Risks of Sleeping in Sweater । స్వెటర్ ధరించి అస్సలు నిద్రపోకూడదు, ఎందుకో తెలుసా?
15 December 2022, 22:06 IST
- Risks of Sleeping in Sweater: స్వెటర్ ధరించి నిద్రపోతే పలు రకాల దుష్ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎలాంటి హాని ఉంటుందో తెలుసుకోండి.
Risks of Sleeping in Sweater
శీతాకాలంలో తమని తాము చలి నుంచి రక్షించుకునేందుకు వెచ్చని స్వెటర్లు ధరిస్తారు. కచ్చితంగా బయటకు వెళ్లేటపుడు స్వెటర్ ధరించే వెళ్లాలి. అయితే చాలా మంది రాత్రికి స్వెటర్ ధరించే నిద్రపోతారు, ఇది మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు కూడా రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు స్వెటర్ ధరించే వారు అయితే, ఇప్పుడే స్వెటర్ తీసేయండి. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. నోయిడాలోని మాక్స్ మల్టీస్పెషాలిటీ సెంటర్లో కన్సల్టెంట్-పీడియాట్రిక్ అయిన డాక్టర్ చారు కల్రా రాత్రిపూట ఉన్నిలను ధరించి నిద్రపోవడం ప్రమాదకరం అని పేర్కొన్నారు. ఇది ఆరోగ్యంపై అనేక రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుందని వివరించారు.
Risks of Sleeping in Sweater - స్వెటర్ ధరించి నిద్రిస్తే కలిగే హాని
రాత్రిపూట స్వెటర్లు ధరించి నిద్రిస్తే ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
1. శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది
రాత్రిపూట ఉన్ని స్వెటర్లు ధరించడం వల్ల అది శరీరం నుండి ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది. దీంతో మీ శరీరం అధిక వేడిని కోల్పోవచ్చు. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలలో దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. చర్మం పొడిబారి ఇతర సమస్యలకు కారకం అవుతుంది. మీ నిద్రకు భంగం కూడా కలగవచ్చు.
2. అలర్జీలను పెంచవచ్చు
స్వెటర్లు ధరించడం వల్ల అది చర్మంపై అతుక్కొని ఉంటుంది. ఇది దురద, చిరాకు, ఎగ్జిమా, తామర, తదితర చర్మ సమస్యలను కలిగిస్తుంది. చర్మ అలెర్జీలు, అటోపిక్ డెర్మటైటిస్ చరిత్ర కలిగిన వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ఉన్ని బట్టలు ధరించడం ఈ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది అని డాక్టర్ కల్రా తెలిపారు. అంతేకాకుండా, రాత్రిపూట స్వెటర్లు ధరించే పిల్లలు బట్టలలో చిక్కుకున్న దుమ్ము కారణంగా అలెర్జీ దగ్గును అనుభవిస్తారు.
3. రక్తపోటు సమస్యలు
స్వెటర్లు చెమటను పెంచుతాయి. ఇది శరీరానికి గాలి ప్రసరణను తగ్గిస్తుంది. స్వెటర్ పైన శరీరాన్ని దుప్పట్లతో పూర్తిగా కప్పివేసి పడుకోవడం వలన విపరీతమైన చెమటలు పడతాయి. దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది, తిమ్మిరి వస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు స్వెటర్లతో నిద్రించడం మానుకోవాలి. వారి ఛాతీలో భారం లేదా శ్వాస సమస్యలు కూడా ఉండవచ్చు.
4. ఆస్తమాను తీవ్రం చేస్తుంది
ఉన్ని దుస్తులు, స్వెటర్‌లు వంటి మెత్తని బట్టలతో ఉబ్బసం వచ్చే అవకాశం ఉందని డాక్టర్ కల్రా చెప్పారు. ఎందుకంటే అలెర్జీ కారకాలకు ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది, ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.
5. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు
రాత్రిపూట స్వెటర్లు, పాదాలకు వెచ్చని సాక్స్ ధరించినట్లయితే, చెమట కారణంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి స్వెటర్లను తీసివేసి నిద్రించండి.ఒకవేళ మీరు సాక్సులు ధరించే నిద్రించాలనుకుంటే, చర్మాన్ని సురక్షితంగా ఉంచడానికి మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం మంచిది.