Coconut Milk Rice । కొబ్బరిపాలతో అన్నం.. ఈ రాత్రికి తింటే ఉంటుంది స్వర్గం!
01 December 2022, 19:11 IST
- కొబ్బరిపాలతో అన్నం వండుకొని తింటే దాని టేస్ట్ ఎక్కడికో వెళ్తుంది. Coconut Milk Rice Recipe ఇక్కడ ఉంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.
Coconut Milk Rice Recipe
ఈరోజు తృప్తిగా భోజనం చేయాలి అని మీకు అనిపిస్తే, ఆ తృప్తి మీకు పిజ్జా బర్గర్లు, శాండ్ విచ్ లు లేదా నూడుల్స్ తింటే కచ్చితంగా రాదు. మనకు అన్నివేళలా సంతృప్తిని ఇచ్చే భోజనం ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా అన్నమే. అన్నం వండుకొని కారం కలుపుకొని తిన్నా సంతృప్తి లభిస్తుంది. మనందరికీ ఎంతో ఇష్టమైన బిర్యానీ చేసేది కూడా అన్నంతోనే.
మనం అన్నంతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో కూడా త్వరితగతిన చేసుకోగలిగే ఎన్నో రైస్ రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. రుచికరంగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, పులిహోర కలిపేయచ్చు లేదా ఆరోగ్యపరంగానూ ఎంతో అద్భుతమైన ఖిచ్డీ చేసుకోవచ్చు. ఈ ఖిచ్డీని కూడా మనకు నచ్చినట్లుగా కూరగాయలతో, పప్పులతో కలిపి చేసుకోవచ్చు. రాజ్మా అన్నం మరొక ఆప్షన్.
అయితే అన్నం వండే విధానాన్ని బట్టి అదొక కొత్త వంటకం అవుతుంది. మీరు టొమాటో రైస్, కొబ్బరి అన్నం వంటి రుచులు చూసే ఉంటారు. ఎప్పుడైనా కొబ్బరిపాలతో అన్నం వండుకొని చూశారా? ఇది కూడా చాలా తక్కువ సమయంలో సులభంగా వండుకోలిగే వంటకం. మీరూ ప్రయత్నించాలనుకుంటే, ఇక్కడ కొకొనట్ మిల్క్ రెసిపీని అందిస్తున్నాం, ఇలా ఒకసారి చేసుకొని తినండి.
Coconut Milk Rice Recipe కోసం కావలసినవి
- 1 కప్పు బియ్యం
- 1/2 కప్పు కొబ్బరి పాలు
- 2 కప్పుల నీరు
- 2 స్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్
- 2 పచ్చిమిర్చి
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 1 బిరియానీ ఆకు
- 4 పచ్చి ఏలకులు
- 6 లవంగాలు
- 1 tsp దాల్చిన చెక్క
- 1 స్పూన్ జీలకర్ర
- ఉప్పు రుచికి తగినంత
కొబ్బరిపాలతో అన్నం తయారుచేసే విధానం
- ముందుగా ప్రెజర్ కుక్కర్‌లో నూనె వేడి చేసి, అందులో జీలకర్ర, ఏలకులు, దాల్చినచెక్క, లవంగాలు, బిరియానీ ఆకు మొదలైన మసాలా దినుసులను వేయించాలి.
- ఇప్పుడు అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా వాసన వచ్చే వరకు వేయించాలి. ఆపై పచ్చిమిర్చి వేసి వేయించండి.
- ఈ దశలో మీరు కావాలనుకుంటే క్యారెట్లు, బీన్స్, ఆలు వంటి కూరగాయలను కలుపుకోవచ్చు. అయితే ఇది ఐచ్ఛికం.
- ఇప్పుడు నీళ్లు, కొబ్బరి పాలు పోయాలి. ఇందులో బియ్యం, అవసరం మేరకు ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం ప్రెజర్ కుక్కర్‌ను మూసివేయండి.
- దీనిని మీడియం మంట ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి.
- ఇప్పుడు తెరిచి చూడండి, ఘుమఘుమలాడే కొబ్బరి పాల అన్నం సిద్ధంగా ఉంది.
వేడివేడి నాటుకోడి చికెన్, మటన్, లేదా కర్రీ, చట్నీ దేనిని కలుపుకున్నా, అసలేమి కలుపుకోకపోయినా రుచి మాత్రం అదుర్స్.