తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Extramarital Affair | వివాహేతర సంబంధాలకు కారణం 'అదే'నట!

Extramarital Affair | వివాహేతర సంబంధాలకు కారణం 'అదే'నట!

HT Telugu Desk HT Telugu

04 April 2023, 21:42 IST

google News
    • Extramarital Affair:  భార్యభర్తలుగా పవిత్ర వివాహబంధంలో కొనసాగుతున్న చాలా మందిలో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి మొగ్గుచూపుతున్నారట, కారణాలు తెలిస్తే అవాక్కవుతారు.
Extramarital Affairs
Extramarital Affairs (istock)

Extramarital Affairs

Extramarital Affair: వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించేందుకు ముడివేసే ఒక పవిత్ర బంధం. ఈ బంధంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య జరిగే శృంగారం ఒక బాధ్యత. ఇద్దరి మధ్య ప్రేమానురాగాలకు, అన్యోన్యతకు అది చిహ్నం. వారి వంశ వారసత్వాన్ని కొనసాగించటానికి చేసే ఒక పవిత్రకార్యం. అవసరం ఏదైనా భార్యాభర్తలు శృంగారం చేయడంలో ఏమాత్రం తప్పులేదు. ఇద్దరి మధ్య శృంగారం లేకపోయినా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవించే దంపతులు ఎంతో మంది ఉంటారు. అయితే వీరి మధ్య మూడో వ్యక్తి రావడానికి కూడా ఈ శృంగారమే ముఖ్యపాత్ర పోషిస్తుందని కొన్ని సర్వేలు తెలిపాయి.

పెళ్లైన తర్వాత కూడా మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకునే వారు ఎక్కువే ఉన్నారని నివేదికలు తెలిపాయి. దీనికి ప్రధాన కారణం లైంగిక సంతృప్తి. సెక్స్ కోసమే ఎక్కువ మంది వివాహేతర సంబంధానికి మొగ్గుచూపుతున్నారని ఆ నివేదికల సారాంశం.

గ్లీడెన్ అనే ఒక డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వే ప్రకారం, భారతదేశంలో పెళ్లైన జంటలు వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి గల కారణాలను విశ్లేషించింది. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

మరో వ్యక్తిపై శారీరక ఆకర్షణ

ఆకర్షణ అనేది మరొకరితో సంబంధం పెట్టుకునే బలమైన కారణం. ఆకర్షణతో తమ భాగస్వామిని మోసం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే శారీరకంగా మరొక స్త్రీకి లేదా మరొక పురుషుడికి దగ్గరవ్వాలనే బలమైన కోరిక వీరిని ఆ వైపు నడిపిస్తుంది. గ్లీడెన్ సర్వే ప్రకారం, వివిధ ఈవెంట్లు, ప్రైవేట్ పార్టీలు మొదలైన కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు అక్కడికి వచ్చే అతిథులను చూసి 26 శాతం మంది ఆకర్షితులవుతున్నారట. వాట్సాప్, ఇన్‌స్టా‌గ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా 25 శాతం మంది మరొకరికి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారట.

భాగస్వామి నుండి శ్రద్ధ లేకపోవడం

తమ జీవిత భాగస్వామి తమను పట్టించుకోకపోవడం, ఎంత అందంగా ముస్తాబైనా ప్రశంసిచకపోవడం, తమ వైపు చూడకపోవడం, ప్రేమగా పలకరించకపోవడం వంటి చిన్నచిన్న విషయాలు వివాహేతర సంబంధానికి దారితీసే రెండో ప్రధాన కారణమట. తమ భాగస్వామి తమను ప్రేమించడం లేదు, ఆప్యాయతను పంచడం లేదు అనే భావన మరొక భాగస్వామికి కలుగుతుంది. ఇదే సమయంలో మూడో వ్యక్తి నుంచి ఇటువంటి శ్రద్ధ కనిపిస్తే, వారికి 57 శాతం మంది లొంగిపోతున్నట్లు సర్వే తెలిపింది. మరోవిషయం ఏమిటంటే, ఇందులో పెళ్లైన మొదటి సంవత్సరంలోపే తమ భాగస్వామికి నమ్మకద్రోహం చేసిన వారు 45 శాతం మంది ఉన్నారట.

భావోద్వేగ సాన్నిహిత్యం లేకపోవడం

భాగస్వామితో భావోద్వేగ సంబంధం లేకపోయినా కొన్నిసార్లు కొంతమంది తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారు. అంటే ఇక్కడ తమ భాగస్వామి నుంచి అన్ని రకాలుగా లభిస్తున్నప్పటికీ ఒక ఫీల్ లేకపోవడం. భాగస్వామిపై ఫీలింగ్స్ లేకపోవడం, అదేసమయంలో వేరొకరితో బలమైన భావోద్వేగ సంబంధం కలిగి ఉండటం వలన వారితో లోతుగా కనెక్ట్ అవుతున్నారు. ఈ రకంగా అటు జీవిత భాగస్వామితోనూ, మరొకరితోనూ శారీరకంగా దగ్గరవుతున్నారు. సర్వస్వం సమర్పించుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న 44 శాతం మంది దీనిని అంగీకరించినట్లు గ్లీడెన్ నివేదిక తెలిపింది.

లైంగిక సంతృప్తి లేకపోవడం

లైంగిక అసంతృప్తి అనేది వివాహేతర సంబంధానికి మరొక ముఖ్య కారణం. తమ జీవిత భాగస్వామితో ఎన్నిసార్లు సెక్స్ చేసినప్పటికీ లైంగిక సంతృప్తి పొందడం లేదని 41 శాతం మంది తెలిపారు. ఇదే సమయంలో మరొక భాగస్వామితో సెక్స్ చేసినపుడు చెప్పలేని అనుభూతి, సంతృప్తి కలిగిందని 55 శాతం తెలిపారు. ఇలా లైంగిక సంతృప్తి కోసం వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు.

థ్రిల్ కోసం

ఒకే వ్యక్తితో సెక్స్ చేయడం రుచించడం లేదని 37 శాతం తెలిపారు. ప్రతీసారి కొత్తవారితో శృంగారం చేయడం, ఎక్కువ మందితో శృంగారం చేయడం వంటి ఫాంటసీలు కలిగినవారు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తమ థ్రిల్ కోసం, సంతోషం కోసం ఏం చేసినా తప్పులేదు. ఉన్న ఒక్క జీవితాన్ని ఆస్వాదించడంలోనే తృప్తి ఉంటుందనేది వీరి వాదన.

ఇతర కారణాలు

ఇవే కాకుండా, తాము ప్రేమించిన వ్యక్తులతో శృంగార సంబంధాన్ని కొనసాగించడం, తమకు నమ్మకద్రోహం చేసిన భాగస్వామిపై ప్రతీకారం తీర్చుకోవడానికి, డబ్బు సంపాదించడం కోసం శరీరాన్ని అప్పగించడం, తమ పనులు పూర్తి చేయించుకోవడానికి, లైంగికంగా రెచ్చగొట్టే అవసరాలు కలిగి ఉండటం మొదలైన కారణాలు కూడా వివాహేతర సంబంధంలో పాత్ర పోషిస్తున్నాయని సర్వేలో తేలింది.

చివరగా ఒక్కమాట.. మనది విలువలు కలిగిన సమాజం. తాత్కాలిక సుఖాల కోసం మనల్ని కట్టుకున్న వారికి, నమ్ముకుని వచ్చిన వారికి నమ్మకద్రోహం చేయడం జుగుప్సాకరం. ఆకర్షణ, ఇతరులతో సెక్స్ చేయాలనే కోరికలు ఉన్మాదం వంటివి. ప్రేమ, నమ్మకం, నిజాయితీ ఉన్నచోటే బంధాలు నిలుస్తాయి, సంతోషాలు వెల్లివిరుస్తాయి. తప్పుగా ఆలోచించడం, తప్పుడు పనులకు దూరంగా ఉండటం అందరికీ మంచిది.

తదుపరి వ్యాసం