తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Betel Leaf Benefits: తమలపాకు తింటే డయాబెటిస్ తగ్గుతుందా? ఎవరెవరికి లాభం..

betel leaf benefits: తమలపాకు తింటే డయాబెటిస్ తగ్గుతుందా? ఎవరెవరికి లాభం..

HT Telugu Desk HT Telugu

06 June 2023, 10:02 IST

  • betel leaf benefits: తమలపాకు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. 

తమలపాకు లాభాలు
తమలపాకు లాభాలు (unsplash)

తమలపాకు లాభాలు

వేడుకల్లో భోజనం తరువాత చివర్లో స్వీట్ పాన్ తినడం తప్ప మామూలు సమయాల్లో చాలా మంది తమలపాకు తినడానికి ఇష్టపడరు. ఇంట్లో ఏదైనా పూజ సమయంలో ఈ ఆకు కనబడుతుంది అంతే. తమలపాకు తింటే మంచిది కాదేమో అనే భావనలో ఉంటారు చాలామంది. కానీ తమలపాకు లాభాలు తెలుసుకున్నాక మీరు కూడా తినడం మొదలెడతారు. అది చెడు అలవాటు కాదు. మన శరీరానికి మంచి చేస్తుంది. దేవుని పూజలో వాడే ఈ ఆకు లాభాలేంటో తెలుసుకుందాం.

ఈ ఆకును హిందీలో పాన్ కా పత్తా అంటారు. వీటిలో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, క్యాల్షియం ఉంటాయి. దీన్ని ఆయుర్వేద వైద్యంలో కూడా వాడతారు. దీనికున్న క్షారతత్వం వల్ల కడుపులో పీహెచ్ స్థాయుల్ని నియంత్రణలోకి తెస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముద్దలాగా, పౌడర్ చేసుకుని, రసం చేసుకుని ఇలా ఎలాగైనా తీసుకోవచ్చు.

తమలపాకు లాభాలు:

నొప్పులు:

ఏమైనా గాయలు, ర్యాషెస్, దెబ్బల వల్ల నొప్పి పెడుతుంటే తమలపాకు వల్ల తక్షణ ఉపశమనం దొరుకుతుంది. తాజా తమలపాకుల్ని ముద్దలా చేసి గాయం తగిలిన చోట రాసుకుంటే వెంటనే ఏవైనా నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది.

మలబద్దకం:

తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. పీహెచ్ స్థాయుల్ని నియంత్రిస్తాయి. మలవిసర్జనలో ఇబ్బంది, మలబద్దకం సమస్య ఉన్నపుడు ఈ ఆకుల్ని తినాలని ఆయుర్వేదం చెబుతుంది. ఒక రెండు తమలపాకుల్ని చేతితో నలిపి నీళ్లలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆకులు తీసేసి ఆ నీళ్లని మాత్రమే తాగాలి. పరిగడుపున ఈ నీళ్లని తాగితే మలవిసర్జన సులువుగా అవుతుంది.

జీర్ణశక్తి:

భోజనం చేసిన తరువాతే తమలపాకు ఎందుకు తింటామో తెలుసా.. ఆహారం తొందరగా జీర్ణమవుతుందని. జీవక్రియ రేటు పెంచి పేగులు ఆహారంలో ఉన్న పోషకాలన్నీ శోషించుకునేలా చేస్తుంది.

శ్వాస సంబంధిత వ్యాధులు:

జలుబు దగ్గు సమస్యలున్నపుడు ఈ ఆకు చాలా మేలు చేస్తుంది. ఈ ఆకు మీద కాస్త ఆవనూనె రాసి గోరువెచ్చగా వేడి చేయాలి. ఈ ఆకును చాతీ మీద పెట్టాలి. దానివల్ల శ్వాస సులువుగా తీసుకోవచ్చు. లేదా రెండు మూడు ఆకుల్ని నీళ్లలో మరిగించి రోజుకు రెండు మూడు సార్లు తీసుకున్నా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

డయాబెటిస్:

కొన్ని పరిశోధనల ప్రకారం తమలపాకు పొడిని వాడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయని తేలింది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి వాపు లక్షణాలు అదుపులో ఉంచుతుంది. ఉదయాన్నే పరిగడుపున ఈ ఆకును నమలడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఎలా తీసుకోవాలి:

  1. కాస్త ఒత్తిడిగా అనిపిస్తే ఒక తమలపాకు నమలండి లేదా స్వీట్ పాన్ తినండి. వెంటనే ఉల్లాసంగా అనిపిస్తుంది.
  2. మలబద్దకం తగ్గడానికి రాత్రంతా తమలపాకులు నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగండి. చాలా మార్పుంటుంది.
  3. మధుమేహం కోసం ఉదయాన్నే పరిగడుపున తమలపాకు నమిలితే చాలు.