తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know These Ayurveda Secrets To Combat Cough And Cold In Winter

Ayurveda secrets for cold: జలుబు నుంచి ఉపశమనానికి ఆయుర్వేద రహస్యాలు

Parmita Uniyal HT Telugu

26 January 2023, 18:00 IST

    • చలికాలంలో జలుబు, దగ్గు సర్వసాధారణం. వారం రోజులలో దానంతటదే తగ్గుతుంది. అయితే ఇది చాలా కాలం పాటు ఉండే కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ఈ ఆయుర్వేద చిట్కాలు మీ జలుబు, దగ్గు లక్షణాలను త్వరగా తగ్గిస్తాయి.
శీతాకాలంలో దగ్గు, జలుబును ఎదుర్కోవడానికి ఆయుర్వేద రహస్యాలు
శీతాకాలంలో దగ్గు, జలుబును ఎదుర్కోవడానికి ఆయుర్వేద రహస్యాలు (Pixabay)

శీతాకాలంలో దగ్గు, జలుబును ఎదుర్కోవడానికి ఆయుర్వేద రహస్యాలు

జలుబు మీకు పెద్దగా ఆందోళన కలిగించే సమస్యగా అనిపించకపోవచ్చు. కానీ మిమ్మల్ని శక్తిహీనుల్ని చేస్తుంది. ముక్కు కారడం, తుమ్ములు, దగ్గు వంటి లక్షణాలు మీ రోజువారీ పనితీరుపై ప్రభావం చేస్తుంది. చాలా కేసుల్లో జలుబు చెవి ఇన్ఫెక్షన్లను కూడా తెచ్చిపెడుతుంది. బ్యాక్టీరియా లేదా వైరస్ చెవిలోపలికి చేరి చెవి ఇన్ఫెక్షన్లను కూడా తెచ్చిపెడుతుంది.

కొన్నిసార్లు జలుబు ఆస్తమా వంటి లక్షణాలనూ చూపిస్తుంది. ఎక్కువ కాలం జలుబు ఉండడం తీవ్రమైన సైనసైటిస్‌కు దారితీస్తుంది. సైనసెస్‌లో వాపు, మంట కూడా వస్తుంది. బ్యాక్టీరియా వల్ల కలిగే గొంతు నొప్పి, న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి ఇతర జలుబు సంబంధిత శ్వాసకోస సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి. జలుబుకు సంబంధించి చాలా వైరస్‌లు ఉన్నప్పటికీ అత్యంత సాధారణంగా సోకేవి రైనోవైరస్‌లు. నోరు, కళ్లు, ముక్కు ద్వారా సాధారణ జలుబు వైరస్‌లు ప్రవేశించి గాలి ద్వారా ఇతరులకూ వ్యాప్తిచెందుతాయి.

వింటర్‌లో సర్వసాధారణం

‘వింటర్ సీజన్‌లో జలుబు, దగ్గు సర్వ సాధారణం. మన శరీరం సీజన్ల మార్పిడికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు జలుబు వంటి వాటి బారిన పడుతాం..’ అని ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ నీతికా కోహ్లీ ఇటీవలి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పంచుకున్నారు. జలుబు, దగ్గు ప్రభావాన్ని తగ్గించేందుకు ఆమె కొన్ని సూచనలు చేశారు.

నువ్వుల నూనె: నువ్వుల నూనె చుక్కలు ముక్కులో సహజ లూబ్రికేషన్‌గా పనిచేస్తాయి. ముక్కు ద్వారాల్లో ఇరిటేషన్ తగ్గిస్తాయి. వెచ్చదనాన్ని ఇచ్చే ఈ నువ్వుల నూనె కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే జలుబు, దగ్గు నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

ఆవిరి పీల్చడం: తేమ, వెచ్చదనం కలయిక ముక్కులో ఉపశమనం ఇస్తుంది. తలనొప్పికి కూడా రిలీఫ్ ఉంటుంది. వేడిచేసిన నీటిపై శ్వాస తీసుకోవడం ద్వారా మీరు ఆవిరిని పీల్చుకోవచ్చు.

ముక్కు రంధ్రాలను క్లియర్ చేయడానికి జలనేతి: ఈ ఆయుర్వేద టెక్నిక్ మీ ముక్కును శుభ్రపరచడంలో సహాయపడుతుంది. జలనేతి అంటే ఒక నాసికా రంధ్రంలో నీటిని పోసి, నాసికా మార్గాన్ని క్లియర్ చేయడానికి మరొక ముక్కు రంధ్రం నుండి బయటకు తీయడం.

హైడ్రేషన్ అవసరం: తగినంత నీరు తీసుకోవడంతో పాటు, మసాలా కలిపిన నీటిని కూడా తాగవచ్చు. వాము, జీలకర్ర, అల్లం, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలతో మరిగించిన నీరు జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది.

యోగా, ప్రాణాయామ: ముక్కును క్లియర్ చేసేందుకు యోగా, ప్రాణాయామ కూడా సాయపడుతుంది.