తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతర విశేషాలు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతర విశేషాలు

Manda Vikas HT Telugu

15 February 2022, 14:17 IST

    • తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర, మహా గొప్ప జాతర. ఇది కేవలం తెలంగాణలోనే కాక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిచెందింది
Medaram Jatara
Medaram Jatara (HT Photo)

Medaram Jatara

తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించబడే మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర, మహా గొప్ప వేడుక. ఇది కేవలం తెలంగాణలోనే కాక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిచెందింది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో గల మేడారం అనే చిన్న గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. వరంగల్ నుంచి సుమారు 104 కిమీ, హైదరాబాద్ నుంచి సుమారు 238 కిలో దూరంలో మేడారం ఉంటుంది. రెండేండ్లకు ఒకసారి మాఘమాసంలో నాలుగు రోజుల పాటు కన్నులపండుగగా, పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల నుండి కూడా సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎక్కడెక్కడి నుంచో వీవీఐపిలు కూడా ఈ జాతరకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధిక మంది హాజరయ్యే జాతర ఇదే.

చారిత్రక నేపథ్యం.. 

చరిత్ర ప్రకారం చూస్తే, కాకతీయుల కాలంలో కొంతమంది పాలకులు చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగా తిరగబడ్డ ఇద్దరు తల్లీకూతుళ్లు సమ్మక్క, సారలమ్మల పోరాటాన్ని ఈ జాతర గుర్తు చేస్తుంది, అనంతర పరిణామాల తర్వాత కాకతీయ రాజులు తమ తప్పులు తెలుసుకొని సమ్మక్కకు భక్తులుగా మారినట్లు చరిత్ర చెబుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు కేవలం గిరిజనులు మాత్రమే చిలకలగుట్ట అనే ఒక కొండపైన జరుపుకునే వారు, కానీ 1940 తర్వాత నుంచి తెలంగాణలో అన్ని వర్గాలు, మతాలకు చెందిన ప్రజలంతా కలిసి జరుపుకోవడం ప్రారంభించారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు.

అమ్మవార్ల చిహ్నంగా సమ్మక్క-సారలమ్మ గద్దెలు ఏర్పాటై ఉన్నాయి. జాతర జరిగే నాలుగు రోజుల పాటు వివిధ ఘట్టాలు ఉంటాయి. ఈ తంతునంతా ఎంతో నిష్ఠగా జరిపేది వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే కావడం ఈ జాతరకున్న మరో ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు.

నాలుగురోజుల జాతర

మొదటి రోజు: జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. సారలమ్మ, పడిగిద్ద రాజులు మేడారం గద్దెకు చేరుకున్న సందర్భంగా ఉత్సవం నిర్వహిస్తారు. గిరిజన పూజారులు సారలమ్మకు రహస్యంగా, ప్రత్యేక ఆచారాలతో పూజలు నిర్వహిస్తారు. వివాహం కానివారు వివాహం కోసం, పిల్లలు కలగని వారు పిలల్ల కోసం, ఇతర బాధలు, వ్యాధులు ఉన్నవారు తమ సమస్యలన్నీ తీరిపోవాలని వేడుకుంటూ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

రెండవ రోజు: మేడారం జాతర యొక్క రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉండే సమ్మక్క మేడారం గద్దెకు చేరుకుంటుంది. ఆమె రాక సందర్భంగా ‘ఎదురుకోళ్ల' ఘట్టం నిర్వహిస్తారు. ప్రభుత్వం అధికార లాంఛనాల మధ్య సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క రాకకు సూచనగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపితే, ఉన్నతాధికారులు ఆ దేవతామూర్తికి సాదరంగా ఆహ్వనం పలుకుతారు. జయజయధ్వనాల మధ్య సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు.

మూడవ రోజు: జాతర మూడో రోజున సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంటారు. ఈరోజు జాతరలో అతి ముఖ్యమైన రోజు, ఇదే రోజున భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు కాబట్టి రద్దీ భారీగా ఉంటుంది. భక్తులు ‘జంపన్న వాగు’ లో పుణ్య స్నానాలు చేసిన తరువాత దేవతలను దర్శనం చేసుకొని, బోనాలు సమర్పిస్తారు. ఒడి బియ్యం, చీర, సారే కూడా సమర్పిస్తారు. ఇవే కాకుండా సమ్మక్క సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన సమర్పణ ‘బంగారం’. భక్తులు తమ బరువుకు సరితూగే 'కొత్త బెల్లం'ను దేవతలకు బంగారంగా సమర్పిస్తారు.

నాలుగవ రోజు: మేడారం జాతరలో ఇదే చివరి రోజు. ఈరోజు సమ్మక్క సారలమ్మల వనప్రవేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. వారిని గద్దెపైకి ఆహ్వానించేటపుడు ఏ రకమైన గౌరవం లభిస్తుందో, తిరిగి వెళ్లేటపుడు కూడా అదే స్థాయి అధికార లాంఛనాలతో సాగనంపుతారు. కోట్లాది మంది భక్తుల పూజలందుకున్న తరువాత, ఆ వన దేవతలు తిరిగి అడవిలోకి అంతర్ధానం అవుతారు, దీంతో మేడారం జాతర ముగిసినట్లు.

జాతరకు ఎలా చేరుకోవచ్చు?

మేడారం జాతరకు రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా చేరుకునే సౌకర్యం ఉంది. వరంగల్ తొలి గమ్యస్థానంగా గుర్తుంచుకోవాలి. రోడ్డు మార్గంలో అయితే జాతర సమయంలో హైదరాబాద్, వరంగల్ ఇతర జిల్లాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.  సొంత వాహనాలు, టాక్సీల్లో కూడా చేరుకోవచ్చు.

రైలు మార్గంలో అయితే ముందుగా వరంగల్ స్టేషన్ చేరుకోవాలి. అక్కడ నుంచి రోడ్డు మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఆర్టీసి బస్సులతో పాటు ఇతర ప్రైవేట్ టాక్సీలు కూడా చాలా నడుస్తాయి.

ఇటీవల హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించారు. అయితే ముందుగా ఆన్లైన్లో టికెట్ కన్ఫర్మ్ చేసుకొని ప్రయాణించాల్సి ఉంటుంది.

టాపిక్