Google Maps: ఎలక్ట్రిక్ వాహన దారులకు గుడ్ న్యూస్; త్వరలో గూగుల్ మ్యాప్స్ లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
18 April 2024, 16:19 IST
- Google Maps: ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు గూగుల్ శుభవార్త తెలిపింది. త్వరలో గూగుల్ మ్యాప్స్ లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను చూపనున్నట్లు వెల్లడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో పాటు వాటి పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తామని తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
EV charging stations on Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను గూగుల్ పొందుపరుస్తోంది. ముఖ్యంగా వాహనదారులకు ఉపయోగపడే అనేక ఫీచర్స్ ను ఇప్పటికే గూగుల్ మ్యాప్స్ (Google Maps) లో పొందుపర్చారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు మరింత సహాయకారిగా మారే దిశగా మరో ఫీచర్ ను తీసుకువస్తోంది. రహదారులపై ఉన్న ఈవి ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలియజేయనుంది. రాబోయే నెలల్లో ఈ ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. గూగుల్ బిల్ట్ ఇన్ సాఫ్ట్ వేర్ తో వచ్చే వాహనాలపై ఈ అప్ డేట్స్ దృష్టి పెడతాయి.
పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు
వినియోగదారుల్లో రోజురోజుకీ విద్యుత్ వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. దాంతో, రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, దూర ప్రయాణాల సమయంలో రహదారులపై ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సమస్యగా మారుతోంది. హైవేలపై పెట్రోలు బంక్ లు కనిపించినంతగా, ఈవీ చార్జింగ్ స్టేషన్లు కనిపించడం లేదు. ఒకవేళ, ఒకటి, అరా ఉన్నా అవి సరిగ్గా ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం చాలా సమస్యగా మారింది.
గూగుల్ మ్యాప్స్ తో పరిష్కారం
రాబోయే గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ఈ సమస్యను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు. హైవేలపై, ఇతర రోడ్లపై ఉన్న ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వివరాలను గూగుల్ మ్యాప్స్ లో పొందుపర్చనున్నారు. యూజర్ రివ్యూల్లోని సమాచారం ఆధారంగా ఈవీ ఛార్జర్ లొకేషన్ ను గుర్తిస్తారు. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను ఉపయోగించుకుంటారు. టర్న్ బై టర్న్ నావిగేషన్ ప్రాంప్ట్స్ తో ఈవీ ఛార్జర్ లొకేషన్ కు వెళ్లే మార్గాన్ని కూడా ఈ ఫీచర్ యూజర్లకు చూపిస్తుంది.
యూజర్ల రివ్యూ లతో మరింత సమాచారం
ఈవీ ఛార్జర్లను కనుగొనడంలో వినియోగదారులకు సహాయపడటమే కాకుండా, గూగుల్ వాటి గురించి మరింత సమాచారాన్ని సేకరిస్తోంది. వినియోగదారులు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల గురించి గూగుల్ రివ్యూ (Google Review) పోస్ట్ చేసినప్పుడు, ఆ చార్జింగ్ స్టేషన్లలోని ఇతర సదుపాయాలు, ఛార్జింగ్ ప్లగ్ ల రకం, ఛార్జింగ్ కోసం వేచి ఉన్న సమయం వంటి అదనపు సమాచారాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఆ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ను ఉపయోగించాలా వద్దా అని నిర్ణయించడానికి ఇతర వినియోగదారులకు ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మొదట గూగుల్ బిల్ట్ ఇన్ వాహనాలకే..
ప్రారంభంలో, ఈ ఫీచర్ గూగుల్ బిల్ట్-ఇన్ ఉన్న వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక నిర్దిష్ట స్థాయిలో వాహనంలోని బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడల్లా .. దగ్గర్లోని ఈవీ చార్జింగ్ పాయింట్ల సమాచారం ఆటోమేటిక్ గా వాహనం స్క్రీన్ పై కనిపిస్తుంది. మొదట ఈ ఫీచర్ అమెరికాలోని యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది. సుదూర ప్రయాణాలు చేసే ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.