Amar Singh Chamkila OTT Review: 27 ఏళ్లకే హత్యకు గురైన సెన్సేషనల్ సింగర్ బయోపిక్ ఎలా ఉందంటే! రివ్యూ
Amar Singh Chamkila Review OTT: అమర్ సింగ్ చమ్కీలా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సెన్సేషనల్ సింగర్ చమ్కీల జీవితంపై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
తన పాటలతో ఊర్రూలూగించిన గాయకుడు, మ్యూజిషియన్ అమర్ సింగ్ చమ్కీలా జీవితం ఆధారంగా మూవీ తెరకెక్కింది. ‘అమర్ సింగ్ చమ్కీలా’ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఏప్రిల్ 12 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 1980ల్లో అత్యంత వేగంగా పాపులారిటీ దక్కించుకొని ‘ఎల్విస్ ఆఫ్ పంజాబ్’గా పేరు తెచ్చుకున్న చమ్కీలా 27 ఏళ్ల వయసులోనే హత్యకు గరయ్యారు. ఆయన జీవితంపై వచ్చిన అమర్ సింగ్ చమ్కీలా సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.
సినిమా: అమర్ సింగ్ చమ్కీలా, స్ట్రీమింగ్: నెట్‍ఫ్లిక్, ఏప్రిల్ 12 నుంచి
ప్రధాన నటీనటులు: దిల్జీత్ దోసంజ్, పరిణీతి చోప్రా, అంజుమ్ బాత్రా, అపీందర్ సింగ్, అనురాగ్ ఆరోరా తదితరులు
సంగీత దర్శకుడు: ఏఆర్ రహమాన్, రచయితలు: సాజిద్ అలీ, ఇంతియాజ్ అలీ
దర్శకుడు: ఇంతియాజ్ అలీ
అమర్ సింగ్ చమ్కీలా స్టోరీ ఇది
Amar Singh Chamkila Review: అమర్ సింగ్ చమ్కీలా (దిల్జీత్ దోసంజ్), ఆయన భార్య, గాయకురాలు అమర్జోత్ అలియాజ్ బబ్బీ (పరిణీతి చోప్రా) హత్య ఘటనతో ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ఫ్లాష్‍బ్యాక్ వస్తుంది. పేద కుటుంబానికి చెందిన చమ్కీలా సింగర్ ఎలా అయ్యారు.. ఆ కాలంలో అత్యధిక క్యాసెట్లు అమ్ముడైన జానపద గాయకుడి స్థాయికి వేగంగా ఎలా ఎదిగారు.. ఆయన జీవితంలోకి అమర్జోత్ ఎలా వచ్చారు.. ఆయన పాటలపై అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమయ్యాయి.. ఎలా హత్యకు గురయ్యారు అనే అంశాలు అమర్ సింగ్ చమ్కీలా మూవీలో ఉంటాయి.
1977, 1988 మధ్య అమర్ సింగ్ చమ్కీలా మూవీ నడుస్తుంది. ముందుగా చమ్కీలా.. ఓ సాక్సులు తయారు కంపెనీలో పని చేస్తుంటారు. అయితే, చిన్నప్పటి నుంచే పాటలు అంటే ప్రాణంగా భావిస్తుంటారు. చుట్టుపక్కల పరిస్థితులపై పాటలు పాడుతుంటారు. ఈ క్రమంలో అప్పటికే పాపులర్ గాయకుడైన షిండాతో చమ్కీలాకు పరిచయం ఏర్పడుతుంది. ఆయనకు లిరిక్స్ రాసి, ట్యూన్ చేసి ఇస్తుంటాడు. ఆ తర్వాత స్టేజ్‍పై పర్ఫార్మ్ చేసే అవకాశం చమ్కీలాకు వస్తుంది. అతడి పాటకు అందరూ ఫిదా అవుతారు. ఆ తర్వాత అతడి దశ మారుతుంది. చాలా ఈవెంట్లలో అవకాశం వస్తుంది. అనతికాలంలోనే సెన్సేషనల్ సింగర్ అవుతారు. ఆయన పాటలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తాయి. చమ్కీలా పాడిన పాటల క్యాసెట్లు హాట్‍కేకుల్లా అమ్ముడవుతాయి. విదేశాల్లోనూ చమ్కీలా ప్రదర్శనలు ఇస్తారు. మరోవైపు, అశ్లీల పాటలు రాసి పాడుతున్నారని ఆయనకు బెదిరింపులు కూడా వస్తాయి. అయితే, ప్రజలు మాత్రం చమ్కీలా పాటలంటే చాలా ఇష్టపడుతుంటారు. ఆ తరుణంలో చమ్కీలాపై కుట్రలు కూడా జరుగుతాయి.
ఎలా ఉందంటే..
బయోపిక్ మూవీ అంటే చాలాసార్లు ఆ వ్యక్తిని పూర్తిగా పాజిటివ్‍గా చూపించేందుకు ప్రయత్నిస్తారు. అయితే, అమర్ సింగ్ చమ్కీలా మాత్రం ఆ విషయంలో విభిన్నంగా ఉంటుంది. చమ్కీలాలోని అన్ని కోణాలను దర్శకుడు ఇంతియాజ్ అలీ ఈ చిత్రంలో తెరక్కించారు. అతడి ఆలోచనా విధానాన్ని, గాయకుడిగా ఎదగాలన్న కసిని, పరిస్థితులను ఎదుర్కొన్న తీరుని నిజాయితీగా తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. అమర్జోత్‍ను చమ్కీలా ఎందుకు వివాహం చేసుకున్నారన్న విషయాన్ని కూడా ఎలాంటి ఫిల్టర్ లేకుండా చూపించారు. ఈ నిజజీవిత కథను రచయితలు పకడ్బందీగా రాసుకున్నారు. చాలా డైలాగ్‍లు కూడా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో వచ్చే పంజాబీ పాటలు కూడా మెప్పిస్తాయి. ఆ పాటలకు హిందీ అనువాదాన్ని స్క్రీన్‍పై చూపించారు మేకర్స్.
అమర్ సింగ్ చమ్కీలా గాయకుడిగా ఎదిగే క్రమాన్ని చాలా ఎంగేజింగ్‍గా చూపించారు డైరెక్టర్ ఇంతియాజ్ అలీ. ఎక్కడా స్లో కాకుండా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. గతం, ప్రస్తుతం మధ్య స్క్రీన్‍ప్లేను నడిపిస్తూ ఇంట్రెస్ట్ పెంచారు. డ్రామా మెయింటెన్ చేశారు. పాటలు ఎక్కువగానే చూపించినా.. ఎక్కడా ఫ్లో మిస్ అవదు. పంజాబీ పాటలను ఇష్టపడే వారికి ఈ చిత్రం మరింత ఎక్కువగా నచ్చుతుంది.
ఈ సినిమాలో ఎమోషన్ సీన్లు కూడా కనెక్ట్ అవుతాయి. అమర్ సింగ్ చమ్కీలా గాయకుడిగా ఎదిగే క్రమం మెప్పిస్తుంది. చమ్కీలా పాటలకు జనాలు ఉర్రూతలుగడం, ఆయన పాడిన పాటల క్యాసెట్లు బ్లాక్‍లో అమ్ముడవడం, అమితాబ్ బచ్చన్ పర్ఫార్మ్ చేసిన స్టేజీపై కూడా పాడడం, విదేశాల్లో పర్ఫార్మెన్సులు.. ఇలా చమ్కీలా వృద్ధిని దర్శకుడు చూపించారు. ఇదే క్రమంలో వరుసగా వచ్చే బెదిరింపులతో చమ్కీలా భయపడుతుండటం, భార్య బబ్బీ గురించి ఆందోళన చెందడం, పాటను విడిచిపెట్టలేకపోడం అంశాలను ఎమోషనల్‍గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడడమంటే తప్పుగా భావించే ఆ కాలంలో.. చమ్కీలా పాటల వల్ల కొందరు మహిళలు ఆ విషయాలను మాట్లాడడం, పాటలు పాడే సీన్ మెప్పిస్తుంది.
1988లో జరిగిన అమర్ సింగ్ చమ్కీల హత్య మిస్టరీ ఇప్పటికీ తేలలేదు. ఈ హత్యపై కొన్ని కుట్ర కోణాలు ప్రచారంలో ఉన్నాయి. ఖలిస్థాన్ మిలిటెంట్లు చంపారని, ఆయన ఎదుగుదల చూడలేక ప్రత్యర్థులు హతమార్చారని, ఓ మతానికి చెందిన గ్రూప్ హతమార్చిందని ఇలా కొన్ని వాదనలు ఉన్నాయి. చమ్కీలా, అమర్జోత్ హత్య ఎవరు చేశారన్నది ఈ చిత్రంలో తేల్చలేదు.
మ్యూజిక్ కూడా హైలైట్
అమర్ సింగ్ చమ్కీలా చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ మాస్ట్రో ఏఆర్ రహమాన్ అందించిన సంగీతం హైలైట్‍గా నిలిచింది. ఓ ఎమోషనల్ సాంగ్ హృదయాన్ని తాకుతుంది. ఈ సినిమాలోని చమ్కీలా, బబ్బీ స్టేజ్ పర్ఫార్మెన్స్‌లకు చెందిన సుమారు 15 పాటలను ఆ పాత్రలను పోషించిన దిల్జీత్, పరిణితి ఒరిజినల్ వాయిస్‍తో లైవ్ రికార్డు చేశారు. ఇది కూడా ఈ చిత్రంలో బాగా మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
అమర్ సింగ్ చమ్కీల పాత్రకు పంజాబీ గాయకుడైన దిల్జీత్ దోసంజ్.. సరిగ్గా సూటయ్యారు. ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. పరిణితీ చోప్రా కూడా తన నటనతో మెప్పించారు. మిలిగిన నటీనటులు కూడా పరిమిత మేర మెప్పించారు.
చివరగా.. అమర్ సింగ్ చమ్కీలా సినిమా మొత్తం ఎంగేజ్ చేస్తుంది. నిజాయితీతో తెరకెక్కించిన బయోపిక్ మూవీలా మెప్పిస్తుంది. నటీనటులు పర్ఫార్మెన్స్, దర్శకుడు ఈ చిత్రాన్ని చూపించిన తీరు అదిరిపోయింది. అద్భుతమైన సంగీతం, పాటలు, కాస్త వినోదం, ఎమోషన్‍తో ఆకట్టుకుంటుంది. లైవ్ కాన్సెర్ట్ ఫీలింగ్‍ను కూడా ఇస్తుంది. ఈ మూవీని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అందరూ తప్పకకుండా చూసేయవచ్చు.
రేటింగ్: 3.75/5