Google layoffs: గూగుల్ లో మరోసారి ఉద్యోగుల తొలగింపు; 2024 లో రెండోసారి లే ఆఫ్స్ ప్రకటించిన టెక్ దిగ్గజం-google layoffs company announces second major round of job cuts in 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Layoffs: గూగుల్ లో మరోసారి ఉద్యోగుల తొలగింపు; 2024 లో రెండోసారి లే ఆఫ్స్ ప్రకటించిన టెక్ దిగ్గజం

Google layoffs: గూగుల్ లో మరోసారి ఉద్యోగుల తొలగింపు; 2024 లో రెండోసారి లే ఆఫ్స్ ప్రకటించిన టెక్ దిగ్గజం

HT Telugu Desk HT Telugu
Apr 18, 2024 02:23 PM IST

Google layoffs: టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసింది. 2024 లో గూగుల్ తన ఉద్యోగులను తొలగించడం ఇది రెండో సారి. 2024లో మరిన్ని ఉద్యోగాల తొలగింపు జరిగే అవకాశం ఉందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు.

గూగుల్ లే ఆఫ్స్
గూగుల్ లే ఆఫ్స్ (AFP)

Google layoffs: టెక్ దిగ్గజం గూగుల్ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను ప్రకటించింది. దీని ఫలితంగా కొంతమంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ కంపెనీ కొత్త ప్రణాళికల గురించి తెలియజేస్తూ ఉద్యోగులకు మెమో పంపించినట్లు సమాచారం.

గూగుల్ పునర్నిర్మాణ ప్రణాళికలు

కృత్రిమ మేథ (AI) తో టెక్నాలజీ రంగంలో సమూల మార్పులు వస్తున్నాయని ఉద్యోగులకు పంపించిన ఆ మెమో లో గూగుల్ (Google) సీఎఫ్ఓ రూత్ పోరాట్ తెలిపారు. ‘‘ఈ మార్పులను ఒక అవకాశంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల మంది మన వినియోగదారులకు మరింత సహాయకరమైన ఉత్పత్తులను, వేగవంతమైన పరిష్కారాలను అందించడానికి ప్రయత్నించాలి. అదే సమయంలో, ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆ మెమో లో వివరించారు.

కఠిన నిర్ణయాలు తప్పవు

‘‘కొంతమంది ప్రతిభావంతులైన సహచరులు, స్నేహితులకు వీడ్కోలు చెప్పడం మాకు బాధగా ఉంది. ఈ మార్పు కష్టమని మాకు తెలుసు’’ అని గూగుల్ ఉద్యోగులకు పంపిన ఆ నోట్ లో పేర్కొన్నారు. 2024లో మరిన్ని ఉద్యోగాల తొలగింపు జరిగే అవకాశం ఉందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఎంతమంది ఉద్యోగులు తొలగింపు

తాజా లే ఆఫ్స్ ద్వారా ఎంతమంది ఉద్యోగులను తొలగించబోతున్నారనే విషయాన్ని గూగుల్ (Google) ధృవీకరించలేదు. కానీ ఇది కంపెనీ యొక్క ఫైనాన్స్ విభాగాన్ని ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది.

ఏయే దేశాల్లోని ఉద్యోగులపై ప్రభావం

ఆసియా-పసిఫిక్, యూరప్, మధ్యప్రాచ్యంలోని గూగుల్ ఉద్యోగులపై పునర్ వ్యవస్థీకరణ ప్రభావం పడుతుందని తెలుస్తోంది. బెంగళూరు, డబ్లిన్, మెక్సికో సిటీ, అట్లాంటా, చికాగో నగరాల్లో మరిన్ని సెంట్రలైజ్డ్ హబ్ లను ఏర్పాటు చేయాలని గూగుల్ యోచిస్తోందని నివేదిక తెలిపింది.

2024లో టెక్ లేఆఫ్స్

టెస్లా, ఆపిల్, అమెజాన్ వంటి కంపెనీలు 2024, 2023 సంవత్సరాల్లో లే ఆఫ్స్ ను అమలు చేశాయి. 2024లో ఇప్పటివరకు వివిధ కంపెనీలు 58,000 మందికి పైగా టెక్ ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

Whats_app_banner