తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bride Skincare: పెళ్లి రోజు చర్మం మెరవాలంటే.. ఈ తప్పులు చేయకండి

bride skincare: పెళ్లి రోజు చర్మం మెరవాలంటే.. ఈ తప్పులు చేయకండి

30 April 2023, 9:32 IST

  • వేసవిలో పెళ్లా? చర్మం అందంగా ఉండటం కోసం వేసవి కాలంలో అందరూ చేసే తప్పులే మీరూ చేయకండి. ఈ చిట్కాలు తెలుసుకోండి

     

వేసవిలో చర్మం ఆరోగ్యం
వేసవిలో చర్మం ఆరోగ్యం (Freepik)

వేసవిలో చర్మం ఆరోగ్యం

ప్రతి పెళ్లికూతురు చర్మం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. పెళ్లి రోజు అందంగా కనిపించాలని ఆశపడుతుంది. కానీ చర్మం ఆరోగ్యం కోసం చేసే కొన్ని పనుల వల్ల హాని కూడా జరగొచ్చు. ఆ తప్పులేంటో తెలుసుకోండి.

సన్‌స్క్రీన్:

పెళ్లి షాపింగ్ వల్ల ,వేరే పనుల కోసం ఎండలో తిరగాల్సి రావడం వల్ల చర్మం రంగు మారుతుంది. ఆ నలుపు తగ్గడానికి సన్‌స్క్రీన్ సాయపడుతుంది. క్రమం తప్పకుండా పెళ్లికన్నా కొన్ని రోజుల ముందు నుంచి కూడా సన్‌స్క్రీన్ రాసుకోండి. కనీసం ఎస్పీఎఫ్ 30 ఉన్నది ఎంచుకోండి. ప్రతి రెండు మూడు గంటలకోసారి సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండటం మర్చిపోకండి.

కెమికల్ పీల్స్:

కెమికల్ పీల్ చేయించుకోవాలనుకుంటే పెళ్లిరోజుకు మరీ దగ్గరగా చేయించుకోకండి. ఎందుకంటే చర్మం ఎర్రగా మారడం, పొడిబారడం, పొలుసులుగా ఊడటం.. లాంటి సమస్యలు రావచ్చు. అందుకే కనీసం రెండు మూడు వారాల ముందే ప్లాన్ చేసుకోండి. అలాగే ఇవి చేయించుకున్నాక ఎండలో తిరిగితే చర్మం దెబ్బతింటుంది. రంగు మారే అవకాశం ఉంది. అందుకే వీలైనంత ముందుగానే చికిత్స చేసుకుంటే మంచిది.

కొత్త ఉత్పత్తులు:

ఇప్పటిదాకా మీరు వాడని ఏ ఉత్పత్తినీ కొత్తగా వాడకండి. చర్మం అందంగా కనిపించడానికని కొత్తవి వాడితే అవి నప్పక ఇంకేమైనా కొత్త సమస్య వచ్చే ప్రమాదం ఉంది.

రెటినాల్:

రెటినాల్ వల్ల చర్మం పొడిబారుతుంది, కొన్నిసార్లు ఎరుపెక్కుతుంది. మీకు అలవాటుంటేనే దీన్ని వాడండి. కొత్తగా మొదలు పెట్టకండి. ఒకవేళ రెటినాల్ వాడితే దినంలో సన్‌స్క్రీన్ తప్పకుండా వాడాలని గుర్తుంచుకోండి.

ఫేషియల్స్:

ముఖానికి ఫేషియల్స్ కూడా కనీసం నాలుగైదు రోజుల ముందే చేయించుకోండి. కాస్త సమయం ఉంటేనే ఫేషియల్స్ తరువాత వచ్చే చిన్న చిన్న మొటిమలు మీ పెళ్లిరోజు వరకూ తగ్గిపోతాయి.

తీపి పదార్థాలు, పాలు :

జిడ్డు చర్మం ఉన్నవాళ్లు, మొటిమల సమస్య ఉన్నవాళ్లు వీటిని తక్కువగా తీసుకుంటే మంచిది. లేదంటే పెళ్లి రోజున ఇబ్బంది పడతారు. పెళ్లి సమయంలో మీకు తెలీకుండానే ఎక్కువగా స్వీట్లు తినాల్సి వస్తుంది. వీలైనంత వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.

ముఖం కడుక్కోవడం:

వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే మొటిమలు వచ్చేస్తాయి. ముఖ్యంగా జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు ఫోమింగ్ లేదా జెల్ క్లెన్సర్ వాడండి. పొడిచర్మం ఉన్నవాళ్లు నూనె ఆధారిత ఉత్పత్తులు వాడితే మంచిది.

మాయిశ్చరైజర్:

ఇది రాస్తే మంచిదని, ఎక్కువగా రాసేసుకోకూడదు. దానివల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. తరువాత యాక్నె వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మాయిశ్చరైజర్‌ను రోజుకు రెండు సార్లు రాసుకోండి చాలు.