Magnet-powered Car । అయస్కాంత శక్తితో నడిచే కార్.. గాలిలో దూసుకుపోతుంది!
20 September 2022, 20:49 IST
- ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కొనసాగుతుండగా, అకస్మాత్తుగా అయస్కాంత శక్తితో నడిచే కార్ టెస్ట్ డ్రైవ్ చేసుకుంది. ఇకపై ఆటోమొబైల్ తయారీదారులు ఆలోచన ఎలా ఉండబోతుంది? ఈ స్టోరీ చదవండి.
A random pic of magnetic concept car
మీరు ఇప్పటివరకు పెట్రోల్- డీజిల్‌తో నడిచే కార్లు చూశారు, CNG కార్లు చూసుంటారు, కొత్తగా LNG వాహనాలు వచ్చాయి. ఇప్పుడైతే అంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తుంది. సోలార్ కాన్సెప్ట్ కార్లు ఆవిష్కరణ అయ్యాయి. కానీ వీటన్నింటికీ భిన్నంగా అయస్కాంత శక్తితో నడిచే కార్లను చూశారా? సమీప భవిష్యత్తులో ఇలాంటి కార్లు వచ్చే అవకాశం ఉంది. తాజాగా చైనా దేశంలో అయస్కాంత శక్తితో నడిచే ఫ్లోటింగ్ కార్లను పరిశోధకులు టెస్ట్ చేశారు. ఇవి గాలిలో కూడా ఎగరగలవు. నమ్మశక్యంగా లేదు కదా? కానీ దిమ్మతిరిగిపోయే నిజం ఇది.
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డు ప్రాంతంలో ఉన్న సౌత్‌వెస్ట్ జియాతోంగ్ విశ్వవిద్యాలయంకు చెందిన పరిశోధకులు ఇటీవల అయస్కాంతాలను ఉపయోగించి కారును టెస్ట్ డ్రైవ్ చేశారు. ఈ కార్ గాలిలో ఎగిరేందుకు వీలుగా ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ కండక్టర్లతో రోడ్డును నిర్మించారు. వారు ప్రయోగాత్మకంగా పరీక్షించిన ప్యాసింజర్ కారు రోడ్డుకు 35 మిల్లీమీటర్ల ఎత్తులో తేలియాడుతూ ముందుకు ప్రయాణించింది. అదికూడా గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం విశేషం.
ఈ టెస్టుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్లోనూ వైరల్ అవుతోంది. అది ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పు వైపు ఆలోచనలను రేకెత్తిస్తోంది. ఆ వీడియోను మీరూ చూడండి.
Magnet-powered Floating Car
ప్రయాణ సమయాన్ని తగ్గించే హై-స్పీడ్ డ్రైవింగ్ కోసం భద్రతా చర్యలను అధ్యయనం చేయడానికి చైనా ప్రభుత్వ రవాణా అధికారులతో కలిసి పరిశోధకులు ఈ పరీక్షలను నిర్వహించారు. ప్యాసింజర్ వాహనాలకు మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల తక్కువ ఇంధనంతోనే ఎక్కువ దూరం వరకు పరిధిని పెంచవచ్చునని సౌత్‌వెస్ట్ జియాతోంగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మీడియాకు తెలిపారు.
అధిక వేగంతో వాహనాలను నెట్టడానికి అయస్కాంత క్షేత్రాన్ని విద్యుదీకరించే మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో ఇప్పటికే చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు 1980ల నాటి నుండే మాగ్లెవ్ రైళ్లను నడుపుతున్నాయి. చైనా గత సంవత్సరం మాగ్లెవ్ బుల్లెట్ రైలును ప్రారంభించింది, ఈ రైలు అయస్కాంత శక్తితో గంటకు 430 కిమీల వేగంతో ప్రయాణించగలదు.