Tofu Benefits | మాంసాహారానికి ప్రత్యామ్నాయం టోఫు.. పోషకాలు అందించడంలోనూ తోపు!
World Tofu Day - మాంసాహారం లాంటి రుచి, మంచి ప్రోటీన్లు శాఖాహారంలో లభించాలంటే టోఫు తినండి. ఈ టోఫు ఎలాంటి, దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
చాలా మందికి శాఖాహారులకు మాంసాహారం తినాలని లేకపోయినా దాని రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాగే ఈ వర్షాకాలంలో మాంసాహారం తినకపోవటమే మంచిది. శ్రావణమాసం, డైట్ ఇతరత్రా కారణాలతో మాంసాహారం మానేయాల్సి వచ్చినా.. తినాలని కోరిక ఉన్నప్పుడు శాఖాహారాలలో కూడా అలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అందులో ఒకటి టోఫు.
ఈ టోఫు అనేది సోయాబీన్‌ల నుంచి తయారు చేసే ఒక ఆహార పదార్థం. సోయా పాలను ఘనీభవించడం ద్వారా ఇది తయారవుతుంది. చూడటానికి అచ్ఛంగా పనీర్ ను పోలి ఉంటుంది. దీనిని నేరుగా తినవచ్చు, సూప్‌లు, ఇతర వంటలలో చేర్చవచ్చు లేదా బేకరీ వంటకాలలో ఉపయోగించవచ్చు. మాంసాహార వంటలను చేసినట్లు చేయవచ్చు కాబట్టి కొంత వరకు ఆ రుచిని ఇది కలిగి ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు శాఖాహారమైన ఈ టోఫు ద్వారా పొందవచ్చు.
టోఫుతో చేసిన వంటకాలు తింటే రుచికరమైన భోజనం చేసిన అన్హుభూతి కలగటమే కాకుండా అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. ఇంకోమాటా.. ప్రతి ఏడాది జూలై 26న ప్రపంచ టోఫు దినోత్సవం (World Tofu Day) గా నిర్వహిస్తారు.
1. గుండె ఆరోగ్యానికి మంచిది
టోఫు తినడం ద్వారా రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు. కాబట్టి టోఫు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అంతేకాదు ఇది కాల్షియం కోసం మంచి వనరు. మీ ఎముకలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
టోఫు మంటను తగ్గిస్తుంది, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. UV రేడియేషన్ నుండి మన చర్మాన్ని కాపాడుతుంది. టోఫులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్‌లు జ్ఞాపకశక్తి క్షీణతను నివారించడానికి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. అంటే ఇది మీ మెదడుకు కూడా మేలు చేస్తుంది.
2. రుతుక్రమం సవరణ, రొమ్ము క్యాన్సర్ నివారణ
టోఫు తినడం ద్వారా ఆడవారి ఆరోగ్యానికి పలు విధాల మేలు కలుగుతుంది. టోఫులోని ఐసోఫ్లేవోన్లు అనే పోషకాలు ఫైటోఈస్ట్రోజెన్లుగా చెప్తారు. అంటే ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్‌లా పని చేస్తాయి. కాబట్టి నెలసరి క్రమాన్ని సరిచేసే, పీరియడ్స్ మంటను తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి. టోఫులోని పోషకాలు క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి. టోఫు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్, కడుపు క్యాన్సర్ , జీర్ణ క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు పేర్కొన్నాయి.
3. ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి
టోఫు పూర్తిగా మొక్కల ఆధారిత ప్రోటీన్ పదార్థం. అధిక-నాణ్యత గల మొక్కల ప్రోటీన్‌గా ఇది ఉంటుంది. టోఫులో మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. టోఫు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కూడా అందిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్మించడానికి, వివిధ పనుల నిర్వహణకు శక్తిని అందించటానికి సహాయపడుతుంది.
4. రోగనిరోధక వ్యవస్థకు
టోఫులో జింక్ ఉంటుంది, ఇది రోగనిరోధక పనితీరుకు అవసరం. గాయాలు నయం కావటానికి, రక్తం గడ్డకట్టడంలో అలాగే సంతాన సామర్థ్యాన్ని మెరుగుపరచటంలో ఈ పోషకం సహాయపడుతుంది. ప్రతి 122 గ్రాముల టోఫులో 2 మిల్లీగ్రాముల జింక్ పొందుతారు.
5. అధిక బరువు నియంత్రణకు
టోఫులోని బ్రాంచ్-చైన్ అమైనో ఆమ్లాలు బరువును నియంత్రించడంలో, కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. క్రీడాకారుల్లో వారి సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్‌ను తగ్గించడంలో సోయా ప్రోటీన్ కూడా సహాయపడుతుంది.
సంబంధిత కథనం