ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారా? ఇంటర్వ్యూల్లో ఈ తప్పులు చేయకండి’- గూగుల్ మాజీ రిక్రూటర్ సలహాలు
Interview tips: కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, లేదా మెరుగైన జాబ్ కోసం ప్రయత్నించే వారు.. ఇంటర్వ్యూల్లో ఈ తప్పులు చేయవద్దని గూగుల్ సంస్థలో ఆరేళ్లు రిక్రూటర్ గా విధులు నిర్వర్తించిన నోలన్ చర్చ్ సూచిస్తున్నారు. ఉద్యోగ ఇంటర్వ్యూలో మీ మాజీ సహోద్యోగుల గురించి ప్రతికూల వ్యాఖ్యలను చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
Interview tips: ఉద్యోగార్థులు ఇంటర్వ్యూల్లో చేయకూడని తప్పులను ఒక మాజీ గూగుల్ రిక్రూటర్ పంచుకున్నారు. చాలా మంది సహజంగా చేసే ఈ తప్పులు ఆ ఉద్యోగి పై ఫస్ట్ ఇంప్రెషన్ ను దెబ్బ తీస్తాయని ఆ గూగుల్ మాజీ రిక్రూటర్ నోలన్ చర్చ్ వివరిస్తున్నారు. అంతేకాదు, ఆ ఉద్యోగార్థి తన కలల ఉద్యోగం పొందడంలో విఫలమవ్వడానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
ఈ మాటలు అస్సలు వాడవద్దు
ఆరేళ్ల పాటు గూగుల్ (Google) డోర్ డాష్ (DoorDash) లలో రిక్రూటర్ గా పనిచేసిన నోలన్ చర్చ్ (Nolan Church) మాట్లాడుతూ.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మిమ్మల్ని ఎలా చూస్తాడో ప్రభావితం చేసే కొన్ని ప్రధాన విషయాలు కొన్ని ఉన్నాయని చెప్పారు. ‘‘మొదట, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీరు చేరబోయే ఉద్యోగంలో ఏమి మెరుగుపరచగలరని అడిగినప్పుడు, మీరు నేర్చుకోవడానికి ఏమీ లేదని, మీకు ఆల్రెడీ అన్నీ తెలుసని అర్థం వచ్చే మాటలను ఉపయోగించవద్దు. అదే సమయంలో, 'నేను చాలా కష్టపడతాను' లేదా 'నేను పర్ఫెక్షనిస్ట్'ను వంటి మాటలు కూడా వాడవద్దు. అలాంటి మాటలను క్యారెక్టర్ లోపాలుగా భావిస్తారు’’ అని చర్చ్ (Job interview tips) వివరించారు.
నిజాయితీ లేదనుకుంటారు..
‘‘అలాంటి మాటలను వాడడం వల్ల మీరు నిజాయితీగా లేరని భావించే ప్రమాదముంది. లేదా, మీరు టీమ్ ప్లేయర్ కాలేరన్న భావన కూడా వారిలో కలగవచ్చు. సాధారణంగా పర్ఫెక్షన్ ఉన్న వారి కన్నా కలిసి పనిచేసే వారినే ఉద్యోగులుగా ఎంచుకుంటారు’’ అని చర్చ్ వివరించారు.
మాజీ సహోద్యోగులపై..
అలాగే, ఇంటర్వ్యూల్లో మీ పాత యజమాని గురించి కాని, గతంలో మీరు పని చేసిన సంస్థలోని సహోద్యోగుల గురించి కానీ నెగటివ్ గా మాట్లాడవద్దు. దానివల్ల, మీరు నిందలను వేరే వారిపై వేసే వ్యక్తిగా ఇంటర్వ్యూయర్ భావించే ప్రమాదం ఉంది. సాధారణంగా, బాధ్యత తీసుకునే వ్యక్తిత్వం ఉన్నవారినే ఉద్యోగులుగా తీసుకుంటారు’’ అని నొలన్ చర్చ్ (Nolan Church) హెచ్చరించారు.
నాకు తెలియదు అని చెప్పొద్దు..
అలాగే, ఇంటర్వ్యూ (Job interview) లో ఏదైనా ప్రశ్నకు నాకు తెలియదు’ అనే సమాధానం ఇవ్వవద్దని చర్చ్ సూచించారు. ఎందుకంటే, అలా, తెలియదు అని ఒక్క మాటలో సమాధానమిచ్చే వ్యక్తులకు సాధారణంగా పరిష్కారం కోసం వెతికే మనస్తత్వం ఉండదని భావిస్తారు. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే, ‘నాకు కచ్చితమైన పరిష్కారం తెలియదు కానీ, ఇలా చేయవచ్చు అని భావిస్తున్నా’ అని సమాధానాన్ని ప్రారంభించడం మంచిదని చర్చ్ (Interview tips) సూచిస్తున్నారు.