జేమ్స్ బాండ్ బ్రాండెడ్ కార్ 'ఆస్టన్ మార్టిన్' ఇకపై ఎలక్ట్రిక్ వెర్షన్‌లో!
బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తమ కార్ల విక్రయాలలో కనీసం 50% ఎలక్ట్రిక్ మోడల్స్ ఉండాలని నిర్ణయించినట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోబియాస్ మోర్స్ ఒక ఆటోమోటివ్ సమ్మిట్ సందర్భంగా ప్రకటించారు. ఆస్టన్ మార్టిన్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించి రాబోయే ఎనిమిది సంవత్సరాలకు గానూ తమ EV వ్యూహానికి సంబంధించిన ప్రణాళికలను ఆయన వెల్లడించారు.
మీరు జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తారా? అందులో ముఖ్యంగా బాండ్ తన కార్‌తో చేసే విన్యాసాలు, చేజింగ్ సన్నివేశాలు, యాక్షన్ స్టంట్లు మిమ్మల్ని కళ్లప్పగించి చూసేంత అబ్బురపరుస్తాయి. బాండ్ తన సినిమాల్లో వినియోగించే కార్ బ్రాండ్ పేరు 'ఆస్టన్ మార్టిన్'. ప్రపంచ తెరపైన విశ్వవిఖ్యాత గూఢచారి జేమ్స్ బాండ్ 007కి ఎంతో ఇష్టమైన ఈ ఆస్టన్ మార్టిన్ కారు ఇకపై ఎలక్ట్రిక్‌గా మారనుంది.
2006 నుంచి జేమ్స్ బాండ్‌గా అలరించిన నటుడు డేనియల్ క్రెయిగ్ చివరగా 2021లో 'నో టైమ్ టు డై' సినిమాతో బాండ్ సినిమా సిరీస్ కు వీడ్కోలు పలకడం, మరోవైపు అతడి ఫేవరెట్ కార్ ఆస్టన్ మార్టిన్ కొత్తరూపంతో రానుండటం అంతా యాదృచ్ఛికంగా జరుగుతోంది. 2030 నాటికి బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ తమ కార్ల విక్రయాలలో కనీసం 50% ఎలక్ట్రిక్ మోడల్స్ ఉండాలని నిర్ణయించినట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోబియాస్ మోర్స్ ఒక ఆటోమోటివ్ సమ్మిట్ సందర్భంగా ప్రకటించారు.
వ్యూహాత్మక ప్రణాళిక..
ఆస్టన్ మార్టిన్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించి రాబోయే ఎనిమిది సంవత్సరాలకు గానూ తమ EV వ్యూహానికి సంబంధించిన ప్రణాళికలను ఆయన వెల్లడించారు. వారి ప్రణాళికల ప్రకారం, 2030 చివరి నాటికి పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ ఆస్టన్ మార్టిన్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆస్టన్ మార్టిన్ ఇటీవలే తమ అనేక మోడళ్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చడం ప్రారంభించింది. ఇందులో DB6 మోడల్ కూడా ఉంది, దీనినే తరచుగా జేమ్స్ బాండ్ సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. ఆస్టన్ మార్టిన్ బ్రాండ్ కార్లలో DB5, DB6 అనే మోడల్స్ బ్రిటిష్ ఆటోమోటివ్ స్టైల్ యొక్క అత్యున్నత స్టైల్ డెఫినేషన్ గా చెప్తారు. ఈ మోడెల్ కార్లను 1964-65 లో ప్రారంభించారు. జేమ్స్ బాండ్ ఫిల్మ్ 'గోల్డ్ ఫింగర్' లో స్టార్ టర్న్ ద్వారా ఆస్టన్ మార్టిన్ బ్రాండ్ పాపులర్ అయింది.
మరో కంపెనీతో ఒప్పందం..
చివరగా రిలీజైన 'నో టైమ్ టు డై'తో సహా అనేక సినిమాలలో బాండ్ కార్లుగా కనిపించిన DB5, DB6 ఇప్పుడు పరిమిత ఎడిషన్ ఎలక్ట్రిక్ కార్లుగా మాడిఫై చేస్తున్నారు. ఈ క్లాసిక్ కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మార్చడం కోసం లూనాజ్ అనే కంపెనీతో ఆస్టన్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకుంది.
DB5, DB6 ఎలక్ట్రిక్ మోడెల్ కార్లలో బ్యాటరీ, ఇంజిన్, పవర్టెయిన్‌తో పాటు సాంకేతికపరంగానూ ఆధునాతనమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బ్రేకులు, సస్పెన్షన్, స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రానిక్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటాయి. ఎలక్ట్రిక్ వెర్షన్ ఆస్టన్ మార్టిన్ DB5, DB6 కార్లు సింగిల్ ఛార్జ్‌తో 400 కిమీల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని చెబుతున్నారు.
ఇకపై జేమ్స్ బాండ్ సినిమాల్లో కార్ ఛేజ్ సన్నివేశాలలో కనిపించే ఆస్టన్ మార్టిన్ కార్ ఎలక్ట్రిక్ వెర్షన్ అయి ఉండవచ్చు. బాండ్ కు ఎలక్ట్రిక్ వెర్షన్ కారు ఇస్తే ఇక ముందు దానితో ఎలాంటి విన్యాసాలు చేయగలడో మీ ఊహకే వదిలేస్తున్నాం.