తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Aston Martin Dbx 707। భారత్ మార్కెట్లోకి అత్యంత విలాసవంతమైన Suv కార్, ధర అదుర్స్

Aston Martin DBX 707। భారత్ మార్కెట్లోకి అత్యంత విలాసవంతమైన SUV కార్, ధర అదుర్స్

HT Telugu Desk HT Telugu

02 October 2022, 14:54 IST

    • ఆస్టన్ మార్టిన్ అత్యంత విలాసవంతమైన SUVని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ బ్రాండ్ నుంచి విడుదలైన కార్లలో ఇదే ఖరీదైనది. మరి ఈ కార్ ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
Aston Martin DBX 707
Aston Martin DBX 707

Aston Martin DBX 707

జేమ్స్ బాండ్ సినిమా సిరీస్‌తో ప్రసిద్ధి చెందిన లగ్జరీ కార్ మేకర్ ఆస్టన్ మార్టిన్, భారతదేశంలో ఒక విలాసవంతమైన కారును విడుదల చేసింది. Aston Martin DBX 707 పేరుతో విడుదలైన ఈ కార్ అత్యంత విలాసవంతంగా ఉంది. ఆస్టన్ మార్టిన్ బ్రాండ్ లైనప్‌లో ఇప్పటివరకు వచ్చిన కార్లలో ఇదే అత్యంత ఖరీదైన మోడల్.

భారత మార్కెట్లో Aston Martin DBX 707 ధర ఎక్స్-షోరూం వద్ద రూ. 4.63 కోట్లుగా ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ SUV కార్ గత ఏడాది జనవరిలో మార్కెట్లో లాంచ్ అయిన స్టాండర్డ్ DBX మోడల్ (రూ.4.15 కోట్లు) కంటే సుమారు 48 లక్షలు ఖరీదైనది.

మరి ఇంత ఖరీదైన కారులో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏం ఉన్నాయి? ఇతర ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Aston Martin DBX 707 Specs- ఇంజన్, స్పెసిఫికేషన్లు

కొత్త ఆస్టన్ మార్టిన్ DBX 707 కారులో Mercedes-AMG-సోర్స్డ్ మోడల్ కారులో ఉన్నటువంటి 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్‌ను SUV ప్యాడిల్ షిఫ్టర్‌లతో 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. వెట్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ మొత్తం 4 చక్రాలకు అందుతుంది. ఈ ఇంజన్ 707hp గరిష్ట శక్తిని, 900Nm గరిష్ట టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ విలాసవంతమైన SUV కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 100kph వేగాన్ని అందుకొని దూసుకెళ్తుంది.

అంతేకాకుండా ఈ కారులో కొత్త లాంచ్ కంట్రోల్ సిస్టమ్‌ను అందించారు. ఈ కారులో అందించిన ప్రామాణిక కార్బన్ సిరామిక్ బ్రేక్‌లు ఎంతటి వేగంలో అయినా వాహనాన్ని అదుపు చేయగలవు. DBX 707 కారులో ముందువైపు 420mm బ్రేక్ డిస్క్‌లను ,వెనుకవైపు 390mm బ్రేక్ డిస్క్‌లను పొందింది. ఇవి 6 పిస్టన్ బ్రేక్ కాలిపర్‌లతో అటాచ్ చేసి ఉన్నాయి.

Aston Martin DBX 707 Design & Features

సెంటర్ కన్సోల్‌లో డ్రైవ్ మోడ్‌ల కోసం షార్ట్‌కట్ బటన్‌లు, 10.25-అంగుళాల స్క్రీన్, నావిగేషన్ ఫంక్షన్‌లను నియంత్రించే టచ్‌ప్యాడ్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే , చేతితో కుట్టిన లెదర్ అప్‌హోల్స్టరీ ఉన్నాయి. ఎయిర్ సస్పెన్షన్, స్టీరింగ్ సిస్టమ్, పటిష్టమైన లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్ ఉన్నాయి

ఎక్స్టీరియర్స్ చూస్తే, కొత్త DBX 707 డబుల్-వేన్ మెష్ ప్యాటర్న్‌తో పెద్ద గ్రిల్‌, రీడిజైన్ చేసిన LED DRLలు, అలాగే రీవర్క్ చేసిన ఎయిర్ ఇన్‌టేక్‌లు, ఫ్రంట్ బంపర్, రూఫ్ స్పాయిలర్, క్వాడ్-ఎగ్జాస్ట్ సిస్టమ్ డక్‌టైల్-శైలి బూట్ మూత ఉన్నాయి.

సరికొత్త ఆస్టన్ మార్టిన్ DBX 707 భారతీయ రహదారులపై లంబోర్ఘిని ఉరస్, పోర్షే కయెన్ టర్బో GT, మసెరటి లెవాంటే ట్రోఫియో వంటి సెగ్మెంట్ SUVలతో పోటీపడుతుంది.