటి సుగంధపు వాసనలను గదిలో వెదజల్లవచ్చు. ఇవి మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి మార్గాన్ని పరుస్తాయి.
5. స్క్రీన్‌కు ఆమడ దూరం
మీకు నిద్రలేమి సమస్యలు ఉన్నపుడు రాత్రి నిద్రపోయేటపుడు మీ మొబైల్, ల్యాప్‌టాప్ వంటివి మీకు అందుబాటులో లేకుండా చూసుకోండి. వీలైతే వాటిని వేరే గదిలో దూరంగా పెట్టి ఉంచండి. అవసరం అయితే స్విచ్ ఆఫ్ కూడా చేసేయండి.
6. శ్వాసపై ధ్యాస
నిద్రపోయే ముందు లేదా నడి రాత్రిలో ఏవో ఆలోచనలు రేకెత్తితే.. మీ గుండెపై చేయి వేసి దాని లయను అనుభూతి చెందండి. 4 సెకన్ల పాటు లోతైన శ్వాస తీసుకోండి, వదలండి. ఆపై మరో సుదీర్ఘమైన శ్వాస నెమ్మదిగా తీసుకోండి, వదలండి. ఇలా మీ హృదయ స్పందన మందగించినట్లు మీరు భావించే వరకు ఈ అభ్యాసాన్ని పునరావృతం చేయండి. మీ ఆలోచనలు త్వరగా తగ్గుతాయి, మీరు మళ్లీ నిద్రలోకి జారుకుంటారు.
ఈ చర్యలు తీసుకుంటే మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పగటి పూట కొంత ఎండలో తిరగటం వలన కూడా రాత్రికి నిద్రపడుతుందని నిపుణులు చెబుతారు.