EC Notices To Pawan Kalyan : ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు, పవన్ కల్యాణ్ కు ఈసీ నోటీసులు
10 April 2024, 20:13 IST
- EC Notices To Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు ఇచ్చింది.
పవన్ కల్యాణ్
EC Notices To Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు ఈసీ షాక్ ఇచ్చింది. సీఎం జగన్(CM Jagan) పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు వివరణ ఇవ్వాలని సీఈవో ముకేష్ కుమార్ మీనా బుధవారం పవన్ కు నోటీసులు ఇచ్చారు. ఇటీవల జనసేన అనకాపల్లి వారాహి యాత్ర(Varahi Yatra)లో సీఎం జగన్ ను ఉద్దేశించి సారా వ్యాపారి, స్కాం స్టార్, లాండ్ గ్రాబర్ అంటూ పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏప్రిల్ 8న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిచారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో... తన వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్‌కు నోటీసులు(Pawan Kalyan EC Notices) జారీ చేసింది. అయితే ఏపీలో ముఖ్య నేతలకు ఇప్పటికే ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వీరిద్దరికీ ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది.
జనసేన స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే!
జనసేన ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్... వారాహి యాత్ర చేస్తున్నారు. తాజగా జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసి స్టార్ క్యాంపెయినర్లను(Janasena Star Campaigners) పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, సినీ, టీవీ ఆర్టిస్టులు సాగర్, పృథ్విరాజ్, జబర్దస్త్ కమెడియన్లు హైపర్ ఆది(Hyper Aadi), గెటప్ శ్రీను(Getup Srinu)లను జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. ఈ మేరకు జనసేన పార్టీ బుధవారం ప్రకటన జారీ చేసింది.
సీఎం జగన్ కు ఈసీ నోటీసులు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి(CM Jagan) ఈసీ ఇటీవల నోటీసులు(EC Notices) జారీ చేసింది. సీఎం జగన్ ఎన్నికల కోడ్(Election Code) ఉల్లంఘించారని టీడీపీ నేత వర్ల రామయ్య సీఈవో ముకేష్ కుమార్ మీనాకు(CEO Mukesh Kumar Meena) ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ తన ప్రసంగాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా సీఎం జగన్ కు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులపై సకాలంలో స్పందించకపోతే ఈసీ చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని సీఈవో తెలిపారు.
చంద్రబాబుకు ఈసీ నోటీసులు
ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతలు నోటికి పనిచెబుతున్నారు. దీంతో ఈసీ నేతలను అదుపు చేసేందుకు నోటీసులు ఇస్తుంది. తాజాగా సీఎం జగన్ కు నోటీసులు జారీ చేయగా... అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రులు, వైసీపీ నేతలు జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ పై చంద్రబాబు(Chandrababu) అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు సీఈవో ముకేష్ కుమార్ మీనా చంద్రబాబుకు నోటీసులు(EC Notices To Chandrababu) జారీ చేశారు. నోటీసులపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని చంద్రబాబుకు ఈసీ సూచించింది.