తెలుగు న్యూస్  /  Lifestyle  /  Shaking Less Salt On Food Could Reduce Heart Disease Risk Research Reveals

Salt on food: ఉప్పు చల్లుకుంటున్నారా? ఈ స్టడీ ఏం తేల్చిందో చూడండి

HT Telugu Desk HT Telugu

29 November 2022, 12:41 IST

    • Salt on food: తరచుగా మీ ఆహారంపై ఉప్పు చల్లుకోకపోతే ముద్ద దిగడం లేదా? అయితే మీరు రిస్క్‌లో పడ్డట్టేనని ఈ అధ్యయనం చెబుతోంది.
వంటలో వేసిన ఉప్పుకు తోడు పై ఉప్పు జల్లుకుంటే చాలా అనర్థాలు
వంటలో వేసిన ఉప్పుకు తోడు పై ఉప్పు జల్లుకుంటే చాలా అనర్థాలు

వంటలో వేసిన ఉప్పుకు తోడు పై ఉప్పు జల్లుకుంటే చాలా అనర్థాలు

ఆహారంపై అదనంగా ఉప్పు చల్లుకునే వారి కంటే తక్కువ సందర్భాల్లో అలా చేసే వారిలో గుండె జబ్బుల రిస్క్ చాలా తక్కువగా ఉన్నట్టు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త పరిశోధన తేల్చింది. ఉప్పు వినియోగం తగ్గించిన వారిలో గుండె ఆరోగ్యంగా పదిలంగా ఉందని తేల్చింది.

కార్డియోవాస్కులర్ వ్యాధుల్లో ప్రమాదకరమైన కారకం హై బ్లడ్ ప్రెజర్. సోడియం ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. కానీ దీర్ఘకాలంలో మనం ఎంత సోడియం తీసుకుంటున్నామో కొలిచే టెక్నిక్స్ లేకుండా పోయాయి. అయితే తాజా అధ్యయనం ఒకటి దీనికి సంబంధించిన అంచనాలను కనిపెట్టగలిగింది. ఎన్నిసార్లు ఆహారంపై ఉప్పు చల్లుకుంటున్నారన్న లెక్క ఆధారంగా ఎంతమేర సోడియం తీసుకుంటున్నారో అంచనా వేయవచ్చని ఈ పరిశోధన తేల్చింది.

‘మొత్తంగా మేం కనుగొన్నదేంటంటే ఆహారంపై ఉప్పు చల్లుకునే వారితో పోలిస్తే చల్లుకోని వారిలో గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ చాలా తక్కువగా ఉంది. ఇతర లైఫ్‌స్టైల్ కారకాలు, ఇప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధం లేకుండా ఇలా పైనుంచి అదనంగా ఉప్పు జల్లుకుంటే గుండె జబ్బు ప్రమాదాలు ఎక్కువే..’ అని న్యూఆర్లీన్స్‌లోని ట్యూలేన్ యూనివర్శిటీ నుంచి స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ లు క్వి వివరించారు.

‘హైపర్ టెన్షన్ తగ్గించే ఆహారాన్ని (డాష్ డైట్) స్వీకరించే పేషెంట్లకు అదనపు ఉప్పు తగ్గించేందుకు అరుదుగా మాత్రమే ఆహారానికి సాల్ట్ జత చేసినప్పుడు వారికి గుండె జబ్బుల ప్రమాదం తగ్గినట్టు గమనించాం. మొత్తంగా ఉప్పు తగ్గించకుండా, కేవలం అదనపు ఉప్పును తగ్గించడంలో ఇది అర్థవంతమైన ప్రక్రియ. పేషెంట్లు మొత్తంగా త్యాగం చేయకుండా రిస్క్ ఫ్యాక్టర్‌ను తగ్గించుకోవచ్చు..’ అని వివరించారు.

ప్రస్తుత పరిశోధనలో 1,76,570 మంది డేటాను పరీక్షించారు. ఆహారంపై ఉప్పు చల్లుకోవడంలో ఫ్రీక్వెన్సీకి, గుండె జబ్బులు పెరిగేందుకు ఉన్న రిస్క్‌ను విశ్లేషించారు. డాష్ డైట్, ఆహారంపై తరచూ సాల్ట్ చల్లుకోవడం వంటి అంశాలకు గుండె జబ్బులకు ఉన్న సంబంధంపై ఈ పరిశోధనలో విశ్లేషించారు.

వంటలో కలిపే ఉప్పును మినహాయించి, ప్రజలు ఎంత తరచుగా ఆహారానికి అదనంగా ఉప్పు కలుపుతున్నారు? సమాచారం సేకరించేందుకు ఒక బేస్‌లైన్ ప్రశ్నపత్రాన్ని వినియోగించారు. గడిచిన ఐదేళ్లలో వారి డైట్‌లో చేసిన మార్పుల గురించి కూడా ప్రశ్నించారు.

రెడ్, ప్రాసెస్డ్‌ మాంసాన్ని తగ్గించడం, కూరగాయలు పండ్లు, తృణ ధాన్యాలు, తక్కువ కొవ్వు గల పాల ఉత్పత్తులు, గింజలు వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి వాటి ద్వారా హైపర్ టెన్షన్ తగ్గించడానికి ప్రయత్నించారు. ఈ డాష్ డైట్‌‌కు సోడియం తగ్గించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఈ అధ్యయనం ఒకటి తేల్చింది. గుండెపై ఒత్తిడి, మంట తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. గుండె జబ్బులు తగ్గించడంలో డాష్ డైట్ మేలు చేస్తుందని కూడా తేలింది.

దిగువ సామాజిక-ఆర్థిక స్థితి కలిగినవారు, ప్రస్తుతం స్మోక్ చేస్తున్న వారు ఎక్కువగా అదనపు ఉప్పు వినియోగిస్తున్నారని, వారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. డాష్ డైట్ స్కోరు బాగున్న వారిలో గుండె జబ్బుల రిస్క్ తక్కువగా ఉందని గమనించారు.