Foods Affect Sleep | ఖాళీ కడుపుతో పడుకోవద్దు, కానీ ఇలాంటివి తింటే నిద్ర రాదు!
08 December 2022, 21:00 IST
- Foods That Affect Sleep: రాత్రి భోజనం చేయకపోతే నిద్రరాదు, అయితే కొన్ని ఆహారాలు తిన్నప్పటికీ నిద్రరాదు. మీకు నిద్రలేమి ఉంటే అలాంటి ఆహారాలను తినకండి.
Foods Affect Sleep
ప్రతిరోజూ నిద్ర పట్టడంలో ఇబ్బందిగా ఉంటుందా? మనలో చాలా మంది నిరంతరమైన ఆలోచనలు, రోజూవారీ ఆందోళనలు నిద్రలేమికి కారణం అనుకుంటారు, కానీ అన్ని సందర్భాల్లో అది మాత్రమే కారణం కాకపోవచ్చు. రాత్రికి ఏమి తినకుండా ఖాళీ కడుపుతో నిద్రపోయినపుడు కూడా అది నిద్రలేమిని కలిగిస్తుంది. అదే సమయంలో మీరు తీసుకున్న ఆహారం కూడా మీ నిద్రలేమికి కారణం కావచ్చు.
రాత్రికి ఎంత ప్రయత్నించినా, నిద్ర రాకపోవడం లేదా నిద్ర పోయిన తర్వాత నడిరాత్రిలో చాలా సార్లు మేల్కొంటే అందుకు కారణం మీరు తిన్న ఆహారంమే కావచ్చు. కొన్ని రకాల ఆహారాలకు మీ శరీరం ఎలా స్పందిస్తుందనే దానిని బట్టి మీ జీర్ణక్రియ, బరువు, నిద్ర ప్రభావితం కావచ్చు.
Foods That Affect Sleep- నిద్రను ప్రభావితం చేసే ఆహారాలు
రాత్రిపూట కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు, నిద్రకు అంతరాయం, బరువు పెరగడం మొదలైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ఉదాహారణకు కెఫిన్ కలిగిన ఆహార పానీయాలు తీసుకోవడం వలన మీరు నిద్రపోయే సమయంలో చురుగ్గా ఉంటారు. అప్పుడు నిద్రపట్టదు. అలాంటి కొన్ని ఆహార పదార్థాలను ఇక్కడ తెలియజేస్తున్నాం. ప్రశాంతంగా నిద్రపోవాలంటే వీటిని రాత్రి పూట తినడం మానుకోవాలి.
1. కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు
అధికమొత్తంలో సంతృప్త-కొవ్వులు, తక్కువ ఫైబర్ కలిగిన ఆహారం తీసుకుంటే మీరు రాత్రికి ఎక్కువగా మేల్కొంటారు. రాత్రి భోజనంలో కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాన్ని పెద్ద మొత్తంలో తీసుకుంటే, అది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది, నిద్రలో నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అలాగే పగటిపూట కూడా చురుకుదనం లోపిస్తుంది.
2. కెఫిన్-రిచ్ ఫుడ్స్
కెఫిన్ మీ నిద్రకు బద్ద శత్రువు, వీటిలో చక్కెర కూడా ఉంటే రాత్రంతా మీకు జాగరణే. కాఫీలు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ మొదలైన కెఫిన్ ఎక్కువ ఉన్న పదార్థాలను రాత్రికి దూరం పెట్టాలి.
3. చక్కెర పదార్థాలు
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెర రాత్రి పూట ఆందోళన , నిద్రలేమికి కారణం కావచ్చు. అవి అర్థరాత్రి వేళ ఆకలిని కూడా కలిగిస్తాయి. రాత్రికి స్వీట్లు ఎక్కువ తినేవారు చంచలంగా ఉంటారు, రాత్రి సమయంలో తరచుగా మేల్కొంటారు.
4. ఆల్కహాల్
రాత్రి నిద్రపట్టడానికి, మగతను కలిగించటానికి ఆల్కహాల్ తీసుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ, అధ్యయనాల ప్రకారం, మద్యం సేవిస్తే మధ్యలోనే నిద్రలేస్తారు. ఎందుకంటే మద్యపానం ప్రభావం కొన్ని గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మెదడు మళ్లీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేస్తుంది. ఆ వెంటనే నిద్రలేస్తారు.
5. స్పైసీ ఫుడ్స్
రాత్రికి డబుల్ మసాలాతో స్పైసీ ఫుడ్ తింటే గుండెల్లో మంటను కలిగించే అధిక స్పైసీ ఫుడ్ సాధారణంగా నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. టొమాటో ఉత్పత్తులతో చేసిన స్పైసీ వంటకాలు కూడా నిద్రభంగం కలిగిస్తాయి. అలాగే రాత్రిపూట సిట్రస్ పండ్లు, ఆలివ్ లకు దూరంగా ఉండాలి. ఊరగాయలు వంటి మెరినేట్ చేసిన వంటకాలు , పాల ఉత్పత్తులు కూడా కొంతమందిలో గుండెల్లో మంటకు కారణం కావచ్చు, తద్వారా నిద్రలేమి వస్తుంది.
మీకు నిద్రలేమి సమస్యలు ఉంటే ఆహారంలో మార్పులు చేసుకోండి. రాత్రి పూట తేలికపాటి భోజనం చేయడం వల్ల మీరు బాగా నిద్రపోతారు. పీచు కలిగిన ఆహారం తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జీవక్రియను పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రికి త్వరగా భోజనం చేసేస్తే, చాలా వరకు ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి.
టాపిక్