Google lay offs: గూగుల్ లో మళ్లీ ప్రారంభమైన లే ఆఫ్స్.. వందలాది ఉద్యోగులకు ఉద్వాసన
Google lay offs: ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ లో మళ్లీ లే ఆఫ్స్ పర్వం ప్రారంభమైంది. తాజాగా, ఫిట్‌బిట్ సహ వ్యవస్థాపకులు జేమ్స్ పార్క్, ఎరిక్ ఫ్రైడ్‌మాన్ సహా వందలాది ఉద్యోగులను గూగుల్ తొలగిస్తోంది.
Google lay offs: ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంజినీరింగ్, హార్డ్ వేర్ సహా పలు విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ బుధవారం ప్రకటించింది. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని సంస్థ ఫిట్ బిట్ సహ వ్యవస్థాపకులు జేమ్స్ పార్క్, ఎరిక్ ఫ్రీడ్మన్ లను కూడా తొలగించినట్లు తెలిపింది.
వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా..
సంస్థ వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గూగుల్ (Google lays off ) పలు టీమ్స్ లో ఉద్యోగాల కోతలను అమలు చేస్తోంది. ఇటీవల, పిక్సెల్, నెస్ట్, ఫిట్ బిట్ కోసం వాయిస్ అసిస్టెన్స్ అందించే టీమ్, హార్డ్ వేర్ టీమ్ ల్లో పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
ఆగ్మెంటెడ్ రియాలిటీ లో కూడా..
హార్డ్వేర్, ఇంజినీరింగ్ విభాగాల్లో వందలాది మందిని తొలగిస్తామని, అలాగే, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) టీమ్ లోని ఎక్కువ మందిని తొలగిస్తామని గూగుల్ (Google lays off ) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లేటెస్ట్ లే ఆఫ్స్ ప్రభావం గూగుల్ సెంట్రల్ ఇంజనీరింగ్ బృందంలోని వందలాది ఉద్యోగులపై కూడా పడనుందని కంపెనీ తెలిపింది. గూగుల్ 2021 లో ఫిట్ బిట్ ను 2.1 బిలియన్ డాలర్లకు గూగుల్ కొనుగోలు చేసింది. మరోవైపు ఫిట్ బిట్, ఆపిల్ వాచ్ ల ప్రధాన పోటీదారైన గూగుల్ పిక్సెల్ వాచ్ అప్డేటెడ్ వెర్షన్లను కూడా గూగుల్ విడుదల చేస్తూనే ఉంది.
2023 నుంచి..
వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 2023 ద్వితీయార్ధం నుంచి మరో విడత లే ఆఫ్స్ పై కసరత్తు ప్రారంభించామని గూగుల్ తెలిపింది. గూగుల్ లోని వివిధ టీమ్స్ లో ఈ రకమైన సంస్థాగత మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించింది. అందులో భాగంగానే తాజా లే ఆఫ్ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపింది.
ఎంతమందికి ఉద్వాసన?
తాజా లే ఆఫ్ ప్రక్రియ లో భాగంగా మొత్తం ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నామో గూగుల్ ఇంకా ప్రకటించలేదు. అలాగే, ప్రస్తుతం వాయిస్ అసిస్టెంట్, హార్డ్ వేర్ విభాగాలలో ఎంత మంది పనిచేస్తున్నారనే దానిపై కూడా స్పష్టత లేదు.
ఐటీ, టెక్ దిగ్గజాల్లో ఉద్యోగుల తొలగింపు
అమెరికా, యూరోపియన్ యూనియన్ లో నెలకొన్న ఆర్థిక మందగమనం గత ఏడాది కాలంలో ప్రధాన ఐటీ, టెక్ కంపెనీల లాభాలు, ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపింది. ఓపెన్ఏఐ చాట్ జీపీటీ విజయం తర్వాత కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానంపై మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు దృష్టి పెట్టాయి. అలాగే, గూగుల్ కూడా తన వర్చువల్ అసిస్టెంట్ కు జనరేటివ్ ఏఐ సామర్థ్యాలను జోడించాలని యోచిస్తోంది.