తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Beetroot Soup । చలికాలంలో వేడివేడిగా ఈ సూప్ తాగండి, ముఖంలో మంచి గ్లో వస్తుంది!

Carrot Beetroot Soup । చలికాలంలో వేడివేడిగా ఈ సూప్ తాగండి, ముఖంలో మంచి గ్లో వస్తుంది!

HT Telugu Desk HT Telugu

01 November 2022, 16:10 IST

    • చలికాలంలో చర్మం, జుట్టు సమస్యల గురించి తెలిసిందే. మొఖం పాలిపోయి, జుట్టు రాలిపోయి కళావిహీనమైన మీ ముఖంలో మళ్లీ మంచి గ్లో తీసుకురావాలంటే Carrot Beetroot Soup తాగాలి, దీని రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Carrot Beetroot Soup
Carrot Beetroot Soup

Carrot Beetroot Soup

చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు అధికమవుతాయి. చలిగాలులతో చర్మం పొడిబారి మొఖం, పెదాలు, అరికాళ్లలో పగుళ్లు ఏర్పడతాయి. అలాగే జుట్టు కూడా నిర్జీవంగా మారి, తలలో చుండ్రు పెరుగుతుంది. జుట్టు రాలిపోవడం కూడా గమనించవచ్చు. ఇంకా జలుబు, దగ్గు మొదలైన సీజనల్ ఫ్లూల బారినపడటం గురించి వేరే చెప్పనవసరం లేదు.

ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో శరీరానికి బయట నుంచి మాత్రమే కాకుండా లోపలి నుంచి కూడా సంరక్షణ అవసరం. మంచి పోషక విలువలు కలిగిన బలవర్థకమైన అన్నపానీయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చలి వాతావరణంలో వేడివేడి సూప్ లు తాగితే ఎంతో వెచ్చని అనుభూతి కలగడమే కాకుండా, మంచి పోషణ అందుతుంది.

అయితే శీతాకాలంలో ముఖంపై మాయమైన కళ తిరిగిపొందటానికి, జుట్టు సమస్యల పరిష్కారానికి కూడా ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీ అందుబాటులో ఉంది. అదే.. క్యారెట్- బీట్‌రూట్ సూప్.

క్యారెట్- బీట్‌రూట్ కలిపి సూప్ చేసుకుంటే, ఆ సూప్ కలర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా మీ అందాన్ని కలర్‌ఫుల్‌గా మారుస్తుంది. దీనిని ఎలా తయారు చేయాలి, కావలసిన పదార్థాలేమిటో ఇక్కడ తెలుసుకోండి. క్యారెట్- బీట్‌రూట్ సూప్ రెసిపీ కోసం ఈ కింద చూడండి.

Carrot Beetroot Soup Recipe కోసం కావలసినవి

  • 5 కప్పుల క్యారెట్ ముక్కలు
  • 1 కప్పు బీట్‌రూట్ ముక్కలు
  • 1 టీస్పూన్ల అల్లం
  • 1 టీస్పూన్ల వెల్లుల్లి
  • 1/4 టీస్పూన్ జీలకర్ర
  • ఉప్పు రుచికి తగినంత
  • నల్ల మిరియాల పొడి రుచికి తగినంత
  • 1/2 టీస్పూన్ నిమ్మరసం
  • 1 టీస్పూన్ వెన్న

క్యారెట్ బీట్‌రూట్‌ సూప్ తయారీ విధానం

  1. ముందుగా కుక్కర్‌లో వెన్న వేడి చేసి, అందులో జీలకర్ర వేయండి. అవి చిటపటలాడినప్పుడు అల్లం తురుము, వెల్లుల్లి వేసి వేయించాలి.
  2. తరవాత అందులో తరిగిన క్యారెట్, బీట్‌రూట్‌ ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు వేసి వేయించండి. ఆపై సుమారు ఒక గ్లాసు నీళ్లు పోసి ఉడికించాలి.
  3. క్యారెట్‌లు, బీట్‌రూట్‌ ముక్కలు ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. ఆ తర్వాత అన్ని కలిపి బ్లెండర్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
  4. ఈ పేస్ట్‌ను తిరిగి పాన్‌లో పోసి వేడి చేయండి. అవసరం మేరకు కొన్ని నీళ్లు పోసి ఉడికించండి. ఇప్పుడు పైనుంచి నల్ల మిరియాల పొడి, నిమ్మరసం వేయండి. అంతే క్యారెట్ బీట్‌రూట్‌ సూప్ రెడీ.

ఇప్పుడు కప్పులోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి.