తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Indian Extremes | అతిశయమే ఆశ్చర్యం పొందే అద్భుతాలు, భారత్‌లోని ఈ ప్రదేశాలు!

Indian Extremes | అతిశయమే ఆశ్చర్యం పొందే అద్భుతాలు, భారత్‌లోని ఈ ప్రదేశాలు!

Manda Vikas HT Telugu

28 February 2022, 14:56 IST

google News
    • ప్రపంచంలో ఎక్కడాలేని ప్రకృతి సౌందర్యాలు, మాటలకందని అద్భుతాలు మన విశాల భారతదేశంలోనే ఎన్నో ఉన్నాయి. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న మన దేశం భౌగోళికంగా కూడా ఎన్నో భిన్నత్వాలను కలిగి ఉంది.
కైలాస మానసరోవరం
కైలాస మానసరోవరం (HT Photo)

కైలాస మానసరోవరం

చాలా మంది ఎక్కడెక్కడో అందాల గురించి మాట్లాడుకుంటారు, విదేశీ పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రపంచంలో ఎక్కడాలేని ప్రకృతి సౌందర్యాలు, మాటలకందని అద్భుతాలు మన విశాల భారతదేశంలోనే ఎన్నో ఉన్నాయి. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న మన దేశం భౌగోళికంగా కూడా ఎన్నో భిన్నత్వాలను కలిగి ఉంది.

అంతేకాదు అత్యంత ఎత్తైనవి, అత్యంత లోతైనవి, అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులు గల ప్రదేశాలు, అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మలుపులు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. అలాంటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూడండి.

అత్యంత పొడి ప్రదేశం

రాజస్థాన్ లోని జైసల్మేర్ భారతదేశంలోనే అత్యంత పొడి వాతావరణం కలిగిన ప్రదేశం. దేశంలో అత్యల్ప వర్షపాతం ఈ ప్రాంతంలోనే నమోదవుతుంది. పశ్చిమ భారతదేశానికి పశ్చిమాన థార్ ఎడారి నడిబొడ్డున ఉన్న జైసల్మేర్ మధ్యయుగ కాలంలో వాణిజ్య కేంద్రంగా ఉండేది. దీనిని 'గోల్డెన్ సిటీ' అని పిలుస్తారు. ఇక్కడ లభించే ఇసుకరాయి పసుపు రంగులో ఉండి నిర్మాణాలకు విభిన్నమైన రంగును తీసుకువస్తాయి.

అత్యంత తడి ప్రదేశం

మేఘాలయలోని మావ్సిన్‌రామ్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన ప్రదేశం. ఈ పట్టణం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ ప్రాంతంలోనే నమోదవుతుంది. 1985లో 260 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసి ఈ ప్రాంతం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది. ఇక్కడ వెదురుపుల్లలతో చేసే ప్రత్యేక బుట్టలను గొడుగుల్లా ఉపయోగిస్తారు. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 14 వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది.

అత్యంత శీతల ప్రదేశం

భారతదేశంలో అత్యంత శీతల ప్రదేశం ద్రాస్. ఇది కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ లోని కార్గిల్ జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేషన్. ఇది జోజిలా టన్నెల్ - కార్గిల్ టౌన్ మధ్య నేషనల్ హైవే 1పై ఉంది. దీనిని తరచుగా 'ది గేట్‌వే టు లడఖ్' అని కూడా పిలుస్తారు. చలికాలంలో ద్రాస్ వద్ద ఎముకలు కొరికేంత చలి ఉంటుంది. అత్యల్పంగా -45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. వేసవిలో కూడా ఉష్ణోగ్రతలు సున్నాగా నమోదయ్యే పరిస్థితులు ఉంటాయి. అయితే జూన్ నెలలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు చేరి ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతం సాహస క్రీడలకు ప్రసిద్ధి.

అత్యంత ఎత్తులో ఉండే రహదారి

ఖర్దుంగ్ లా ప్రాంతంలో ఆక్సిజన్ సాధారణం కంటే అత్యంత తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇది లేహ్ జిల్లాలో ఉన్న ఒక పర్వత మార్గం. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న రహదారి కూడా ఇదే. హిమాలయా పర్వత శ్రేణుల్లో చాలా ఎత్తులో ఈ రహదారి ఉండటం మూలానా ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎవరైనా బైకర్స్ ఈ మార్గంలో ప్రయాణించే వారు ఎక్కువసేపు ఇక్కడ నిలిచి ఉండకూడదు. లేదంటే శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తుత్తాయి. ఈ మార్గంలో వెళ్లే సందర్శకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్లను తీసుకెళ్తారు.

అత్యంత కఠినమైన తీర్థయాత్ర

కైలాస మానసరోవరం తీర్థయాత్ర చేయాలంటే సుమారు 18000 అడుగుల ఎత్తుకు ఎక్కాల్సి ఉంటుంది. అంతేకాదు విపరీతమైన మంచు, గడ్డకట్టే చలి పరిస్థితుల కారణంగా వికారం, వాంతులు మొదలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే దీనిని అత్యంత కఠినమైన తీర్థయాత్రగా చెప్తారు. ఈ యాత్ర పూర్తి చేయాలంటే కనీసం ఐదు-ఆరు రోజులు పడుతుంది. ఇప్పటివరకు కైలాస శిఖరాన్ని ఎవరూ చేరుకోలేరు. అన్ని రకాల యాత్రలు ఈ శిఖరం చుట్టే జరుగుతాయి. హిందువులు ఈ కైలాస శిఖరాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. సాక్షాత్ పరమేశ్వరుని నివాసంగా చెప్తారు. ఇది టిబెట్ ఉమ్మడి భూభాగంలో ఉన్నప్పటికీ భారత్ ఆధీనంలోనే ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం