Phone tapping: పోన్ ట్యాపింగ్‌పై సర్వత్రా చర్చ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం
Phone tapping: ఫోన్ ట్యాపింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేస్తుంది. నేతల మద్య మాటల యుద్దానికి దారితీస్తుంది. గత ప్రభుత్వాన్ని నిందిస్తు కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్ళించడానికి ఫోన్ ట్యాపింగ్ లీకులిస్తుందని బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
Phone tapping: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అరడజను మందికిపైగా నేతల ఫోన్ కాల్స్ ట్యాపింగ్ గురైనట్లు మాజీ ఐజి రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పడంతో ఉలిక్కిపడ్డ ఉమ్మడి జిల్లా నేతలు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఆడిపోసుకుంటున్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
తన ఫోన్ కాల్స్ ట్యాపింగ్ కావడంపై ముఖ్యమంత్రికి, డీజీపీకి ఫిర్యాదు చేస్తానని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. కేసిఆర్ ను అనర్హుడిగా ఓ ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రకటించి జైల్ కు పంపాలని డిమాండ్ చేశారు.
మాజీ ఐజి రాధాకిషన్ రావు వాంగ్మూలంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పడంతో బాధపడ్డానని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేయడం సిగ్గుచేటన్నారు. రాజకీయాల్లో సేవ చేయడానికి వచ్చిన నా లాంటి చదువుకున్న డాక్టర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిసి బాదపడుతున్నానని చెప్పారు. కొన్ని సందర్భాల్లో నా మిత్రులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడిన విషయాలు వేరే వాళ్లకు తెలిసినప్పుడు నాతో ఉండే పీఏని కొంతమంది సన్నిహితులను అనుమానించాల్సి వచ్చిందని తెలిపారు.
పది సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ సీఎం కెసిఆర్ కుటుంబ సభ్యులు ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోన్ లు ట్యాపింగ్ చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రాజకీయ నాయకులు ఫోన్లు కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిజినెస్ మ్యాన్ ల ఫోన్లు ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేస్తామనుకున్న కెసిఆర్ కుటుంబానికి ప్రజలు ఎన్నికల్లో సరైన బుద్ది చెప్పారని తెలిపారు.
సిబిఐ విచారణ చేయాలి- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిబిఐ విచారణ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ టి. జివన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో మాజీ సీఎం కేసిఆర్ వందశాతం ఇరుక్కుంటారని స్పష్టం చేశారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి, ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రప్రభుత్వం స్పందించాలని కోరారు. కేసీఆర్ అధికారం శాశ్వతం అనుకున్నారని.. ఆయనచేసిన తప్పులే అతన్ని దారుణంగా ఓడించాయని తెలిపారు. కేసిఆర్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం ఆయన స్వయంకృపరాధమేనని ఫోన్ ట్యాపింగ్ అతనే బాద్యుడని ఆరోపించారు. కేసీఆర్ కు BRS పేరు భస్మాసుర అస్త్రంగా మారుతుందన్నారు.
స్కామ్ లు బయటపడుతుంటే లీకులు- కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ ల ప్రభుత్వంగా మారిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఐదు మాసాల్లో కాంగ్రెస్ చేసింది లీకులు, సాకులు తప్ప మరొకటి లేదన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ పార్టీ అని విమర్శించారు.
వారం పదిరోజుల క్రితం వడ్ల స్కామ్ బయటపడగా తాజాగా లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఓ కంపెనీ కి చెందిన వ్యక్తి స్టాక్ ఎక్స్చేంజిలో తెలంగాణకు కొత్తగా లిక్కర్ సప్లై చేస్తున్నట్లు పెట్టడంతో లిక్కర్ స్కాం బయటపడిందన్నారు. రాష్ట్రానికి చెందిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం కొత్తగా లిక్కర్ కు అనుమతి ఇవ్వలేదంటున్నారని తెలిపారు.
పెద్ద పెద్ద కంపెనీలు ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వదని కొత్తగా మరో కంపెనీ మద్యానికి అనుమతి ఇచ్చారని, అందులో భాగంగానే లిక్కర్ కొరత ఏర్పడిందన్నారు. లిక్కర్ స్కాం, వడ్ల స్కాం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లీక్ లు ఇస్తున్నారని ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పై బురద జల్లడానికే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పేర్లను ప్రస్తావిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కొత్త లీకులు బయట పెడుతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతుందని... దానిపై ఇప్పుడు రాజకీయంగా రాద్దాంతం చేయడం ఎందుకని ప్రశ్నించారు.
(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, కరీంనగర్)
సంబంధిత కథనం