Winter Diet For Pregnant Women | శీతాకాలంలో గర్భిణీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?
23 November 2022, 19:38 IST
- Winter Diet For Pregnant Women: గర్భిణీ స్త్రీలు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
Winter Diet For Pregnant Women
శీతాకాలం ప్రారంభమయింది. ఈ సీజన్‌లో ఎవరికైనా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, తరచుగా జబ్బుల బారినపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. గర్భిణీల విషయానికి వస్తే, ఈ సమయంలో వారు మరింత సున్నితంగా ఉంటారు. గర్భంతో ఉన్న స్త్రీలు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు, బయటి తినుబండారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. మరోవైపు దేశంలో కొవిడ్ మహమ్మారి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాబట్టి తల్లి కాబోయే వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్‌లు సోకకుండా దృఢమైన ఆరోగ్య స్థితిని కలిగి ఉండాలి. తమ రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి.
గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి మంచి పోషకాహారం తీసుకోవాలి. పాలు, పండ్లు, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం వారి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. గర్భిణీలు పోషకాహార లోపంను ఎదుర్కొంటే, పుట్టబోయే బిడ్డలు తక్కువ బరువుతో జన్మించే ఆస్కారం ఉంటుంది. నవజాత శిశువులకు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
Winter Diet For Pregnant Women- శీతాకాలంలో గర్భిణీల ఆహారం
సాధారణంగా నెలలు నిండుతున్న గర్భిణీ స్త్రీలకు ఆహార కోరికలు కూడా పెరుగుతాయి. అందున ఇది చలికాలం, సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ చలికాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చో, నిపుణులు సిఫారసు చేసిన కొన్ని చిట్కాలను ఇక్కడ అందిస్తున్నాము. ఒకసారి పరిశీలించండి.
పండ్లు, కూరగాయలు ఎక్కువ తినండి
నారింజ, బత్తాయి, యాపిల్, అరటి సహా విటమిన్ సి కలిగిన పండ్లు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. అలాగే, బచ్చలికూర, పాలకూర, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు, ఆకుకూరలు తినడం చలికాలంలో ఆరోగ్యకరం. థైరాయిడ్ ఉన్నవారు కాలీఫ్లవర్, క్యాబేజీ, ఆలుగడ్డలను తినకూడదు.
సరైన మొత్తంలో అయోడిన్ తీసుకోవాలి
మీ ఆహారంలో సరైన మోతాదులో అయోడిన్ లేకపోవడం వలన అది మీ శిశువు మానసిక ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి అయోడిన్ మంచి పరిమాణంలో ఉండేటువంటి గుడ్లు, సీఫుడ్ మొదలైన ఆహారపదార్థాలను తీసుకోవాలి. ఉప్పు మోతాదుకు మించి తీసుకోకూడదు.
వైవిధ్యమైన ఆహారం
ఎప్పుడూ ఒకేరకంగా కాకుండా మీ రోజువారీ ఆహారంలో వైవిధ్యతను జోడించండి. డెయిరీ ఉత్పత్తులు, చిక్కుళ్ళు, దానిమ్మ పండ్లు వంటి వివిధ రకాల విభిన్నమైన ఆహారాలు ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా మీరు మీ చివరి త్రైమాసికంలో ఉన్నప్పుడు రోజుకు 300 కేలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోటానికి ప్రయత్నించండి.
కాల్షియం, ఫైబర్ చేర్చండి
ఎముకల దృఢత్వానికి కాల్షియం అవసరం చాలా ఉంటుంది కాబట్టి పాలు, బ్రోకలీ, కాలే వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మీ రోజువారీ ఆహారంలో 3 నుండి 4 పాల ఉత్పత్తులను తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలో మలబద్ధకం అనిపిస్తుంది కాబట్టి ఫైబర్ కలిగిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ధాన్యాలు, పప్పులు, తృణధాన్యాలు క్రమం తప్పకుండా తినండి, ఎందుకంటే వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.