Exit polls: ‘‘రేపు ఎగ్జిట్ పోల్ టీవీ డిబేట్లలో మా పార్టీ పాల్గొనదు.. అవి యూజ్ లెస్ డిబేట్స్’’: కాంగ్రెస్
31 May 2024, 20:24 IST
జూన్ 1న తుది దశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత.. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై న్యూస్ చానళ్లలో జరిగే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనబోమని కాంగ్రెస్ ప్రకటించింది. ఏ చర్చ జరిగినా ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా ఉండాలని ఆ కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఎగ్జిట్ పోల్స్ డిబేట్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొంది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా
Exit polls: జూన్ 1న టెలివిజన్ ఛానళ్లలో జరిగే ఎగ్జిట్ పోల్ డిబేట్లలో పాల్గొనబోమని కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత శనివారం సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడనున్నాయి. కాగా, జూన్ 4న వాస్తవ ఫలితాలు వెలువడే ముందు ఊహాగానాలు, వదంతులకు తావివ్వకూడదని పార్టీ నిర్ణయించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా శుక్రవారం తెలిపారు.
న్యూస్ చానళ్ల టీఆర్పీల కోసమే..
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారి తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉందని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. ‘‘ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అంతకు ముందు టీఆర్పీల కోసం ఊహాగానాలకు, దుష్ప్రచారాలకు పాల్పడటానికి కారణం కనిపించడం లేదు. టీవీ న్యూస్ చానళ్లల్లో జరిగే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొనదు. ఏ చర్చ అయినా అంతిమంగా ప్రజలకు సమాచారం అందించేదిలా ఉండాలి. జూన్ 4 నుంచి జరిగే చర్చల్లో సంతోషంగా పాల్గొంటాం' అని పవన్ ఖేరా ట్వీట్ చేశారు.
ఊహాగానాలతో ఉపయోగం లేదు
‘‘ఊహాగానాల వల్ల ఉపయోగం ఏంటి? చానళ్ల టీఆర్పీలు పెంచుకోవడానికి అర్థంపర్థం లేని ఊహాగానాలకు ఎందుకు దిగాలి? కొన్ని శక్తులు బెట్టింగ్ లకు పాల్పడుతున్నాయి. అందులో మనమెందుకు భాగం కావాలి? ఎవరికి ఓటు వేశారో అందరికీ తెలుసు. జూన్ 4వ తేదీన తమకు ఎన్ని ఓట్లు వచ్చాయో పార్టీలకు తెలుస్తుంది . మనం ఎందుకు ఊహాగానాలు చేయాలి?’’ అని పవన్ ఖేరా ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పవన్ ఖేరా తెలిపారు. ఓటు వేసిన తర్వాత ఓటర్లు ఏం చెబుతారనే దానిపై ఎగ్జిట్ పోల్స్ (exit polls) ఆధారపడి ఉంటాయి. జూన్ 1, శనివారం సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించకూడదు. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించవచ్చు.
1957 నుంచి ఎగ్జిట్ పోల్స్
భారతదేశంలో ఎగ్జిట్ పోల్స్ 1957లో ప్రారంభమయ్యాయి. ఏజెన్సీలు, పోల్ స్టర్లు, సెఫాలజిస్టులు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సిద్ధం చేస్తారు. ఈ మధ్య కాలంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తుది ఫలితాలతో సరిపోతున్నాయి. దాంతో, వాటికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై టీవీ చానెళ్లు డిబేట్లు నిర్వహిస్తుండగా, ఎగ్జిట్ పోల్ డేటాపై రాజకీయ పార్టీల ప్రతినిధులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎగ్జిట్ పోల్ చర్చలో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది.
ఎగ్జిట్ పోల్స్ హిట్ అండ్ మిస్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హిట్ అయిన సంఘటనలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మిస్ అయిన సంఘటనలు భారత ఎన్నికల చరిత్రలో పుష్కలంగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఎన్డీయేకు 285 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, ఎన్డీయేకు 353 సీట్లు వచ్చాయి. 2024 లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.