Extramarital Affairs। అక్రమ సంబంధాలు పెట్టుకునేది ఇందుకే.. మారాల్సింది వ్యక్తులే!
Reasons for Extramarital Affairs-సమాజంలో అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అసలు లోపం ఎక్కడుంది, అక్రమ సంబంధానికి దారితీసే కొన్ని పరిస్థితులు, ఉదాహరణలు ఇలా ఉన్నాయి.
అందంగా సాగుతున్న జీవితం, రత్నాల్లాంటి పిల్లలు, అంతలోనే భార్యభర్తల మధ్య ఉన్నట్లుండి పెద్ద అగాధం. దీనికి కారణం అక్రమ సంబంధం. అక్రమ సంబంధం దాంపత్య సుఖాన్ని పాడు చేస్తుంది. పచ్చని సంసారంలో చిచ్చు పెడుతుంది. భాగస్వాములిద్దరిలో ఏ ఒక్కరి విషయంలో అయినా అక్రమ సంబంధం బయటపడితే, అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఏ స్త్రీ తన భర్త చేసిన ద్రోహాన్ని సహించదు. అలాగే ఏ పురుషుడు తన భార్య పరాయివాడితో చనువుగా ఉండటాన్ని భరించలేడు. వారితో ఇక కొనసాగడం కష్టంగా ఉంటుంది. మూడుముళ్ల బంధం ముళ్లకంచెలా మనసును గాయపరుస్తుంది. ఇది ఇద్దరు విడిపోయేలా, మరింతగా చెడిపోయేలా, తమ చేజేతులా జీవితం నాశనం చేసుకునే వరకు వెళ్తుంది. కానీ, ఈ కారణం ఏ పాపం తెలియని పిల్లలు అన్యాయానికి గురవుతారు.
అయితే పెళ్లయ్యాక కూడా అక్రమ సంబంధం కలిగి ఉండటానికి కారణాలేమిటి? పురుషులు సరే, వారి సవాసాలు, వారి అలవాట్లు వారిని చెడగొట్టాయి అనుకుందాం. కానీ, మన సమాజంలో మహిళలు ఎన్నో కట్టుబాట్ల నడుమ పెరుగుతారు. మరి అసలు మహిళలు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకుంటారు? భర్త అన్ని విధాలుగా చూసుకుంటున్నప్పటికీ కొంతమంది స్త్రీలు తమ భర్తలను మోసం చేయాల్సిన అవసరం ఏమిటి? ఇలాంటి విషయాలపై విచారణ జరిపినపుడు, కౌన్సిలింగ్ సమయంలో మహిళలు ప్రధానంగా చేసిన ఫిర్యాదులు ఇలా ఉన్నాయి.
Reasons for Extramarital Affairs- అక్రమ సంబంధానికి దారితీసే కారణాలు
వివిధ నివేదికల్లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కొన్ని ఉదాహరణలు మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం.
చిన్న వయసులోనే పెద్ద వయస్కుడితో పెళ్లి
ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్లకే మూడు పదులకు పైగా వయసు ఉన్నవాడితో పెళ్లి జరిగింది. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న తనకు అవేమి లభించలేదు. రోజంతా ఇంటి పనులు, పిల్లలతోనే ఏళ్లు గడిచిపోయాయి. భర్తతో సంసారం పూర్తిగా యాంత్రికంగా అనిపించేది. నిరాశ, నిస్పృహలు ఆవహించిన సమయంలో ఒక వ్యక్తి ధైర్యం నూరిపోశాడు. అతని పరిచయం ఒక కొత్త ప్రపంచాన్ని చూపించింది. ఇన్నాళ్లు కుటుంబం కోసం అంకితమయిన ఆమె, తన కోసం తనకే సమయం కేటాయించుకోవాలని చూసింది. అతనికి మరింత దగ్గరయి, అది శారీరక సంబంధం వరకు వెళ్లింది.
భర్త వేధింపులు
ఇక్కడ ఒక స్త్రీ తన పెళ్లయిన దగ్గర్నించీ భర్త వేధింపులను ఎదుర్కొంది. ప్రతీ చిన్న విషయానికి పెద్ద గొడవలు సృష్టించేవాడు. శారీరకంగా, మానసికంగా హింసించే వాడు. ఎవరితో మాట్లాడినా అనుమానం, లేని సంబంధాన్ని అంటగడుతూ పదేపదే దెప్పిపొడవడం చేసేవాడు. దీంతో ఒకరోజు ఆమె అదే నిజం చేసింది. అలాంటి భర్తకు దూరంగా ఉండాలనుకుంది, కానీ కుటుంబం, చుట్టాలతో సత్సంబంధాలు ఉండటంతో విడాకులు ఇవ్వకుండా భర్తతోనే కాపురం కొనసాగించింది. మరోవైపు తన సంతోషానికి మార్గం వెతుక్కుంది.
భాగస్వామి ద్రోహం
ఈ సందర్భంలో తన భర్తకు ముందే పెళ్లి జరిగి ఉండటం లేదా ప్రేయసి, అఫైర్స్ ఉండటం జరిగింది. భర్త తనతో ప్రేమను నటిస్తూనే మరొకరితోనూ సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన భార్య, తన భర్తను అసహ్యించుకోవడం మొదలుపెట్టింది. ఆపై అతణ్ని దూరం పెడుతూ, తన భర్త చేసిన ద్రోహాన్ని అదే రూపంలో తిరిగి ఇవ్వాలనుకుంది. ఈ క్రమంలో పరాయివ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
సంసారానికి పనికిరాని భర్త
తన భర్త సంసారానికి పనికి రాడని కొన్నాళ్లకు భార్యకు విషయం బోధపడింది. తనను అందరూ మోసం చేశారని గ్రహించింది. కానీ, అతడితో తెగదెంపులు చేసుకోవడాన్ని పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆమె మరొకరితో తన జీవితాన్ని, సర్వస్వాన్ని పంచుకుంది.
ఇవి మాత్రమే కాకుండా కొంతమంది తమ భర్త బోరింగ్ అని, రొమాన్స్ తెలియదని, అందంగా లేడని, లేదా మరొకరికి ఆకర్షితం అయి, భర్త దూరంగా ఉంటాడని, పాత ప్రియుడి ప్రేమను వదులుకోలేక ఇలా ధర్మబద్ధం కానీ కారణాలకు కూడా అక్రమసంబంధాలు పెట్టుకున్న వారు ఉన్నారు.
ఏదేమైనా.. పెళ్లయ్యాక అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అది పురుషులైనా, స్త్రీలైనా. ఒకసారి తప్పు జరిగితే జీవితాలు ముగిసిపోయేవరకు దారితీయవచ్చు.
భార్యాభర్తలిద్దరి మధ్య ఎప్పుడైనా సరే మూడో వ్యక్తి ప్రమేయం అనేది ఉండకూడదు. నమ్మకం ఉన్నచోట భార్యభర్తల మధ్య బంధం దృఢంగా ఉంటుంది. ఒకరినొకరు ఇష్టపడుతూ, ప్రేమగా మెలిగితే తప్పుదారిపట్టడానికి ఆస్కారం ఉండదని మనస్తత్వ నిపుణులు అంటున్నారు.
గమనిక: పైన చెప్పినవి కొంతమందికి చెందిన ఉదాహరణలే. ఎవరో కొద్దిమంది మాత్రమే అలా ఉంటారు. అలాంటి పరిస్థితులు ఉన్న ఇళ్లలో కూడా కుటుంబాన్ని ఒంటి చేతితో మోసే స్త్రీమూర్తులు, కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే భర్తలు మన సమాజంలో చాలా మంది ఉంటారు.