శిశువు ఆరోగ్యానికి తొలి 1000 రోజులే కీలకం.. ఎందుకో తెలుసా?-for a healthy life of baby nutrition during first 1000 days is crucial says doctors ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  For A Healthy Life Of Baby, Nutrition During First 1000 Days Is Crucial; Says Doctors

శిశువు ఆరోగ్యానికి తొలి 1000 రోజులే కీలకం.. ఎందుకో తెలుసా?

Manda Vikas HT Telugu
Dec 30, 2021 05:44 PM IST

త‌ల్లిగ‌ర్భంలో 270 రోజులు ఎటువంటి లోపాలు త‌లెత్త‌కుండా శిశువు ఎదుగుద‌ల‌ ఉండేందుకు, అలాగే పుట్టిన త‌ర్వాత తొలి 730 రోజులు పిల్ల‌లలో రోగ నిరోధ‌క శ‌క్తికి, అనంత‌రం ఎదుగుద‌ల‌కు సమతుల్యమైన పోషకాహారం ఎంతో కీల‌కం.

Representational Image
Representational Image (Stock Photo)

మ‌నిషి సంపూర్ణ ఆరోగ్య‌వంత‌మైన జీవ‌నానికి, శారీర‌క‌, మాన‌సిక ఎదుగుద‌ల‌కు పుట్టిన తొలినాళ్ల‌లో మొద‌టి వెయ్యి రోజుల‌లో తీసుకునే స‌మ‌తుల పోష‌కాహార‌మే ఎంతో కీల‌క‌మ‌ని భార‌త వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి(ఐసీఎంఆర్‌) - జాతీయ పోష‌కాహార సంస్థ‌ (ఎన్ఐఎన్‌) శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ జి.ఎం.సుబ్బారావు పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ గర్భంలో పిండ ద‌శ మొద‌లైన నాటి నుంచి త‌ల్లిగ‌ర్భంలో 270 రోజులు (9 నెలల పాటు) ఎటువంటి లోపాలు త‌లెత్త‌కుండా శిశువు ఎదుగుద‌ల‌ ఉండేందుకు, అలాగే శిషువు పుట్టిన త‌ర్వాత తొలి రెండేళ్లు (730 రోజులు) పిల్ల‌లలో రోగ నిరోధ‌క శ‌క్తికి, అనంత‌రం ఎదుగుద‌ల‌కు సమతుల్యమైన పోషకాహారం ఎంతో కీల‌క‌మ‌ని అన్నారు. ఈ 1000 రోజుల పోష‌ణనే ఆ తర్వాత పిల్లలను ఆరోగ్యంగా జీవితకాలం పాటు ఉంచడానికి కూడా తోడ్పాటు అందిస్తుంద‌ని ఆయన వివ‌రించారు.

పోషకాహారమే కీలకం..

ఇప్ప‌టికీ 30-40 శాతం మ‌హిళ‌ల‌లో సూక్ష్మ పోష‌కాలు, బి12, ఐర‌న్‌, ఫోలిక్‌యాసిడ్ లోపాలు ఉంటున్న‌ట్లు గుర్తించామ‌న్నారు. ఈ లోపాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు విభిన్న ఆహార ప‌దార్థాల‌ను త‌గినంత మోతాదులో ప్ర‌తి రోజూ తీసుకోవాల‌ని సూచించారు. గ‌ర్భిణీ పెరిగే ప్ర‌తి కిలో బరువు పెరుగుద‌ల‌కు గ‌ర్భంలోని శిశువు 52 గ్రాముల చొప్పున పెరుగుతుంద‌ని తెలిపారు.

బిడ్డకు బ‌ల‌మైన ఆరోగ్యం, తిరుగులేని రోగ నిరోధ‌క శ‌క్తిని అందించడానికి బిడ్డ పుట్టిన మొద‌టి గంట‌లోపు త‌ల్లి నుంచి శిశువుకు ముర్రుపాలు ప‌ట్టించాల‌ని కోరారు. బిడ్డ పుట్టిన నాటి నుంచి ఆరు నెల‌ల‌పాటు త‌ల్లిపాలు క్రమం త‌ప్ప‌కుండా ఇవ్వ‌డం ద్వారా పిల్ల‌ల‌లో మాన‌సిక, శారీర‌క‌ పెరుగుద‌ల‌తోపాటు సాంక్ర‌మిక వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని వెల్ల‌డించారు.

ఉప్పు తక్కువ తీసుకోవాలి

బిడ్డతో పాటు తల్లి కూడా స‌రైన మోతాదులో, సమయానుసారంగా నాణ్య‌మైన పోష‌కాహారం తీసుకోవ‌డం ద్వారా మాత్ర‌మే ఆరోగ్య‌వంత‌మైన జీవితం సాధ్య‌మ‌ని చెప్పారు. తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ప‌ప్పు ధాన్యాలు, కొవ్వు ప‌దార్థాలు త‌గిన మోతాదులో ప్ర‌తి రోజూ తీసుకోవాల‌ని సూచించారు. ప్ర‌తి రోజూ ఆహారంగా 350 గ్రాముల కూర‌గాయ‌లు, 150 గ్రాములు తాజా పండ్లతోపాటు ఆహారంలో ఉప్పు శాతం తక్కువ ఉండేలా చూసుకోవాలి. 5 గ్రాముల‌ కంటే తక్కువ ఉప్పు తీసుకోవాల‌ని సూచించారు.

ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడే వండుకొని తినటం మంచిది. ఒకవేళ నిల్వచేసుకోవాలంటే రీఫ్రిజరేటర్లో 5 డిగ్రీల కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లో నిల్వ‌చేసుకోవాలి. బియ్యం మ‌రీ ఎక్కువ‌గా క‌డిగితే అందులో ఉన్న సూక్ష్మ పోష‌కాలు కోల్పోతాయ‌ని చెప్పారు. వంట‌ల కోసం రెండు లేదా మూడు ర‌కాల వంట నూనెలు మార్చుతూ వాడుకోవాల‌ని సూచించారు.

 

WhatsApp channel

సంబంధిత కథనం