Factcheck: ఇండియా టుడే, టైమ్స్ నౌ సహా సంస్థలు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు
factcheck: 2024 లోక్‌సభ ఎన్నికలలో భాగంగా, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు 13 మే 2024న ముగిశాయి. ఈ నేపథ్యంలోనే India Today, Times Now, Chanakya సంస్థలు తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి అని చెప్తూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్లెయిమ్: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించి India Today, Times Now, Chanakya సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.
ఫాక్ట్(నిజం): భారత ఎన్నికల సంఘం (ECI) 19 ఏప్రిల్ 2024 నుండి ఉదయం 7 గంటల నుండి 01 జూన్ 2024 సాయంత్రం 6:30 గంటల వరకు ఎలాంటి ఎన్నికల సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేయడాన్ని నిషేధించింది. అంతేకాకుండా, 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 15 మే 2024 నాటికి India Today, Times Now, Chanakya సంస్థలు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఎగ్జిట్ పోల్స్ ప్రచురణకు సంబంధించిన నియమాలు THE REPRESENTATION OF THE PEOPLE ACT, 1951 యొక్క సెక్షన్ 126A లో పొందుపరిచారు. దీనిలో ఉన్న నిబంధనల ప్రకారంగా, ఎన్నికల సంఘం వారు నోటిఫై చేసిన సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం కానీ వాటి ఫలితాలని బహిర్గతం చేయడం కానీ నిషిద్ధం అని తెలుస్తుంది.
పైన పేర్కొన్న చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా, ECI అన్ని రాష్ట్రాల్లో చివరి దశకు ఎన్నికలు ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రచురించడాన్ని నిషేధించింది. 16 మార్చి 2024న ECI విడుదల చేసిన 2024 లోక్ సభ మరియు ఆంధ్రప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం, “ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126A, నిర్ధిష్ట కాలంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించడాన్ని మరియు దాని ఫలితాలను ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తుంది, అనగా. , మొదటి దశలో పోలింగ్ ప్రారంభానికి నిర్ణయించిన గంట నుండి అన్ని రాష్ట్రాల్లో చివరి దశ ఎన్నికల ముగింపు సమయం తర్వాత అరగంట వరకు. RP చట్టం, 1951లోని సెక్షన్ 126A యొక్క ఏదైనా ఉల్లంఘన రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడుతుంది.”
ECI (ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం దేశంలోని అన్ని లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగేసేవరకి ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి వీలులేదు, అనగా 01 జూన్ 2024 సాయత్రం 06.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి వీలులేదు.
ECI (భారత ఎన్నికల సంఘం) వారి అధికారిక X(ట్విట్టర్)లో 19 ఏప్రిల్ 2024న ఇదే విషయాన్ని తెలియజేస్తూ పోస్ట్ చేసింది. వార్తా పత్రికలు కూడా భారతదేశ ఎన్నికల సంఘం (ECI ) 19 ఏప్రిల్ 2024 ఉదయం 7 గంటల నుండి 01 జూన్ 2024 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధించడాన్ని గురించి రిపోర్ట్ చేసాయి.
అంతేకాకుండా, 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 15 మే 2024 నాటికి ఈ వైరల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు India Today, Times Now, Chanakya సంస్థలు విడుదల చేశాయా? అని ఆయా సంస్థలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ లో వెతకగా, India Today, Times Now, Today’s Chanakya సంస్థలు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినట్లు మాకు కనిపించలేదు.
పైగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు మరియు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తాము ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేయలేదని 15 మే 2024న Today’s Chanakya సంస్థ X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది.
అదేవిధంగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంటూ పలు పోస్టులు వైరల్ అయ్యాయి, వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ FACTLY రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 15 మే 2024 నాటికి India Today, Times Now, Chanakya సంస్థలు ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు.
నోట్: ఈ కథనాన్ని తొలుత ఫ్యాక్ట్‌లీ సంస్థ ప్రచురించింది. శక్తి కలెక్టివ్‌లో భాగంగా దీనిని హెచ్‌టీ తెలుగు పున: ప్రచురించింది.