Screen Time | సుదీర్ఘంగా స్క్రీన్ చూస్తున్నారా? కళ్లపై భారాన్ని ఇలా దించుకోండి!
కరోనా మహమ్మారి తర్వాత ప్రజల సగటు స్క్రీన్ టైమ్ గణనీయంగా పెరిగింది. ఎక్కువ మంది ల్యాప్ టాప్, మొబైల్ స్క్రీన్ లకు అతుక్కుపోతున్నారు. ఇది తీవ్రమైన కంటి సమస్యలకు దారి తీస్తుంది. F3లో వెంకీ లాగా మీకూ అంతా బ్లర్ అవుతుంది. కాబట్టి నివారణ మార్గాలు తెలుసుకోండి.
సుదీర్ఘమైన పని గంటలు.. రోజంతా ల్యాప్‌టాప్ చూడటం, మధ్యమధ్యలో మొబైల్ చెక్ చేసుకోవడం, టైం దొరికితే టీవీ చూడటం, సందు దొరికితే ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం. ఇలా గ్యాప్ లేకుండా స్క్రీన్‌లకు అతుక్కుపోతే ఆ రెండు కళ్లు కాయలై, పండ్లై అవి పుచ్చిపోవడం గ్యారెంటీ అని అంటున్నారు నిపుణులు.
నేత్ర వైద్యనిపుణుల తాజా పరిశోధన ప్రకారం సుదీర్ఘమైన స్క్రీన్ టైమ్ కళ్ళ ఆకారాన్ని తీవ్రంగా, శాశ్వతంగా మారుస్తుందని తేలింది. చాలాకాలం పాటు కళ్లు తనకు దగ్గరగా ఉండే స్క్రీన్‌లపై దృష్టి కేంద్రీకరిస్తున్నందున కనుబొమ్మలు సాగదీసినట్లు అవుతాయి. దీంతో దూరం ఉన్న వస్తువులన్నీ అస్పష్టంగా కనిపిస్తాయి. ఇది క్రమంగా మయోపియా అనే నేత్ర సమస్యకు దారితీస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.
మీరూ కంప్యూటర్ స్క్రీన్‌లను చూస్తూ గంటల తరబడి గడిపే వారైతే.. కచ్చితంగా మీ కళ్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం విరామాలు తీసుకోవడాన్ని పరిగణించాలి.
ఇదే సమయంలో కళ్లపై ఒత్తిడి తగ్గించేలా కొన్ని చిట్కాలను నిపుణులు సూచించారు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
రెప్పవేయండి
తదేకంగా స్క్రీన్ చూస్తూ ఉండకుండా రెప్పవేస్తూ ఉండండి. నిమిషానికి 22 సార్లైనా రెప్ప వేయాలి. కొద్దిసేపు కళ్లు మూసుకొని ఉండాలి.
విరామాలు
మీరు 20 నిమిషాల పాటు స్క్రీన్ చూసినపుడు అక్కడ ఒక కామా ఇవ్వండి. ఒక 20 నిమిషాల పాటు స్క్రీన్ వైపు కాకుండా దిక్కులు చూడండి. కొంచెం లేచి స్క్రీన్ నుంచి దూరంగా వెళ్లండి. అటూఇటూ నడవండి. ఇది ఫోవియా నుండి ఒత్తిడిని తగ్గిస్తుంది. దృష్టిని నిమగ్నం చేస్తుంది, ఆ బ్లింక్ రేట్‌ను బ్యాకప్ చేస్తుంది.
ప్రకాశాన్ని సర్దుబాటు చేయండి
మీరు వాడే పరికరం స్క్రీన్ మీ చుట్టూ ఉన్న పరిసరాల కంటే ప్రకాశవంతంగా కనిపిస్తే కంటిపై భారం పడుతుంది. కాబట్టి పరిసరాలకు తగినట్లుగా కాంతిని అడ్జస్ట్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న లైటింగ్‌కు సరిపోయేలా మీ స్క్రీన్ బ్రైట్ నెస్ తగ్గించడం ద్వారా అది డిజిటల్ కంటి ఒత్తిడిని నివారించడంలో సహాయపడుతుంది.
డిమ్ చేయడం వద్దు
చాలామంది స్క్రీన్ వెలుతురు కనిష్టానికి తగ్గించడం ద్వారా కంటికి మంచి చేస్తుందనుకుంటారు. స్కీన్ డిమ్ చేస్తే మరింత దగ్గరగా, తదేకంగా చూడాల్సి రావొచ్చు. ముఖ్యంగా చదివేటపుడు ఇలా స్క్రీన్ డిమ్ చేయవద్దు. బ్రైట్నెస్ పూర్తిగా తగ్గించకుండా ఎంత మేరకు అవసరమవుతుందో అంతే తగ్గించండి. అలాగే స్క్రీన్ ను మరి దగ్గరగా కాకుండా మీ కంటి నుంచి కనీసం 40 నుంచి 75 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.
కన్నీరు కార్చండి
కన్నీరు కూడా స్క్రీన్ టైం నుంచి తాత్కాలిక పరిష్కారం చూపుతాయి. కన్నీరు కార్చడం ద్వారా కళ్లు లూబ్రికేట్ అవుతాయి. తద్వారా మీ కంటికి కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే గ్లిజరిన్స్ వంటివి ఉపయోగిస్తూ కృత్రిమంగా కన్నీరు తెచ్చుకుంటే కన్ను తన సహజత్వాన్ని కోల్పోయి పొడిబారే ప్రమాదం ఉంది.
కంప్యూటర్ గ్లాసెస్
కొంతమంది లెన్సులు, కంప్యూటర్ గ్లాసెస్‌తో తమ కళ్లపై భారాన్ని తగ్గించుకుంటారు. ఇవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే. నిపుణులను సంప్రదించి సరైన స్క్రీన్ రీడింగ్ గ్లాసెస్ తీసుకోవడం ఉత్తమం.
సంబంధిత కథనం
టాపిక్