Egg Bhel Puri | చిన్న బ్రేక్‌లో చిటికెలో చేసుకునే ఎగ్ భేల్ పూరీ, రెసిపీ ఇదిగో!
ఈ చల్లని సాయంత్రం వేళ చిటికెలో ఏదైనా స్నాక్స్ చేసుకొని, గుట్టుక్కున తినేయాలనుకుంటున్నారా? అయితే Egg Bhel Puri చేసుకోండి, రెసిపీ ఇక్కడ ఉంది.
మీకు చిన్న బ్రేక్ దొరికితే, చిటికెలో చేసుకుని తినే ఏదైనా స్నాక్స్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే అప్పటికప్పుడే భేల్ పూరీ చేసేయొచ్చు. అయితే మీరు రెగ్యులర్ గా తినే భేల్ పూరీ కాకుండా, ఇంకాస్త రుచికరంగా కోడిగుడ్లతో చేసుకుంటే అదిరిపోతుంది. ఇలాంటి ఎగ్ భేల్ పూరీ మీకు ఏ పానీపూరీ బండి వద్ద లభించదు. కానీ, మీకు మీరుగా పరిశుభ్రమైన రీతిలో ఎగ్ భేల్ పూరీని క్షణాల్లో సిద్ధం చేసుకోవచ్చు.
భేల్ పూరీ సాధారణంగా చాలా తేలికైన అల్పాహారం. గుడ్లు మంచి ప్రోటీన్లు కలిగిన అద్భుతమైన ఆహారం. ఈ రెండింటి కలయికతో చేసే ఎగ్ భేల్ పూరీ తింటుంటే, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ ఎగ్ భేల్ పూరీని సాయంత్రం స్నాక్స్ లాగా తినొచ్చు. అలాగే ఇంకాస్త చీకటి పడ్డాక విశ్రాంతి సమయంలో రెండు పెగ్గులేసే వారికి ఈ ఎగ్ భేల్ పూరీ మంచి మంచింగ్ అవుతుంది. అయితే ముఖ్య గమనిక. మీకు ఆరోగ్యం కావాలంటే మద్యపానం సేవించడం మంచిది కాదు, ఎగ్ భేల్ పూరీ ఒక్కటి తింటే మాత్రం ఆరోగ్యం. ఇంకా ఇంకా ఆలస్యం చేయకుండా ఎగ్ భేల్ పూరీ ఎలా చేసేయాలో ఈ కింద రెసిపీ ఉంది చూసేయండి.
Egg Bhel Puri Recipe కోసం కావలసిన పదార్థాలు
- 1 కప్పు వరి ప్యాలాలు లేదా ముర్మురా
- 1 ఉల్లిపాయ
- 1 టమోటా
- 1/2 బంగాళాదుంప
- 2 గుడ్లు
- 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగ
- 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్
- 1 స్పూన్ పసుపు ఉప్పు
- 1 స్పూన్ ఆవాల నూనె
- 1/4 స్పూన్ చాట్ మసాలా
ఎగ్ భేల్ పూరీ ఎలా తయారు చేయాలి
- ముందుగా రెండు గుడ్లను ఉడకబెట్టుకొని, అవి ఉడికిన తర్వాత పొట్టు తీసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
- మరోవైపు వేరుశనగలను వేయించాలి, ఉల్లిపాయలు, టమోటా, బంగాళాదుంపలను చిన్నగా తరుగుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో ముర్మురా, వేయించిన వేరుశెనగలు, తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, బంగాళాదుంపల ముక్కలు వేయాలి. ఆపై ఉప్పు, కారం చల్లి కలపాలి.
- ఇప్పుడు ఒక చెంచా ఆవాల నూనె కూడా వేసి, ముర్మురాఅ మిశ్రమాన్ని కలపండి.
- ఈ దశలో ఉడికించిన గుడ్ల ముక్కలను మిక్స్‌లో వేసి, పైనుంచి కొంచెం చాట్ మసాలా చల్లండి.
అంతే ఎగ్ భేల్ పూరీ రెడీ, ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోకి, ఒక స్పూన్ తో తీసుకొని, నోట్లో వేసుకొని కసాబిసా నములుతూ ఉంటే దాని రుచే వేరు. ఆపై చాయ్ తాగితే సాయంత్రం సెట్.
సంబంధిత కథనం