Baby Care in Winter । చలికాలంలో శిశువుల సంరక్షణకు ఈ జాగ్రత్తలు పాటించండి!-baby care in winter tips to protect your newborn from cold weather ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Care In Winter । చలికాలంలో శిశువుల సంరక్షణకు ఈ జాగ్రత్తలు పాటించండి!

Baby Care in Winter । చలికాలంలో శిశువుల సంరక్షణకు ఈ జాగ్రత్తలు పాటించండి!

HT Telugu Desk HT Telugu
Dec 06, 2022 07:52 PM IST

Baby Care in Winter: చాలా మంది కొత్తగా తల్లిదండ్రులు అయిన వారు తమ శిశువు సంరక్షణ విషయంలో పొరపాట్లు చేస్తారు. ఈ చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.

Baby Care in Winter
Baby Care in Winter (Pixabay)

మారుతున్న వాతావరణం కారణంగా ఎలాంటి వ్యక్తులైనా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిన్న పిల్లలపై దీని ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు మొదటి సారి తల్లితండ్రులుగా మారినట్లయితే, ఈ వింటర్ సీజన్లో మీరు మీ బేబీ కేర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సీజన్‌లో అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. చల్లని వాతావరణంలో వైరస్‌లు, బాక్టీరియాలు వేగంగా వృద్ధి చెందుతాయి. నవజాత శిశువు (Newborns) లలో రోగనిరోధక శక్తి పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. దీంతో శిశువులు వెంటనే అనారోగ్యానికి గురవుతారు. ఇది కాకుండా, శిశువు చర్మం చాలా మృదువుగా ఉంటుంది. శీతాకాలపు చల్లని గాలి వారి చర్మం నుండి తేమను తీసివేస్తుంది, దీని కారణంగా వారు వివిధ చర్మ సమస్యలకు కూడా గురవుతారు. అందువల్ల ఈ శీతాకాలంలో మీ బేబీ ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

Baby Care in Winter - చలికాలంలో శిశువుల సంరక్షణకు చిట్కాలు

చలికాలంలో బేబీ కేర్‌కు సంబంధించి ఇక్కడ కొన్ని సూచనలు అందిస్తున్నాం. మీ శిశువు ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలను తప్పక తీసుకోండి.

శిశువుకి ఎక్కువ దుస్తులు వేయకండి

కొత్తగా తల్లిదండ్రులు అయిన వారు తరచుగా ఈ పొరపాటు చేస్తుంటారు. తమ నవజాత శిశువులను చలి నుంచి కాపాడటానికి ఎక్కువ దుస్తులు ధరింపజేస్తారు. కానీ అప్పుడే పుట్టిన బిడ్డలను అవసరానికి మించి కవర్ చేయడం సరికాదు. ఇలా చేయడం వల్ల శిశువు శరీరంలో ఎక్కువ వేడి ఏర్పడుతుంది. దీని కారణంగా వారు సరిగా నిద్రపోలేరు, శ్వాసకోశ సమస్యలనూ అనుభవించవచ్చు.

చాలా వేడి నీటితో స్నానం చేయవద్దు

చల్లని వాతావరణంలో వేడి నీరు ఖచ్చితంగా శరీరానికి మంచి అనుభూతిని కలిగిస్తుంది, అయితే ఇది చర్మం సహజ తేమను కూడా తొలగిస్తుంది. అందుకే శిశువుల కోసం సాధారణ నీటిలో కొద్దిగా వేడి నీటిని కలపండి, చాలా తక్కువ వేడి ఉన్న నీటితో స్నానం చేయించాలి.

గోరువెచ్చని నూనెతో మసాజ్

శిశువుకు స్నానం చేయించిన తర్వాత, బేబీ శరీరాన్ని సున్నితంగా మసాజ్ చేయడం అవసరం. బేబీ మసాజ్ కోసం మీరు బాదం నూనె, ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెలన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలను కలిగి ఉంటాయి. ఇది కాకుండా, ఈ నూనెలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అయితే కొంచెం నూనెను మాత్రమే ఉపయోగించాలి. పిల్లల సున్నితమైన చర్మంపై మార్కెట్లో లభించే రసాయన ఉత్పత్తులను ఉపయోగించకపోవడమే మంచిది.

నాసికా చుక్కలు

చలికాలంలో పిల్లల్లో ముక్కు దిబ్బడ సమస్య సర్వసాధారణం. డాక్టర్ సూచించిన, నాసికా చుక్కలను మీతో ఉంచుకోండి. తద్వారా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు.

సాక్స్ వేయడం మర్చిపోవద్దు

చలికాలంలో పిల్లల దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ సీజన్‌లో మీ చిన్నపాటి అజాగ్రత్త కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వాతావరణం మారినప్పుడు, పిల్లవాడిని వెచ్చని దుస్తులతో పాటు సాక్స్ , టోపీని ధరింపజేసి ఉంచండి. తేలికపాటి చలిని కూడా నిర్లక్ష్యం చేయవద్దు.

చల్లని పదార్థాలు తినిపించవద్దు

చలికాలంలో పొరపాటున కూడా చల్లని ఆహార పదార్థాలను పిల్లలకు తినిపించకండి. మీ బిడ్డకు 7 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉంటే, బేబి ఆహారం తింటుంటే తాజాగా వండిన ఆహారాన్ని డాక్టర్ సూచించిన విధంగా తినిపించండి. తినిపించగా మిగిలిన దానిని, వండి ఎక్కువ సేపు అయిన దానిని తినిపించవద్దు.

తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలి

చలికాలం రాకతో ఫ్లూ , అంటు వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ సీజన్ నవజాత శిశువుకు సున్నితమైనది. కాబట్టి తల్లిదండ్రులు తమ బిడ్డకు అవసరమైన అన్ని టీకాలు సకాలంలో వేయించాలి. 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఫ్లూ షాట్ పొందవచ్చు.

శీతాకాలంలో సూర్యరశ్మి అవసరం

విటమిన్-డి ని సప్లిమెంట్ చేయడానికి శిశువును వారానికి 1 నుండి 2 సార్లు 10 నిమిషాలు ఎండలోకి తీసుకెళ్లండి. అయితే ఉదయం పూట తేలికపాటి సూర్యకాంతి మాత్రమే శిశువుకు మేలు చేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం