తెలుగు న్యూస్  /  Entertainment  /  Director Venkatesh Maha Ask Apology For His Comments

Venkatesh Maha Controversy: అనడం ఎందుకు.. క్షమాపణలు చెప్పడం ఎందుకు.. నీచ్ కమీనే కామెంట్స్‌పై స్పందించిన వెంకటేష్ మహా

07 March 2023, 6:28 IST

    • Venkatesh Maha Controversy: కేజీఎఫ్ సినిమాపై అసభ్యకర కామెంట్లు చేసిన టాలీవుడ్ దర్శకుడు వెంకటేష్ మహా స్పందించారు. నీచ్ కమీనే అంటూ అందులో పాత్రను దూషించడంపై నెటిజన్లు ట్రోల్ చేయడంతో అతడు క్షమాపణలు చెప్పారు.
కేజీఎఫ్ చిత్రంపై  తన కామెంట్లపై క్షమాపణలు చెప్పిన వెంకటేష్ మహా
కేజీఎఫ్ చిత్రంపై తన కామెంట్లపై క్షమాపణలు చెప్పిన వెంకటేష్ మహా

కేజీఎఫ్ చిత్రంపై తన కామెంట్లపై క్షమాపణలు చెప్పిన వెంకటేష్ మహా

Venkatesh Maha Controversy: కేరాఫ్ కంచెరపాలెం, ఉమ మహేశ్వరాయ ఉగ్రరూపస్య లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్ మహా. తాజాగా కేజీఎఫ్2 సినిమా గురించి ప్రస్తావిస్తూ అతడు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్నే లేపాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆయనను ట్రోల్ చేస్తున్నారు. వెంకటేష్‌నే కాకుండా అతడి మాటలకు నవ్వుకున్న వివేక్ ఆత్రేయ, నందిని రెడ్డి, మోహనకృష్ణ ఇంద్రగంటిపై కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ సినిమా దర్శకుడు చేసిన పని నచ్చకపోతే విమర్శించడం వరకు ఓకే కానీ దూషించి మాట్లాడటం మాత్రం సరికాదంటూ స్పష్టం చేస్తున్నారు.

విషయంలోకి వస్తే టాలీవుడ్ దర్శకులు వెంకటేష్ మహా, నందిని రెడ్డి, వివేక్ ఆత్రేయ, మోహన కృష్ణ ఇంద్రగంటి, శివ నిర్వాణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కమర్షియల్ సినిమాల గురించి ప్రస్తావన రాగానే దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్-2 సినిమా గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అందులోని హీరో పాత్ర గురించి నీచ్ కమీనే కుత్తే అంటూ అసభ్యకరమైన పదాలను వాడాడు. హిందీ పదాలే అయినప్పటికీ ఆ మాటలు చాలా మంది తెలుగువారికి మింగుడుపడట్లేదు. ఒకటి, రెండు సినిమాలు హిట్ కాగానే.. ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా వెంకటేష్ మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న నందిని రెడ్డి, వెంకటేష్ మహా, వివేక్ ఆత్రేయ నవ్వుతూ ఉండటంతో వారిపై కూడా మండిపడుతున్నారు. వారిని కూడా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై వెంకటేష్ మహా క్షమాపణలు చెప్పారు. తాను సినిమాలోని ఓ క్యారెక్టర్‌ను మాత్రమే విమర్శించానని, కానీ రియల్ లైఫ్ పర్సన్ అయిన తనను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం సబబు కాదంటూ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.

"నేను మాట్లాడిన మాటలు నాతో పాటు కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్. నా ఒక్కడి మాటలే కాదు. బహుశా నేను వాడి భాష, మాటలకు హర్ట్ అయి ఉంటే క్షమాపణలు. కానీ నా అభిప్రాయం మాత్రం అదే. ఇంకో చిన్న విషయం చెప్పాలి. నేను మాట్లాడిన మాట ఒక సినిమాలోని కల్పిత పాత్ర గురించి. నా వ్యక్తిగతంగా అనిపించిన అభిప్రాయమది. డైరెక్టుగా ఏ వ్యక్తిని గాని, క్రియేటివ్ పర్సన్‌ను కాని దూషించలేదు. కానీ రియల్ లైఫ్ పర్సన్ అయిన నాపై దారుణంగా ట్రోల్స్ చేయడం ఎంత వరకు కరెక్టు. బహుశా నా ఒపినియన్‌ను మీరు వింటున్న విధానం వల్ల వచ్చిన సమస్య అని అనుకుంటున్నాను. గతంలోనూ నాపై ఇలాంటి ట్రోల్స్ వచ్చాయి. కాబట్టి నా ఒపినియన్‌ను గౌరవించి చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని రకాల సినిమాలను ఆదరించండి." అని వెంకటేష్ మహా అన్నారు.

వెంకటేష్ మహా మాటలకు నవ్వుతూ స్పందించిన నందిని రెడ్డి, వివేక్ ఆత్రేయ, ఇంద్రగంటి మోహన కృష్ణపై కూడా దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో వీరు కూడా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు అడిగారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.