తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Tips | తినగానే అలసిపోయినట్లు అనిపిస్తోందా? దానికి కారణం ఇదే!

Health Tips | తినగానే అలసిపోయినట్లు అనిపిస్తోందా? దానికి కారణం ఇదే!

Hari Prasad S HT Telugu

05 February 2022, 5:33 IST

    • Health Tips | నిజానికి తినగానే ఎవరికైనా కొత్త శక్తి రావాలి. కానీ చాలా మందికి తిన్న వెంటనే అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఇది సహజమే. కానీ ప్రతిసారీ తిన్న వెంటనే ఇలా అవుతుందంటే మాత్రం మీలో ఏదో ఒక అనారోగ్యం దాగి ఉన్నట్లే.
తినగానే అలసినట్లు అనిపించడం సాధారణమే
తినగానే అలసినట్లు అనిపించడం సాధారణమే (Pexels)

తినగానే అలసినట్లు అనిపించడం సాధారణమే

అసలు తినగానే ఇలా ఎందుకు అలసిపోయినట్లు అనిపిస్తుంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఈ అలసటను దూరం కావాలంటే ఏం చేయాలి? ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం.

తినగానే అలసట ఎందుకు?

తినగానే చాలా మంది అలసిపోయినట్లు ఫీలవుతుంటారు. కొందరికి ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఫీలింగ్‌ ఎదురవుతుంది. మరికొందరికి మాత్రం భోజనం చేసిన ప్రతిసారీ ఇలాగే అవుతుంది. ఇలా అవడానికి అసలు కారణలేంటో ఓసారి చూద్దాం.

ఎక్కువగా తినడం

చాలా మందికి లంచ్‌ చేయగానే నిద్ర వచ్చినట్లు అవుతుంది. దీనికి కారణం ఎక్కువగా తినడమే. ఇలా ఎక్కువగా తిన్నదానిని అరగించడానికి జీర్ణ వ్యవస్థకు ఎక్కువ సమయం పడుతుంది. మీ పొట్ట బరువుగా అనిపించి కాసేపటి వరకూ మగతగా అనిపిస్తుంది. సాధారణంగా మనం తినే భోజనం మొత్తాన్ని అరగించడానికి కనీసం రెండు గంటలు పడుతుంది. కాస్త ఎక్కువగా తింటే.. ఈ సమయం మరింత పెరుగుతుంది.

ఎక్కువ ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌ తినడం

ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన ఆహారం తినడం, జంక్‌ ఫుడ్‌ వంటివి మీ శరీరంలో కేలరీలను పెంచుతాయి. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపడంతోపాటు.. మీ బ్లడ్‌ షుగర్‌ స్థాయి కూడా పెరుగుతుంది. అందుకే మధ్యాహ్నం లంచ్‌ చేయగానే శరీరమంతా నిస్సత్తువగా అనిపిస్తుంది. అలాగే మరీ ఎక్కువగా ప్రొటీన్‌, కార్బొహైడ్రేట్స్‌ తిన్నా కూడా డేంజరే. 

ప్రతి రోజూ శరీరానికి తగిన ప్రొటీన్‌ అవసరమే కానీ.. అది ఎక్కువ కాకూడదు. డెయిరీ ఉత్పత్తులు, గుడ్లు, సోయా, పౌల్ట్రీ వంటి వాటిలో ట్రిప్టోఫాన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్‌ ఉత్పత్తికి సాయపడుతుంది. ఇది శరీరం రిలాక్స్‌ కావడానికి పనికొచ్చే హార్మోన్‌. ఈ హార్మోన్‌ స్థాయి పెరిగినప్పుడు మనకు మగతగా ఉంటుంది.

ఓ పూట తినకపోయినా..

ప్రతి రోజూ తగినంత ఆహారం తినకపోయినా లేదంటే ఓ పూట మొత్తానికే భోజనం చేయకపోయినా.. తిన్న వెంటనే నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందులోనూ ఓ పూట తినకుండా తర్వాతి పూట తింటే కాస్త ఎక్కువగానే లాగించేస్తాం. ఇది కాస్తా మగతగా అనిపించడానికి కారణమవుతుంది. టీలు, కాఫీలు తాగినప్పుడు మనకు ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ ఈ కాఫీ ఎక్కువైనా నష్టమే. మరీ ఎక్కువగా తాగితే.. ఎనర్జీ ఇచ్చే ప్రభావం తొలగిపోతుంది.

ఎక్సర్‌సైజ్‌లు చేయకపోవడం

పొద్దున లేవగానే కొన్ని కసరత్తులు చేశామంటే రోజంతా ఎంతో ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. శారీరక శ్రమ లేకపోతే శరీరం బద్ధకిస్తుంది. ఇది సహజంగానే తిన్న వెంటనే అలసిపోయినట్లు అనిపించడానికి కారణమవుతుంది. అలాగే రాత్రిపూట నిద్ర సరిగా లేకపోయినా ఇలాగే జరుగుతుంది. రాత్రి సమయంలో శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తేనే మిగతా రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం. ఇక ముందు రోజు మరీ ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నా ఇలాగే జరుగుతుంది.

ఇవే కాకుండా మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నా, రక్తహీనత ఉన్నా, కొన్ని ఆహారా పదార్థాలు పడకపోవడం, అలెర్జీలు, థైరాయిడ్‌ సమస్యలు ఉన్నా కూడా తిన్న వెంటనే అలసిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది.

ఈ సమస్య తొలగిపోవాలంటే..

తిన్న వెంటనే అలసిపోయినట్లు ఉండే ఫీలింగ్‌ తొలగిపోవాలంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని టిప్స్‌ పాటించాల్సి ఉంటుంది. ఇది ఈ ఒక్క సమస్యనే కాదు.. మీ లైఫ్‌స్టైల్‌పై చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపిస్తుంది.

నీళ్లు ఎక్కువగా తాగండి

ప్రతి రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగడం అనేది చాలా సమస్యలకు చక్కని పరిష్కారం. అలాగే తిన్న వెంటనే అలసట రాకుండా ఉండాలన్నా.. నీళ్లే మంచి మార్గం. శరీరంలో తగినన్ని నీళ్లు ఉంటే.. మీ జీవక్రియ సక్రమంగా సాగుతుంది. ఇది అలసట తగ్గి, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

సమతుల ఆహారం తీసుకోండి

శరీరంలో బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను నియంత్రించడం అనేది ఎవరికైనా అత్యవసరం. దీనికోసం సమతుల ఆహారం తీసుకోవాలి. అతిగా ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఇక ప్రతి పూటా తగిన మోతాదులో, మీ ఆకలిని సంతృప్తిపరిచేంత తినండి. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరగవుతుంది. ఉత్సాహంగా ఉంటారు. మరీ అతిగా తినడం, తక్కువగా తినడం మానుకోండి. అలాగే ఓ పూట భోజనం మానేయడం వంటివి చేయకూడదు. రోజూ ఒకే సమయానికి తినడం అలవాటు చేసుకోండి. ఓ పూట తినకుండా తర్వాతి మీల్స్‌లో అతిగా తిని లేని అలసటను తెచ్చుకోవద్దు.

కసరత్తులు, తగిన నిద్ర

ప్రతి రోజూ ఉత్సాహంగా ఉండాలంటే ఉదయాన్నే కనీసం 30 నిమిషాలు ఎక్సర్‌సైజులు చేయాల్సిందే. దీనికితోడు కంటి నిండా నిద్ర కూడా అవసరమే. రాత్రి పూట మరీ ఆలస్యంగా భోజనం చేయకండి. పడుకునే ముందు మొబైల్‌, టీవీ, ల్యాప్‌టాప్‌ వంటి అన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలకు దూరంగా ఉండండి.

కాఫీ, ఆల్కహాల్‌.. పరిమితి ఉండాల్సిందే..

కాఫీ అయినా, ఆల్కహాల్ అయినా మితంగా తీసుకుంటే నష్టం లేదు. కానీ వీటి మోతాదు పెరిగితేనే లేనిపోని సమస్యలన్నీ వస్తాయి. రోజుకు రెండు లేదంటే మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగొద్దు. అలాగే ఆల్కహాల్‌ తీసుకోవడం కూడా తగ్గించండి, వీలుంటే పూర్తిగా మానేయండి. ఇది మీ ఎనర్జీ లెవల్స్‌ను ఎంతలా పెంచుతుందో చూడండి.

టాపిక్