Emotionally Healthy Relationships | ఒకరి మనసుకు దగ్గరవ్వాలంటే అందుకు మార్గాలు..!
సంబంధంలో ఉన్నప్పుడు భాగస్వామితో శారీరకంగానే కాదు, మానసికంగా ఏకమవ్వాలి. ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటే ఆ బంధం కలకాలం నిలిచి ఉంటుంది. భాగస్వామి మనసును గెలుచుకోవాలనుకుంటే ఈ మార్గాలు అనుసరించండి.

ఎవరితో అయినా సంబంధాలు ఏర్పడటం కొన్నిసార్లు సులభమే కావచ్చు, అయితే వారితో అనుబంధం ఏర్పడటం మాత్రం ఎప్పుడూ అంత సులభం కాదు. ఇందుకు ఇరువైపుల నుంచి చేసే ప్రయత్నాలు, కృషి అవసరం. ఇది ఒక వ్యక్తి అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడంలో అలాగే వారి భావోద్వేగాలకు ఎలా ప్రతిస్పందిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఒకసారి సంబంధం ఏర్పడిన తర్వాత కొద్దికాలానికి వారిలోని లోపాలు బయటపడతాయి. అలాంటి సందర్భాలలో వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉందనేది ముఖ్యం. ఇద్దరి మధ్య ఒక అటాచ్‌మెంట్, ఒక భావోద్వేగపూరితమైన అనుబంధం ఏర్పడినపుడే ఆ బంధం ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ప్రేమను చూపించగలుగుతారు, ఒకరి గురించి ఒకరు శ్రద్ధ తీసుకుంటారు. ఇది ఆరోగ్యకరమైన బంధానికి దారితీస్తుంది. అప్పుడే ఆ బంధంలో సంతోషంగా ఉండగలుగుతారు.
ఈ రకమైన ఎమోషనల్ బాండింగ్ అనేది లేకపోతే మనసులో ఎప్పుడూ ఏదో వెలితి ఉన్నట్లుగా ఉంటుంది. వారితో కలిసి సంసార జీవితాన్ని కొనసాగించినా, శృంగార జీవితాన్ని ఆస్వాదించినా ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతుంది. ఆ అసంతృప్తిని సంతృప్తి పరచటానికి మనసు తహతహలాడుతుంది. ఈ క్రమంలో ఏదైనా తప్పు దొర్లితే, చిచ్చు రేగుతుంది. అది చివరకు ఆ బంధం తెంచుకోవటానికి దారితీస్తుంది.
Emotionally Healthy Relationships- Experts Advice
ఏ వ్యక్తితో అయినా మానసికంగా ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మనస్తత్వ నిపుణులు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. అవేంటంటే..
భాగస్వామిని ప్రశంసించాలి
ఒక చిన్న ప్రశంస చాలా దూరం వెళుతుంది. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా, రోజూ ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ఒకరినొకరు ప్రశంసించుకోవటం ఉండాలి. వారు మీ కోసం పడుతున్న శ్రమను గుర్తించి అభినందించాలి. ఇది సంబంధాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఉత్సుకత చూపాలి
మీరు చెప్పేది మీ భాగస్వామి ఆసక్తిగా వినాలి, అదే సమయంలో వారు చెప్పేది మీరు వినకపోతే అది వేరే అర్థాన్ని కలిగిస్తుంది. మీకు వారిపై ఆసక్తి లేదన్నట్లుగా ఉంటుంది. మీ భాగస్వామి చెప్పేది వినసొంపుగా ఉన్నా, లేకపోయినా వారి మాట వింటే అది వారికి మీపై నమ్మకం కలిగేలా చేస్తుంది. తన విషయాలు పంచుకోవటానికి ఒకరున్నారనే భరోసా కలుగుతుంది.
కనెక్షన్
కొన్నిసార్లు ఒకరితో ఒకరు సమయం గడపడం వలన, ఒకరికొకరు సహాయం చేసుకోవడం వలన ఇద్దరి మధ్య ఒక కనెక్షన్ ఏర్పరుస్తుంది. ఇది మీకు ఒక మాయాజాలంలా అనిపించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన రోజూ, తేదీ కానవసరం లేదు. కలిసి వంట చేయడం, కలిసి భోజనం చేయడం, కలిసి సినిమా చూడటం లేదా ఎటైనా సరదాగా షికారుకు వెళ్లడం లాంటివి చేయాలి.
మీరు మీలానే ఉండాలి
ఎంత గొప్ప సంబంధంలో అయినా మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. మనం మనలా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇంకొకరిలా ప్రవర్తించకూడదు. భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. ఒడిదుడుకులు ఎదురైనపుడు మాత్రం పంతాలను వీడి పలకరించాలి.
చురుకైన శృంగారం
ఇద్దరి వ్యక్తులను దగ్గర చేసే శక్తి శృంగారానికి ఉంది. ఒక బంధంలో ఉన్నప్పుడు శృంగారం లేకపోతే అది చప్పగా ఉంటుంది. కాబట్టి మీ భాగస్వామితో ప్రేమగా దగ్గరవ్వండి. వారి మనసును గెలుచుకోండి.
సంబంధిత కథనం