Heart health: గుండె జబ్బులపై ఈ 5 అపోహలు వీడండి.. వైద్యుల మాట వినండి-5 common myths busted by doctors about heart diseases ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  5 Common Myths Busted By Doctors About Heart Diseases

Heart health: గుండె జబ్బులపై ఈ 5 అపోహలు వీడండి.. వైద్యుల మాట వినండి

HT Telugu Desk HT Telugu
Nov 22, 2022 02:56 PM IST

Heart health: గుండె జబ్బులు మనకెందుకు వస్తాయిలే వంటి చాలా అపోహలు జనంలో నాటుకుపోయాయి. కానీ డాక్టర్లు ఏమంటున్నారు?

గుండె జబ్బుల చుట్టూ ఉన్న అపోహలను నివృతి చేసిన వైద్యులు
గుండె జబ్బుల చుట్టూ ఉన్న అపోహలను నివృతి చేసిన వైద్యులు (Karolina Grabowska)

గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఏటా 17.9 మిలియన్ల చావులు గుండె జబ్బుల కారణంగానే వస్తున్నాయి. గుండె జబ్బు అనే పదం వినగానే భయపడిపోతాం. అయితే ఈ గుండె జబ్బు చుట్టూ అనేక అపోహలు అలుముకుని ఉన్నాయి. సరైన సమాచారం, సమయానికి తగిన కార్యాచరణ ఉంటే గుండె జబ్బులను నివారించవచ్చు. ఒకవేళ గుండె జబ్బులు ఉన్నట్టు తేలినా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నిఖిల్ బన్సల్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుండె జబ్బులు, వాటి చుట్టూ ఉండే అపోహలపై మాట్లాడారు. ‘మన గుండె గురించి మనకు నిజంగా తెలుసా? అనేక అపోహలు, తప్పుడు సమాచాారంతో మనం మోసపోతాం. గుండె జబ్బులు కేవలం వృద్ధుల్లో మాత్రమే వస్తాయని, లేదా వేపుళ్లు ఎక్కువగా తినేవారికి మాత్రమే వస్తాయని నమ్ముతాం. తప్పుడు నమ్మకాలు కూడా మన గుండెకు చేటు చేస్తాయి. వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని రక్షించుకుందాం..’ అని అన్నారు.

అపోహ 1: నేను చిన్న వాడిని నాకు గుండె జబ్బులు ఎందుకు వస్తాయి?

మీరు ఈరోజు ఎలా జీవిస్తున్నారన్న దానిని బట్టి మీకు భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ధమనుల్లో చిన్న వయస్సు నుంచే ఫలకాలు పేరుకుపోవడం మొదలవుతుంది. అందువల్ల అనారోగ్యకరమైన తిండి, సెడెంటరీ (కదలిక లేని) లైఫ్‌స్టైల్ యుక్త వయస్సులోనే గుండె జబ్బులకు కారణమవుతుంది. ముఖ్యంగా యువకుల్లో ఇప్పుడు ఒబెసిటీ, డయాబెటిస్ సర్వసాధారణమైపోయింది. ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, షుగర్స్ అధికంగా ఉన్న ఫుడ్‌ జోలికి వెళ్లొద్దు. రోజూ క్రమం తప్పకుండా కనీసం ఒక గంట శారీరకంగా శ్రమించండి.

అపోహ 2: వంశపారంపర్యంగా వస్తోంది. ఇక నేను చేసేదేముంది?

ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులు ఉంటే మీరు ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నట్టే. అయితే ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నిత్యం శారీరక శ్రమ చేయండి. బరువును అదుపులో పెట్టుకోండి. పొగ తాగడం మానేయండి. రక్తపోటును అదుపులో పెట్టండి. అలాగే షుగర్, కొలెస్టరాల్ స్థాయిలను అదుపులో పెట్టండి. మీ ఆరోగ్యం తప్పక మెరుగుపడుతుంది.

అపోహ 3: బ్లడ్ ప్రెజర్ ఉంటే లక్షణాలు తెలిసిపోతాయి కదా?

రక్తపోటు ఒక సైలెంట్ కిల్లర్. మీకు హైబీపీ ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు బయటపడవు. జరగాల్సిందంతా జరిగాకే మీకు హైబీపీ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ రక్తపోటుకు సరైన చికిత్స తీసుకోనప్పుడు అది హార్ట్ అటాక్‌కు దారితీస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. అందువల్ల క్రమం తప్పకుండా బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ చేసుకోవడం అత్యవసరం.

అపోహ 4: హార్ట్ అటాక్ వస్తే తెలిసిపోతుంది కదా.. చెస్ట్ పెయిన్ వస్తుంది కదా..

చెస్ట్ పెయిన్ రావడం సాధారణం. కానీ ఇదొక్కటే కాకుండా వేరే లక్షణాలు కూడా ఉండొచ్చు. ఒకటి లేదా రెండు చేతుల్లో నొప్పి, దవడలు, మెడ, వెన్ను భాగాల్లో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హార్ట్ బీట్‌లో అసాధారణ మార్పులు, వికారం, తలనొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మీరు శ్రమించేటప్పుడు ఈ లక్షణాలు కనిపించి, విశ్రాంతి తీసుకున్నప్పుడు మాయమవ్వొచ్చు. అందువల్ల వాటిని మనం గమనించకపోవచ్చు. గుండె జబ్బు ముదురుతున్న కొద్దీ లక్షణాలు కనిపిస్తాయి.

అపోహ 5: నాకు చాలా వయస్సు వచ్చింది. చికిత్స తీసుకున్నా ఫలితం ఉండదు

మీ వయస్సు ఎంతన్నది ముఖ్యం కాదు. మీరు ఎంత త్వరగా డాక్టర్‌ను చేరుకున్నారన్నది ముఖ్యం. సమయానికి చికిత్స అందడం చాలా కీలకం. ఆలస్యం జరిగితే ఫలితం వేరుగా ఉంటుంది. గుండె జబ్బులు ప్రాణాంతకమైనవి. అయితే సరైన జీవనశైలిని ఎంచుకుంటే వాటి నుంచి రక్షించుకోవచ్చు. త్వరగా గుర్తించగలిగితే మెరుగైన చికిత్స అందించవచ్చు.

WhatsApp channel

టాపిక్