Virat Kohli RCB : ఆర్సీబీకి విరాట్ కోహ్లీ హీరోనా? లేక విలన్ ఆ?
07 April 2024, 11:35 IST
- Virat Kohli RCB : ఎక్కువ బాల్స్ ఆడి, సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆర్సీబీ ఓటమికి అతను కారణం అని కొందరు విమర్శిస్తున్నారు. మరి.. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ హీరోనా? లేక విలన్ ఆ?
ఆర్సీబీకి మళ్లీ ఓటి., విరాట్ కోహ్లీ తప్పేనా?
IPL 2024 Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్లో ది మోస్ట్ ఎంటర్టైనింగ్ టీమ్‌గా పేరున్న ఫ్రాంఛైజ్. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్లకు కొదవ లేదు, టాలెంట్‌కు కొరత లేదు. కానీ ఈ జట్టుకు 17ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్క ట్రోఫీ కూడా లేదు! 'ఈ సాలా కప్ నమ్దే.. కప్ నమ్దే' అంటూ ఆశలు పెట్టుకోవడం, చివరికి నెక్ట్స్ ఐపీఎల్‌కి ఆ మాటలను షిఫ్ట్ చేసుకోవడం ఫ్యాన్స్‌కి అలవాటైపోయింది. ఐపీఎల్ 2024లో కూడా ఇదే జరుగుతోంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి, మళ్లీ ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తోంది. మరీ ముఖ్యంగా.. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినా, అతని ఆట తీరును అందరు ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ మొత్తం.. ఆర్సీబీకి కట్టప్పలా ఉన్న కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి కోహ్లీ.. ఆర్సీబీకి హీరోనా? లేక విలన్ ఆ?
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినా.. తప్పని విమర్శలు!
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ.. 20ఓవర్లకు 183 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ స్కోర్ 113. అంటే.. మిగిలిన జట్టు మొత్తం కొట్టింది 59 పరుగులే. అదే సమయంలో.. 72 బంతులాడిన కోహ్లీ 113 పరుగులు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా.. 67 బాల్స్‌లో కోహ్లీ సెంచరీని చేరుకోవడం.. 'జాయింట్ స్లోయెస్ట్ ఐపీఎల్ సెంచరీగా' అది మారడంతో రన్ మెషిన్ రన్‌రేట్‌పై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ ఇలాగే ఆడితే.. టీమిండియాకు కష్టమని అందరు అంటున్నారు.
'20ఓవర్లలో 277 కొడుతున్న రోజులివి. అలాంటిది 67 బాల్స్‌లో 100 కొట్టడం ఏంటి?' అని చాలా మంది విమర్శిస్తున్నారు. ఇంకొందరైతే.. కోహ్లీ అలా నెమ్మదిగా ఆడటమే జట్టు ఓటమికి కారణం అంటున్నారు! ఐపీఎల్ 2024లో అతి చెత్త బౌలింగ్ లైనప్ ఉన్న టీమ్ ఆర్సీబీ అనడంలో ఎవరికి సందేహం లేదు. 200 టార్గెట్‌ని ఇచ్చినా.. ఆ జట్టు బౌలర్లు ప్రత్యర్థులను గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటిది.. చాలా తక్కువ రన్‌రేట్‌తో పరుగులు చేస్తే, 183 పరుగులను ఆర్సీబీ బౌలర్లు డిఫెండ్ చేయలేరని నెటిజన్లు అంటున్నారు.
RCB vs RR highlights : నిన్న మొన్నటి వరకు ఆర్సీబీకి హీరోగా ఉండే కోహ్లీ.. ఇప్పుడు విలన్ అయిపోయాడా? అంటే.. కాదు అనే చెప్పాలి! కోహ్లీ రన్‌రేట్ ఎప్పుడూ తక్కువగానే ఉందా? అంటే నెంబర్లు కాదు అనే చెబుతున్నాయి. కోహ్లీ వల్లే ఆర్ఆర్తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయిందా? అంటే నెంబర్లు కాదు అనే చెబుతున్నాయి.
ఆర్సీబీ ఓటముల్లో ప్రధాన కారణం.. కోహ్లీ మినహా ఆ జట్టులో ఎవరూ రాణించకపోవడం. కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్ ఔట్ ఆఫ్ ఫార్మ్‌లో ఉన్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో డూప్లెసిస్- కోహ్లీలు కలిసి మొదటి వికెట్‌కు 125 రన్స్ చేశారు. కానీ ఏ సమయంలోనూ డూప్లెసిస్ కంఫర్టెబుల్గా ఉన్నట్టు కనిపించలేదు. ప్రతిసారీ కోహ్లీయే ముందుండి నడిపిస్తున్నట్టు కనిపించింది. చివరికి.. 33 బాల్స్‌లో 44 పరుగులు చేసి ఔట్ అయ్యాడు డూప్లెసిస్.
ఇక ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు ఉంది పరిస్థితి! ఐపీఎల్ 2024లో ఇలా బ్యాటింగ్‌కి రావడం, అలా ఔట్ అయ్యి వెళ్లిపోవడం.. మ్యాక్స్‌వెల్‌కి అలవాటైపోయింది! ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్‌లో కూడా 3 బాల్స్‌లో 1 పరుగు చేసి ఔటయ్యాడు ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాటర్. తన మెరుపులతో ఫ్యాన్స్‌ని అలరించే మ్యాక్స్‌వెల్.. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఔటైన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ఎండ్‌లో విరాట్ కోహ్లీ ఒక్కటే నిలబడ్డాడు.
మ్యాక్స్‌వెల్ తర్వాత దినేశ్ కార్తిక్ వస్తానుకుంటే.. డెబ్యూట్ ప్లేయర్ సౌరవ్ చవాన్ వచ్చాడు. అతను పర్లేదనిపిస్తున్నా.. 6 బాల్స్‌లో 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. విరాట్‌పై మరింత ప్రజర్ పడింది. ఆ తర్వాత వచ్చిన కామరూన్ గ్రీన్.. 6 బాల్స్ ఆడి 5 పరుగులే చేశాడు. ఆర్ఆర్ బౌలింగ్ లైనప్‌ని ఎదుర్కొని ఆర్సీబీ స్కోర్‌ని కోహ్లీ తన భుజాల మీద వేసుకోవాల్సి వచ్చింది. అతను కూడా ఔట్ అయ్యి ఉంటే.. అసలు ఆర్సీబీ అంత మాత్రం స్కోరైనా చేసి ఉండేదా? అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
Virat Kohli IPL 2024 runs : నిజమే.. పవర్‌ప్లేలో విరాట్ కోహ్లీ ఇంకొన్న బౌండరీలు కొట్టి ఉండేది. 19వ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. అప్పుడు కూడా కోహ్లీ కొట్టి ఉండేది. సెంచరీ దగ్గర పడుతున్నప్పుడు.. 1 రన్ని 2 రన్స్‌గా మలిచి ఉండేది. కానీ.. ఈ క్రమంలో కోహ్లీ ఔట్ అయితే?
"ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ ఈ సిజన్లో పనిచేయడం లేదు. ఆ విషయం విరాట్ కోహ్లీకి కూడా తెలుసు. ఆర్సీబీ లైనప్ పటిష్ఠంగా ఉంది. కానీ ఆ లైనప్ ఫార్మ్‌లో లేదు. కోహ్లీ కూడా ఔట్ అయితే.. ఇంకెవరు ఆడతారు? అందుకే.. చాలా మైండ్‌ఫుల్‌గా ఆడుతున్నాడు. కోహ్లీ ఆడుతున్నట్టు.. ఎవరు ఆడట్లేదు. ఓవైపు వికెట్లు పడుతుంటే.. 'ఏదైతే అదైంది రిస్కీ షాట్లు ఆడదాం' అని కోహ్లీ అనుకోలేడు కదా. కోహ్లీ అలాగే ఆలోచిస్తే.. స్కోర్ 183 కాదు.. 120 అవుతుంది," అని ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2024లో 5 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 316 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 146. ఆర్సీబీ మిగిలిన ప్లేయర్స్‌లో కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు! కోహ్లీ తర్వాతి స్థానంలో 100 రన్స్‌తో డూ ప్లెసిస్ ఉన్నాడు.
Virat Kohli latest news : తన వెనుక ఇన్ ఫామ్ బ్యాట్స్‌మెన్ ఉన్నారని, తాను రిస్క్ తీసుకుని ఔటైనా వాళ్లు చూసుకుంటారని కోహ్లీకి నమ్మకం ఉంటే.. రన్ రేట్ పెంచి, గేర్ ఛేంజ్ చేసి ఆడలేడా? చాలా సందర్భాల్లో ఆడి చూపిచాడు కూడా!
ఓవైపు విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడుతుంటే.. మిగిలిన ఆర్సీబీ జట్టు అంతా.. ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచేందుకు పోటీపడుతోంది. వాస్తవానికి ఇది ఎప్పడూ ఉండేదే! మరి ఈసారి కోహ్లీ తప్పు అని ఎలా అనగలము?