Soups for Weight Loss । ఈ సూప్‌లు ఆహారానికి ముందు ఒక గిన్నె తాగితే చాలు, కిలో బరువు తగ్గుతారు!
30 October 2022, 19:00 IST
- Healthy Soups for Weight Loss: మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ కొన్ని అద్భుతమైన సూప్‌ల రకాలను పేర్కొంటున్నాం, వాటిలో మీకు నచ్చిన సూప్‌ను రోజూ ఆహారానికి ముందు ఒక గిన్నె తాగితే చాలు.
Weight Loss Soups
ఒక గిన్నెడు సూప్ తాగితే వారం రోజుల్లో ఒక కిలో బరువు తగ్గుతారు. నిజమే అనుకుంటున్నారా? అదేం కాదు, కొన్నిసార్లు మీలో ఆశావాద దృక్పథాన్ని కల్పించడం ద్వారా కూడా కొన్నింటిని ఆచరించేలా చేయవచ్చు. సూప్‌లు తాగటం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు అనేది వాస్తవమే, అయితే కేవలం సూప్‌లు మాత్రమే తాగితే బరువు తగ్గలేరు. అందుకు సరైన ప్రణాళిక ఉండటమే కాకుండా, తగిన ఆహార నియమాలు కూడా పాటించాలి. ఆ ఆహర నియమాల్లో సూప్‌లు తాగటం కూడా ఒక భాగం.
బరువు తగ్గడానికి సూప్‌లు తాగటం ఒక గొప్ప మార్గం. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొవ్వును కారిగించే పోషకాలు, ఫైబర్, ప్రోటీన్, ఇంకా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాబట్టి వీటిని తాగటం ద్వారా కూడా మీకు ఆకలి తీరిన అనుభూతి కలుగుతుంది. పొట్ట వద్ద అదనపు కొవ్వు అనేది చేరదు.
మనం ఏదైనా పెద్ద రెస్టారెంట్‌కు వెళ్లినపుడు మనం అందించిన ఆర్డర్ తీసుకొచ్చేలోపు సూప్‌లు సర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇవి ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఇలా ఆకలిని అదుపులో ఉంచడం ద్వారా, చిరుతిళ్లు తినడం తగ్గుతుంది. ఆ రకంగానూ బరువు పెరగటాన్ని అదుపులో ఉంచవచ్చు. మీరు ఎక్కువ శ్రమ పడకుండానే బరువు తక్కువ కావచ్చు.
Healthy Soups for Weight Loss - బరువును తగ్గించే సూప్‌లు
ఈ శీతాకాలం రుచికరమైన వేడివేడి సూప్‌లు చేసుకొని తాగటానికి ఎంతో అనువైన కాలం. బరువును తగ్గించే కొన్ని అద్భుమైన సూప్‌ల రకాలు ఇక్కడ అందిస్తున్నాం చూడండి.
గ్రీన్ వెజిటబుల్ సూప్
గ్రీన్ వెజిటేబుల్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలకూర సూప్‌లో కేవలం చిటికెడు ఉప్పు వేసుకొని తాగాలి.
టోఫు సూప్
వెజిటబుల్ సూప్‌లలో టోఫు కూడా ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. తక్కువ కేలరీల సూప్‌లలో టోఫు సూప్ కూడా ఒకటి. బరువు తగ్గడానికి ఇది అత్యంత రుచికరమైన ఆప్షన్. వివిధ రుచుల కోసం వివిధ కూరగాయలను ఇందులో కలిపి సూప్ చేయవచ్చు.
క్లియర్ సూప్
ఈ సూప్ చేయడానికి మీకు నచ్చిన కూరగాయలను ఉడకబెట్టాలి. బాగా మరిగిన తర్వాత ప్యూరీలా చేసుకోవాలి. ఈ సూప్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రుచి కోసం, దీనిలో కొన్ని నల్ల మిరియాలు లేదా వెల్లుల్లిని కలుపవచ్చు. అయితే కూరగాయలు అన్నప్పుడు దుంపలు చేర్చుకోకూడదు. దుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, అవి బరువు పెరుగుదలకు కారణం కావచ్చు.
క్యాబేజీ సూప్
క్యాబేజీ, క్యారెట్, బఠానీలు, క్యాప్సికమ్ అన్ని కూరగాయలను కలిపి ప్రెజర్ కుక్కర్‌లో బాగా ఉడికించాలి. ఆపై వాటిని స్మూతీ చేసి, చిటికెడు ఉప్పు వేసి తాగాలి. అయితే థైరాయిడ్ ఉన్నవారు ఈ సూప్ నివారించాలి.
చికెన్ సూప్
మీరు నాన్ వెజిటేరియన్ అయితే అప్పుడప్పుడు చికెన్ సూప్ చేసుకోవచ్చు. ఇందులో కొవ్వు తక్కువ ఉంటుంది లేదా ఫిల్టర్ చేసిన చికెన్ రసం తీసుకోవచ్చు.
స్వీట్ కార్న్ సూప్ లేదా బంగాళాదుంప సూప్ వంటివి ఎక్కువ క్యాలరీలు కలిగి ఉండవచ్చు. అలాంటి వాటిని మానుకోండి, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
సూప్‌లు తాగటంతో పాటు క్రమం తప్పని వ్యాయామాలు, మెరుగైన నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలిని అనుసరిస్తే పొట్ట కొవ్వును కరిగించుకోవచ్చు, బరువును ఆరోగ్యకరమైన స్థితిలోకి తగ్గించుకోవచ్చు.