తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Explore India | భారతదేశ వారసత్వాన్ని అన్వేషించడానికి సందర్శించాల్సిన ప్రదేశాలు..

Explore India | భారతదేశ వారసత్వాన్ని అన్వేషించడానికి సందర్శించాల్సిన ప్రదేశాలు..

HT Telugu Desk HT Telugu

15 August 2022, 11:29 IST

    • భారతదేశం ఎన్నో అద్భుతమైన చారిత్రక, వారసత్వ ప్రదేశాలకు నిలయం. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వైవిధ్యతను చాటే ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికోసం ఇక్కడ కొన్ని ప్రదేశాల జాబితాను అందిస్తున్నాం. 
Hampi
Hampi

Hampi

భారతదేశం ఈ ఏడాది 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఇంతటి మహోన్నతమైన రోజున భారతదేశ చారిత్రక, వారసత్వ ప్రదేశాలు త్రివర్ణపు కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. మన దేశంలోని గొప్ప సాంస్కృతిక, భౌగోళిక వైవిధ్యాన్ని అన్వేషించటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారతదేశంలో యునెస్కో ప్రకటించిన 40 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఇవి మన పురాతన సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలపై గొప్ప అవగాహనను అందిస్తాయి. ఈరోజున ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలనుకుంటే మన దేశంలోని వారసత్వ ప్రదేశాలలో పర్యటించవచ్చు. ప్రసిద్ధ స్మారక చిహ్నాలను సందర్శించవచ్చు. సుసంపన్నమైన మన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కనులారా వీక్షించి గర్వపడవచ్చు. అంబరాలను అంటే స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను ఆస్వాదించవచ్చు.

భారతదేశ సాంస్కృతిక వైభవం, వివైధ్యతను చాటే కొన్ని అద్భుత ప్రదేశాల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు జీవితంలో కచ్చితంగా ఈ ప్రదేశాలను ఒక్కసారైనా సందర్శించాలి.

హంపి

హంపి నగరాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఓపెన్-ఎయిర్ మ్యూజియంగా కూడా పరిగణిస్తారు. ఎందుకంటే గత చరిత్ర వైభవాన్ని ఇది కళ్లకు కడుతుంది. దీనిని శిథిలాల నగరంగా కూడా చెప్తారు. ఈ పట్టణం విజయనగర సామ్రాజ్యం గొప్ప గతాన్ని ఠీవీగా ప్రదర్శిస్తుంది. ఆనాటి దేవాలయాలు, రాజ కోటలు, ఇతర్త ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నింటినో ఇక్కడ కనులారా వీక్షించి తరించవచ్చు.

అండమాన్ -నికోబార్ దీవులు

అండమాన్- నికోబార్ దీవులలో సెల్యులార్ జైలు ఉంది. దీనిని కాలా పానీ అని కూడా పిలుస్తారు. తిరుగుబాటు నాయకులను బంధించటానికి బ్రిటిష్ వారు ఈ జైలును ఉపయోగించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో తెల్లవారితో ఎంతో వీరోచితంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులను ఈ జైలులో బందీ చేశారు. ఆనాటి సాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తిని ఈ ప్రదేశం సందర్శించి పొందవచ్చు.

ఝాన్సీ

స్వాతంత్య్ర సంగ్రామ పోరులో కదంతొక్కిన నేల ఝాన్సీ. ఉత్తరప్రదేశ్‌లోని ఈ చారిత్రాత్మక నగరం 1857 స్వాతంత్య్ర పోరాటాలను కళ్లముందు ఆవిష్కరిస్తుంది.పరాయిపాలనపై తిరుగుబాటు జెండా ఎగరవేసి ప్రాణాలు అర్పించిన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పరిపాలన కేంద్రం, ఝాన్సీ కోటను సందర్శించవచ్చు.

ఫజ్లానీ నేచర్స్ నెస్ట్

గంభీరమైన పశ్చిమ కనుమలకు ఎదురుగా, మహారాష్ట్రలోని లోనావాలాలోని ఫజ్లానీ నేచర్స్ నెస్ట్ రిసార్ట్, పచ్చని పచ్చిక బయళ్ళు , నీలాకాశం, ఎత్తు నుంచి జాలువారే జలపాతాల దృశ్యాలను ఆస్వాదించవచ్చు. స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు.

ఉదయపూర్

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ ఒకప్పుడు మేవార్ రాజవంశీయుల రాజధాని. రాజ్‌పుత్ ల వాస్తుశిల్పం, విలాసవంతమైన రాజ నివాసాలను ఇక్కడ సందర్శించవచ్చు. భారతదేశ సంస్కృతిక వైవిధ్యను, ప్రామాణికమైన రాజస్థానీ వంటకాలను ఇక్కడ ఆస్వాదించవచ్చు.

టాపిక్