తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  International Daughters’ Day 2022 । కూతురుని చూసి గర్వించే ప్రతి తల్లిదండ్రులకు ఈరోజు అంకితం!

International Daughters’ Day 2022 । కూతురుని చూసి గర్వించే ప్రతి తల్లిదండ్రులకు ఈరోజు అంకితం!

HT Telugu Desk HT Telugu

25 September 2022, 12:41 IST

    • International Daughters’ Day 2022: ఈరోజు అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం.. ఏటా సెప్టెంబర్ నాలుగో ఆదివారం ఈ ప్రత్యేకమైన రోజును వేడుకగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, ఇది సెప్టెంబర్ 25న వచ్చింది. ఈ రోజుకున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి, మీ బంగారు తల్లులకు శుభాకాంక్షలు తెలపండి.
International Daughters’ Day 2022:
International Daughters’ Day 2022: (Pixabay)

International Daughters’ Day 2022:

భారతదేశంలోని చాలా కుటుంబాలు కొడుకు- కుమార్తెల మధ్య పక్షపాత ధోరణితో వ్యవహరిస్తాయనేది కాదనలేని వాస్తవం. వారికి కొడుకు పుట్టినపుడు కలిగే ఆనందం కూతురు పుట్టినపుడు ఉండదు. ప్రేమాభిమానాలు అన్నీ కూతురిపై కంటే ఎక్కువ కొడుకుపైనే చూపిస్తారు. ఆడపిల్ల పుడితే అదొక ఖర్చుగా, భారంగా భావించే తల్లిదండ్రులు ఎందరో. కొంతమందైతే పుట్టేది ఆడపిల్ల అని తెలిసినపుడు, కనీసం ఆ బిడ్డను ఈ లోకాన్ని కూడా చూడనివ్వకుండా పురిట్లోనే చంపేస్తారు. మరికొంత మంది ఆడపిల్లను అమ్మడం కూడా చేస్తారు. అలాంటి దుర్మార్గమైన సమాజంలో ఉన్నాం మనం.

ఆడపిల్ల అంటే లక్ష్మీదేవీతో సమానంగా చెప్తారు. పుట్టిన నాటి నుంచి తన కుటుంబానికి సేవలు చేసి ఆ ఇంటి వెలుగుగా నిలిస్తే, పెళ్లయ్యాక మరొక ఇంటిని సాకుతారు. సృష్టికి మూలం, ప్రేమకు చిహ్నం ఆడపిల్ల. ఆమె అంటూ ఒకరు లేకపోతే ఈ సృష్టి లేదు. అమ్మ, అక్క, భార్య అంటూ ఎవరూ ఉండరు. కుటుంబాలే ఉండవు. ఆడపిల్ల విశిష్టతను తెలియజెప్పేందుకు వారికంటూ ఒక ప్రత్యేకమైన రోజు వేడుకగా జరుపుతున్నారు. ఈరోజు అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం (International Daughters’ Day 2022). ప్రతీ ఏడాది సెప్టెంబర్ నాల్గవ ఆదివారం రోజున ఈ ప్రత్యేక సందర్భాన్ని జరుపుకుంటాము.

అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం ప్రాముఖ్యత

జనాభాలో లింగ అంతరాన్ని తొలగించడానికి, సమాజంలో స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పటానికి, ఆడపిల్లలకు అనేక రంగాలలో ప్రభుత్వాలు, సంస్థలు ప్రత్యేక అవకాశాలను అందించడానికి ఈరోజు ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆడ బిడ్డ పుట్టుకను వేడుక చేసుకోవాలంటూ చెప్పే ప్రయత్నం చేస్తూనే, ఆడపిల్లల పట్ల జరిగిన కొన్ని చారిత్రిక తప్పులకు క్షమాపణగా ఈ కుమార్తెల దినోత్సవం గుర్తింపు పొందింది. కుమారులు ఎంత ప్రభావితం చేయగలరో కుమార్తెలు కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరని చాటి చెప్పే రోజు ఇది. నేడు ఆడపిల్లలు అనేక రంగాలలో రాణిస్తున్నారు, సమర్థ నాయకత్వంతో సమాజానికి దిశాదశలు చూపుతున్నారు, మెడల్స్ సాధించి దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు.

కూతురంటేనే ప్రేమ

కుమార్తెలపై ఇప్పటికీ వివక్ష ఉన్నప్పటికీ, సమాజంలోనూ అక్కడక్కడా మార్పు కనిపిస్తుంది. కొడుకుకంటే కూతురును కనాలని ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. కుమార్తెలలో తమ తల్లిని చూసుకుని ప్రేమించే తండ్రులెందరో ఉన్నారు.

ఏదేమైనా మంచి మార్పు రావాలని కోరుకుందాం. కొడుకును కుమార్తెలను సమానంగా చూసే ధోరణి సమాజంలో ఉండాలని ఆశిద్దాం.

కూతుళ్లను ఇష్టపడే తల్లిదండ్రులకు, కూతుళ్లుగా పుట్టి గర్వపడుతున్న ఆడబిడ్డలందరికీ హిందుస్తాన్ టైమ్స్- తెలుగు తరఫున Happy Daughters’ Day గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం.

టాపిక్