Bacardi Legacy whisky । విస్కీ విక్రయాలలో 'మనమే' టాప్.. మార్కెట్లో బకార్డీ లెగసీ అనే కొత్త సరుకు !
Bacardi Legacy whisky: బకార్డి ఇండియా 'బకార్డీ లెగసీ' పేరుతో తమ మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా స్కాచ్ విస్కీని విడుదల చేసింది. విస్కీ అమ్మకాల్లో భారత్ అగ్రగామిగా ఉండటం కారణంగానే ఇక్కడ లాంచ్ చేస్తున్నట్లు పేర్కొంది. వివరాలు చూడండి.
ఆల్కాహాల్ ఆధారిత పానీయాల తయారీదారు బకార్డి ఇండియా ఇప్పటి వరకు రమ్, జిన్, బ్రీజర్ ల వంటి ఉత్పత్తులను తయారు చేసేది. ఇప్పుడు విస్కీ విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా తమ బ్రాండ్ నుంచి బకార్డీ లెగసీ (Bacardi Legacy) పేరుతో మొట్టమొదటీ విస్కీని విడుదల చేసింది. ఈ Bacardi Legacy whisky పూర్తిగా మేడ్-ఇన్-ఇండియా. అయితే ఇది భారతీయ ధాన్యాలు, స్కాటిష్ మాల్ట్‌లతో కూడిన ప్రీమియం స్కాచ్ విస్కీ అని కంపెనీ తెలిపింది.
తొలిదశలో భాగంగా బకార్డి విస్కీని తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మార్కెట్లలోకి కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది మూడు పరిమాణాలలో (క్వాటర్, హాఫ్, ఫుల్) లభించనుంది. రాబోయే నెలల్లో ఇతర రాష్ట్రాలకు విస్తరించే యోచనలో ఉంది. కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ అలాగే రాజస్థాన్ మార్కెట్లలో ఈ విస్కీని ప్రవేశపెట్టనున్నారు.
ఈ సందర్భంగా బకార్డి ఇండియా MD సంజిత్ సింగ్ రంధవా మాట్లాడుతూ, "మేము ఏ ఉత్పత్తి ప్రారంభించినా, వినియోగదారులు హృదయపూర్వకంగా స్వాగతిస్తారు. విస్కీకి భారతదేశంలో నంబర్ వన్ మార్కెట్ అయినందున మా మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా విస్కీ Bacardi Legacy మా బ్రాండ్‌కు అద్భుతమైన వృద్ధి అవకాశాన్ని అందజేస్తుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Bacardi - రమ్ వేరియంట్‌లకు ప్రసిద్ధి
భారత మార్కెట్లో ప్రధానంగా వైట్ రమ్ వేరియంట్‌లకు బకార్డి పేరుగాంచిన బ్రాండ్. నాలుగు సంవత్సరాల క్రితం తమ గ్లోబల్ స్కాచ్ విస్కీ బ్రాండ్‌లు అయినటువంటి దేవర్స్, విలియం లాసన్‌లను భారతీయ మార్కెట్ కు పరిచయం చేసింది. ప్రస్తుతం విస్కీ మార్కెట్‌లో కేవలం 5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న బకార్డి, ఇప్పుడు తమ బకార్డీ లెగసీ విస్కీ విడుదల చేసి, 50 శాతానికి పైగా మార్కెట్ వాటాను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ICRIER గణాంకాల ప్రకారం, ఆల్కహాలిక్ పానీయాల అమ్మకాల్లో భారతదేశం 2020 నాటికే 52.5 బిలియన్ల డాలర్ల విలువ గల సేల్స్ తో ప్రపంచంలోనే టాప్-10 మార్కెట్లలో ఒకటిగా నిలిచింది, ఈ వృద్ధి ఇంకా దూసుకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేసిన ప్రతి రెండు విస్కీ బాటిళ్లలో దాదాపు ఒకటి భారతదేశంలో విక్రయం అవుతోంది. స్కాచ్ విస్కీ అమ్మకాల్లో భారతదేశం టాప్-6లో నిలిచిది. 2023 నాటికి విస్కీ అమ్మకాల్లో భారతదేశం 6.8% వృద్ధి సాధిస్తుందని CAGR అంచనా వేసింది. ఈ నేపథ్యంలో Bacardi Legacy విస్కీ విడుదలవటం గమనార్హం.
ఈ గణాంకాల ప్రకారం, భారతీయులు అల్కాహాల్ ఎంత తాగేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఈ కొత్త విస్కీ బ్రాండ్ తొలిదశలోనే తెలంగాణలో విడుదలవుతుందంటే ఇక్కడి మార్కెట్ అర్థం చేసుకోవచ్చు. చివరగా.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.
సంబంధిత కథనం