తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Turmeric Pickle: పచ్చిపసుపుతో ఊరగాయ.. దీని రుచి, ఇంకా ఆరోగ్య ప్రయోజనాలే వేరయా!

Turmeric Pickle: పచ్చిపసుపుతో ఊరగాయ.. దీని రుచి, ఇంకా ఆరోగ్య ప్రయోజనాలే వేరయా!

Manda Vikas HT Telugu

28 February 2022, 17:54 IST

    • పచ్చిపసుపు వినియోగం పెరిగేలా కొత్తకొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. అందులో భాగంగానే 'పచ్చిపసుపు ఊరగాయ' ఇప్పుడు సరికొత్తగా మెనూలో వచ్చి చేరింది. బహుశా ఇది పచ్చళ్లలో కూడా చాలా అరుదైన ఫ్లేవర్ అవుతుంది. పచ్చిపసుపు ఊరగాయ మాత్రం రుచితో పాటు ఆరోగ్యమూ లభిస్తుంది.. అట! ముఖ్యంగా వేడివేడి అన్నంలో పసుపుపచ్చడి వేసుకొని తింటే శీతాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ నుండి రక్షణగా ఉంటుందట.
Turmeric Pickle
Turmeric Pickle (Stock Photo)

Turmeric Pickle

పసుపుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే మన ఇండ్లల్లో పసుపును అనేక విధాలుగా ఉపయోగిస్తారు. దాదాపు అన్ని కూరల్లో పసుపును వాడతారు, కొందరు దీనిని పాలలో కలుపుకొని తాగుతారు, మరికొందరు పసుపుతో ఛాయ్, సూప్స్ లాంటివి కూడా తీసుకుంటారు. తాజాగా పండిన పచ్చిపసుపులో కుర్క్యుమిన్ సమ్మేళనం అధికంగా లభిస్తుంది. కాబట్టి పచ్చిపసుపు తీసుకుంటే ఎన్నోప్రయోజనాలుంటాయని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో పచ్చిపసుపు వినియోగం పెరిగేలా కొత్తకొత్త రుచులను పరిచయం చేస్తున్నారు. అందులో భాగంగానే 'పచ్చిపసుపు ఊరగాయ' ఇప్పుడు సరికొత్తగా మెనూలో వచ్చి చేరింది. బహుశా ఇది పచ్చళ్లలో కూడా చాలా అరుదైన ఫ్లేవర్ అవుతుంది.

సాధారణంగా పచ్చళ్లు మన నోటికి రుచిని అందిస్తాయి కానీ అవేవి ఆరోగ్యానికి అంత మంచివేమి కావు. కానీ ఈ పచ్చిపసుపు ఊరగాయ మాత్రం రుచితో పాటు ఆరోగ్యమూ లభిస్తుంది.. అట! ముఖ్యంగా వేడివేడి అన్నంలో పసుపుపచ్చడి వేసుకొని తింటే శీతాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ నుండి రక్షణగా ఉంటుందట.

ఒకే.. ఈ పసుపు పచ్చని పసుపు పచ్చడి/ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలి? అంటే దీని రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం. వీలైతే మీరూ ట్రై చేయండి.

కావాల్సినవి:

పచ్చి పసుపు కొమ్ములు - 250 గ్రాములు (ముక్కలుగా తురిమినవి)

ఆవ నూనె - 100 గ్రాములు

ఉప్పు - 2 1/2 స్పూన్

కారం - అర టీస్పూన్

మెంతులు - 2 టీస్పూన్లు ముతకగా రుబ్బుకోవాలి

ఆవ పొడి - 2 టీస్పూన్

అల్లం పొడి - 1 టీస్పూన్

ఇంగువ - చిటికెడు

నిమ్మరసం - 1/2 కప్పు

తయారీ విధానం:

పసుపు పొట్టు తీసి శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఎండలో ఉంచాలి లేదా కాటన్ గుడ్డతో తుడిచి ఆ తడిని తీసివేయాలి.

ఇప్పుడు పసుపును చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

మూకుట్లో ఆవ నూనెను వేడిచేసి, ఆ తర్వాత నూనె కాస్త చల్లారిన తర్వాత ఇంగువ, మెంతులు సహా మిగిలిన అన్ని పదార్థాలు వేయాలి.  అనంతరం పసుపు ముక్కలను నూనెలో వేసి బాగా కలపాలి.

ఇప్పుడు పచ్చడి తయారీ దాదాపు పూర్తయినట్లే. దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో నిమ్మరసం వేసి బాగా కలిపాలి. ఆ తర్వాత మూతపెట్టి ఒక 4-5 గంటల పాటు అలాగే ఉంచాలి.

ఇప్పుడు పచ్చి పసుపు ఊరగాయ రెడీ అయినట్లే, దీనిని ఒక గాజు గ్లాస్ లేదా సిరామిక్ కంటైనర్‌లో భద్రపరుచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచింగ్ లోకి అంటే ఆహారంలో కలుపుకొని తినొచ్చు. ఈ ఊరగాయ ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది.

చివరగా మరో మంచి మాట: 

ఆయుర్వేదంలో పసుపును ఔషధంగా ఉపయోగించటానికి ప్రధాన కారణం పసుపు సమ్మేళనంలో ఉండే క్యాన్సర్ నిరోధక గుణం. ఇటలీలోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో 2016లో నిర్వహించిన ఒక పరిశోధనలో పచ్చి పసుపును తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించడమే కాకుండా చెడు రేడియేషన్ వల్ల వచ్చే కణితులను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారణ అయింది.