Nani on Mass Movies: మాస్ మూవీసే ఇండియన్ సినిమాకు మూల స్తంభాలు.. కేజీఎఫ్, వెంకటేశ్ వివాదంపై నాని
09 March 2023, 14:03 IST
- Nani on Mass Movies: మాస్ మూవీసే ఇండియన్ సినిమాకు మూల స్తంభాలు అంటూ కేజీఎఫ్, వెంకటేశ్ మహా వివాదంపై నాని పరోక్షంగా స్పందించాడు. దసరా మూవీ ప్రమోషన్లలో భాగంగా నాని ఈ కామెంట్స్ చేశాడు.
కమర్షియల్ సినిమాలపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nani on Mass Movies: టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది కేజీఎఫ్ మూవీపై డైరెక్టర్ వెంకటేశ్ మహా చేసిన కామెంట్స్. అదీ ఒక సినిమానేనా.. ఏ నీచ్ కమీనే కుత్తేగాడు సంపాదించిన బంగారమంతా తీసుకెళ్లి సముద్రంలో పారేస్తాడు.. అలా సంపాదించమని తన కొడుక్కి చెప్పి ఆ తల్లిని చూడాలని ఉంది అంటూ ఈ కేరాఫ్ కంచెరపాలెం డైరెక్టర్ కామెంట్ చేయడం వివాదానికి కారణమైంది.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తర్వాత అతడు క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు అలాంటి కేజీఎఫ్ లాగే మాస్ ఎంటర్‌టైనర్ దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేచురల్ స్టార్ నాని.. ఈ వివాదంపై పరోక్షంగా స్పందించాడు. కమర్షియల్ సినిమాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రశ్నించగా.. అవే ఇండియన్ సినిమాకు మూల స్తంభాలని అతడు అనడం విశేషం.
నాని రియాక్షన్ ఇదీ
దసరా మూవీ ప్రమోషన్లలో భాగంగా నాని ఈ వివాదంపై పరోక్షంగా స్పందించాడు. మాస్, కమర్షియల్ మూవీస్ పై మీరేమంటారు అని ప్రశ్నించగా.. "మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఇంత పెద్దగా ఉంది? అది కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ వల్లే. మనకు అలాంటి సినిమాలు లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి డబ్బు లేదా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?
అవే లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత పెద్ద సిస్టమ్స్ కూడా ఉండవు. అలాంటి సినిమాలు లేకపోతే మంచి సినిమాలు చేయడానికి ఎవరూ సాహసించరు. ఎందుకంటే ఎవరూ థియేటర్లకు రారు. ఇండియన్ సినిమాకు వెన్నెముక, మూలస్తంభాలు ఈ మాస్, కమర్షియల్ మూవీసే" అని నాని అన్నాడు.
కేజీఎఫ్ రెండు పార్ట్ లు సూపర్ డూపర్ హిట్ అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీక్వెల్ అయితే బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. అలాంటి సినిమాపై డైరెక్టర్ వెంకటేశ్ మహా నోరు పారేసుకోవడంపై చాలా మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగి వచ్చిన అతడు.. క్షమాపణ చెప్పాడు. ఆ ప్యానెల్లో చాలా చర్చ జరిగిందని, కేవలం రెండు నిమిషాల క్లిప్ చూసి ట్రోల్ చేయడం సరికాదని అన్నాడు.